calender_icon.png 20 October, 2024 | 10:59 AM

ఓయూ ఇంజినీరింగ్ కాలేజీకి జాదవ్ పేరు పెట్టాలి

20-10-2024 02:00:45 AM

హుస్సేని ఆలం, ఓయూలలో స్మారక చిహ్నాలు నిర్మించాలి 

తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 19 (విజయక్రాంతి): తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన అనేక ఉద్యమాలలో కీలక పాత్ర పోషించిన దివంగత ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ విగ్రహాన్ని హుస్సేని ఆలం, ఉస్మానియా యూనివర్సిటీలలో ఏర్పాటు చేయడంతో పాటు ఉస్మానియా ఇంజినీరింగ్ కళాశాలకు ఆయన పేరు పెట్టాలని తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణ యునైటెడ్ ఫ్రం ట్ అధ్యక్షురాలు విమలక్క, మాజీ సెక్రటరీ జనరల్ దిలీప్‌కుమార్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం 1952లో కొనసాగిన ముల్కీ ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర తొలి, మలి దశ ఉద్యమాల్లో ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. తెలంగాణ జేఏసీ ఏర్పాటు కంటే ముందుగా తెలంగాణ ఐక్య వేదిక ద్వారా లక్షల మందితో వరంగల్‌లో సభ నిర్వహించి ఉద్యమానికి ఊపిరినిచ్చారని కొని యాడారు. 2011లో ఆవిర్భవించిన తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ చైర్మన్‌గా, మిలి టెంట్ పోరాటాలకు ఆద్యుడిగా నిలిచిన ప్రొ.కేశవరావు జాదవ్  మిస్టర్ తెలంగాణగా ప్రఖ్యాతి పొందారన్నారు. 2025 జనవరి 27న ఆయన జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం హుస్సేని ఆలం, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆయన విగ్రహాలను ప్రతిష్టించాలన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల ప్రొఫెసర్‌గా ఎంతోమంది గొప్ప వ్యక్తులను తయారు చేసిన ప్రొ. కేశవరావు జాదవ్ పేరును ఇంజినీరింగ్ కళాశాలకు పెట్టాలన్నారు. ఈ విషయంపై రాష్ట్రవ్యాప్తంగా సంతకాల సేకరణ చేసి ప్రభుత్వానికి అందజేయనున్నట్టు వారు పేర్కొన్నారు.