01-03-2025 06:44:12 PM
మాజీ యుజిసి సభ్యుడు ప్రొఫెసర్ శివరాజ్
కామారెడ్డి,(విజయక్రాంతి): ప్రాచీన చరిత్రను వెలికి తీసే సమయం ఆసన్నమైందని భారతీయ శిక్షణ మండల్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ యుజిసి సభ్యుడు, ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ శివరాజ్ అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని భారతీయ శిక్షణ మండల తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఆర్కే డిగ్రీ & పీజీ కళాశాలలో నూతన జాతీయ విద్యా విధానం-2020పై నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పరిశోధకులు నిర్వర్తించాల్సిన కర్తవ్యం అనే అంశంపై కార్యక్రమం నిర్వహించడం జరిగిందని కామారెడ్డి జిల్లా భారతీయ శిక్షణ మండల్ ప్రముఖ పోతన్న తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారతీయ శిక్షణ మండల రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ యుజిసి సభ్యుడు, ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ శివరాజ్, భారతీయ శిక్షణ మండల తెలంగాణ రాష్ట్ర ప్రముఖ ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ మధుకర్, ఎస్ఆర్కె ప్రిన్సిపల్ దత్తాత్రి, ఆర్కే డిగ్రీ&పీజీ కళాశాల డీన్ నవీన్ పాల్గొన్నారని తెలిపారు. జ్యోతి ప్రజ్వలన, సరస్వతీ పూజ కార్యక్రమం నిర్వహించిన అనంతరం ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెసర్ శివరాజ్ మాట్లాడారు. నూతన జాతీయ విద్యా విధానం అత్యంత అవసరమైన పాలసీ అని తెలిపారు. కోవిద్ కారణంగా భారతదేశమంతటా నూతన జాతీయ విద్యా విధానం విస్తరించడానికి ఇబ్బందిలేర్పడ్డాయని, కానీ రానున్న రోజుల్లో ఈ విద్యా విధానాన్ని అన్ని రాష్ట్రాల్లో అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
ప్రాచీన చరిత్రను వెలికి తీసే సమయం ఆసన్నమైందని ఆయన ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. నూతన జాతీయ విద్యా విధానం ద్వారా సమూలమైన మార్పుల కొరకు భారతీయ శిక్షణ మండల ఆధ్వర్యంలో నూతన పోకడలతో, గతంలో భారతదేశం ప్రపంచానికి అందించిన విషయాలను సమగ్రంగా అధ్యయనం చేస్తుందని వారు పేర్కొన్నారు. విద్యార్థులు క్రొత్త క్రొత్త విధానాలను అలవర్చుకొని, భారతీయ చరిత్రకు తిరిగి పురుడు పోసేందుకు కంకణ బద్ధులై పరిశోధకులుగా మారాలన్నారు. మల్టీ డిసిప్లినరీ ద్వారా విద్యా విధానం, 2047 వికసిత్ భా, లోకల్ ఫర్ లోకల్ కార్యక్రమాలను భారతీయ శిక్షణ్ మండల్ ప్రతి విద్యా సంస్థల్లో నెలకొల్పుతూ ముందుకు తీసుకెళుతుందన్నారు. అంతకుముందు ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ మధుకర్ మాట్లాడుతూ భారతదేశానికే కాకుండా ప్రపంచానికి సైన్సును సమాజానికి పరిచయం చేసిన మహామహులు ఎంతో మంది ఉన్నారని, అందుకు ఉదాహరణ నిన్నటి జాతీయ సైన్స్ దినోత్సవం నిర్వహించిన సివి రామన్ పరిశోధనలే ఇందుకు తార్కాణం అని అన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ శిక్షణ్ మండల్ రాష్ట్ర, జిల్లా ప్రతినిధులు డాక్టర్ సతీష్, డాక్టర్ పూర్ణ, డాక్టర్ పోతన్న, తెలంగాణ ప్రాంత సంఘటన మంత్రి దేవరాజ్, స్వదేశీ జాగరణ మంచ్ జిల్లా కన్వీనర్ డాక్టర్ రాహుల్ కుమార్, డాక్టర్ సంతోష్ గౌడ్,ఆర్కే డిగ్రీ,పీజీ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.