- మరోసారి గడువు పొడగింపు లేనట్టే
- బకాయిదారులపై కఠిన చర్యలకు అధికారులు సిద్ధం
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 28 (విజయక్రాంతి): హైదరాబాద్ మహానగరంలో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న నీటిబిల్లుల బకాయిల చెల్లింపునకు ప్రభు త్వం ప్రకటించిన వన్‌టైమ్ సెటిల్‌మెంట్ స్కీమ్(ఓటీఎస్) -2024 గడువు శనివారంతో ముగియనుంది. ప్రభుత్వం ఇచ్చిన గడువు(నవంబర్ 30)లోగా ఓటీఎస్‌ను సద్వినియోగం చేసుకున్న వినియోగదారులు పెండింగ్ బిల్లులో ఉన్న అసలు మొత్తం కడితే..
ఎలాంటి వడ్డీ, ఆలస్యరుసుము చెల్లించాల్సిన అవసరంలేదు. గడువు పూర్తయిన తర్వాత చెల్లిస్తే మాత్రం పెండింగ్ బిల్లుల మీద వడ్డీతో పాటు ఆలస్యరుసుము కూడా చెల్లించాల్సి వస్తుందని జలమండలి అధికారులు తెలిపారు. అక్టోబర్‌లో ప్రారంభమైన ఈ పథకం ఆనెల చివరి వరకు కొనసాగింది.
ప్రజల విజ్ఞప్తి మేరకు గడువును నవంబర్ 30 వరకు పొడగించారు. అయితే ఈ గడువును మరోసారి పొడగించే అవకాశం లేదని జలమండలి అధికారులు స్పష్టం చేశారు. డిసెంబర్ 1 నుంచి పెండింగ్ బిల్లుల వినియోగదారులపై కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు.