calender_icon.png 15 March, 2025 | 1:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మన వరాల బిడ్డ

18-02-2025 12:00:00 AM

నేడు భాగ్యరెడ్డి వర్మ వర్ధంతి :

అసాధారణ సామాజిక సంస్కరణా పోరాటం తో చరిత్రలో చిరస్మరణీ య స్థానాన్ని సంపాదించుకున్న భాగ్యరెడ్డి వర్మ నేటికీ ప్రాతఃస్మరణీయులే. 137 సంవత్సరాల కిందట, హైదరాబాద్‌లో జన్మించిన తొలితరం దళితోద్యమ వై తాళికుడాయన. బాబా  హెబ్ అంబేద్కర్ కంటే ముందే, జ్యోతిరావ్ ఫులె తదనంతరం ఆర్తులు, అన్నార్తులు, దీనజనులు, హరిజనుల ఉద్ధరణ కోసం చెక్కు చెదరని నిబద్ధత, అంకుఠిత దీక్షాదక్షతలతో ఉద్యమాన్ని నడిపిన ధీరుడాయన.

భాగ్యరెడ్డి వర్మగా సుప్రసిద్ధుడైన మాదరి భాగయ్య 1888 మే 22న దళిత కుటుంబంలో రంగమాంబ, వెంకయ్య దంపతులకు జన్మించారు. వారి కులగురువు భాగయ్య పేరును ‘భాగ్యరెడ్డి’గా మార్చారు. ప్రత్యేకించి దళిత బాలికల కోసం 1906-33 మధ్య కాలంలో హైదరాబాద్ సంస్థానంలో పాతికకు పైగా పాఠశాలలు స్థాపించి వారి అభ్యున్నతికి గొప్ప కృషి సలిపారు.

1913లోనే ‘ఆర్య సమాజ్’ వార్షిక సదస్సులో సమాజానికి చేసిన సేవలకు గుర్తింపుగా ‘వర్మ’ బిరుదును పొందారు. అప్పట్లో పాఠశాలల్లో హరిజన పిల్లలకు ప్రవేశం ఉండేది కాదు. దాంతో వారిలో చదువుకోవాలన్న కోరిక జనించలేదు. కొందరిలో ఉన్నా అవకాశాలు అంతంత మాత్రమే. ఈసామియ బజారులో 1910లోనే ‘జగన్ మిత్ర మండలి’ ఆధ్వర్యంలో తొలి ప్రాథమిక పాఠశాలను భాగ్యరెడ్డి వర్మ ప్రారంభించారు.

తర్వాత కొద్దికాలానికి 2,600 మంది విద్యార్థులతో 26 పాఠశాలలయ్యాయి. అలా దళిత పిల్లల్లో పడిన విద్యాగంధ బీజం అనితర కాలంలోనే ఉద్యమ స్థాయికి చేరింది. 1917 నవంబరు 4, 5, 6 తేదీలలో బెజవాడలో ఆంధ్రప్రాంత ‘ప్రథమ పంచముల సదస్సు’ భాగ్యరెడ్డి అధ్యక్షతన జరిగింది.

గూడూరు రామచంద్రరావు పంతులు, అయ్యదేవర కాళేశ్వరరావు, వేమూరి రాంజీరావు పంతులు వంటి అగ్రవర్ణాలకు చెందిన సామాజిక కార్యకర్తలు సైతం ఈ సభల్లో పాల్గొన్నారు. 1917 డిసెంబరు 15న కలకత్తాలో అఖిలభారత హిందూ సంస్కరణ సభ జరిగింది. ఆ కార్యక్రమంలో గాంధీజీ కూడా పాల్గొన్నారు.

‘ఆదిహిందూ’ ఉద్యమ నిర్మాతగా ఆయన చరిత్రలో నిలిచారు. 1931లో ‘భాగ్యనగర్’ పక్షపత్రికను, 1937లో ‘ఆదిహిందూ’ మాసపత్రికను వర్మ ప్రారంభించారు. అవిశ్రాంత కార్యకలాపాల కారణంగా క్షయవ్యాధికి గురై తీవ్ర అస్వస్థతతో అర్ధశతాబ్ది వయసులోనే (1939 ఫిబ్రవరి 18న) మన వరాల బిడ్డ తనువు చాలించారు.

సహర్ష