calender_icon.png 19 April, 2025 | 10:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎముకలు గుల్లబారితే?

06-04-2025 12:00:00 AM

చూడటానికి ఆరోగ్యంగా కనిపిస్తారు.. ఏ లక్షణాలూ ఉండవు.. కాని ఎముకలు బలహీనమవుతాయి. చిన్నగా కాలుజారిపడ్డా పుటుక్కున విరిగిపోతాయి. వ్యాధి ముదిరిందా.. ఎముకలు ఫ్రాక్చర్ అవుతాయి. ఎముకలోని పట్టుత్వాన్ని పీల్చేసి.. గుల్లగా మార్చే ఈ జబ్బు పేరు ఆస్టియో పోరోసిస్. వయసుపైబడిన వారిని సమస్యల్లోకి నెట్టే ఈ రుగ్మత ఇప్పుడు నడివయసు వారిని ఇబ్బందుల్లోకి నెడుతున్నది. శారీరక శ్రమ తగ్గడం, సూర్యరశ్మి తగలకపోవడం, పోషకాహార లోపం.. ఇవన్నీ ఈ రుగ్మతలకు బలం చేకూరుస్తున్నాయి. ఎముకల్ని బలహీనపరుస్తున్నాయి. ఈ వ్యాధి ఎందుకు వస్తుంది? రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చికిత్సలు ఏమిటి? అనే విషయాలు తెలుసుకుందాం..

సాధారణంగా ఆస్టియోపోరోసిస్‌ను ఎముక సాంద్రతతో గుర్తిస్తారు. ఇది బాగుంటే ఎముక ఆరోగ్యంగానే ఉందనుకుంటారు. అయితే సాంద్రత ఒక్కటే కాదు, ఎముక నాణ్యతా ముఖ్యమే. సాంద్రత బాగానే ఉన్నా చాలామందికి ఎముక విరుగుతుండటం చూస్తున్నాం. అందుకే ఇప్పుడు ఎముక సాంద్రత, నాణ్యత.. రెండూ తగ్గటం వల్ల ఎముక విరిగే అవకాశం ఉండటాన్ని ఆస్టియోపోరోసిస్‌గా నిర్వచిస్తున్నారు. ఎముక గుల్లబారటానికి ముందు క్షీణించే స్థితికి (ఆస్టియోపీనియా) చేరుకుంటుంది. ఆస్టియోపోరోసిస్‌లో కన్నా ఆస్టియోపీనియాలోనే ఎముకలు ఎక్కువగా విరుగుతుంటాయి. ఇందులో ఎముక ఆకృతి, నాణ్యత తగ్గుతాయి. ఎముక నాణ్యతను గుర్తించటం అంత తేలిక కాదు. ట్రాబిక్యులర్ బోన్ స్కోర్ వంటి పద్ధతులున్నాయి కాని అంతగా అందుబాటులో లేవు. 

ప్రమాదానికి కారణాలు!

వయసు: ఎముకలు గుల్లబారటానికి అతి పెద్ద ముప్పు కారణం ఇదే. ముప్పయి ఏళ్ల తర్వాత ఎముక సాంద్రత ఏటా ఒక శాతం చొప్పున తగ్గుతూ ఉంటుంది. దీంతో ఎముకలు బలహీనపడటం, గుల్లబారే ప్రమాదం పెరుగుతూ వస్తుంది. 65 ఏళ్లు దాటాక ఇది మరింత తీవ్రమవుతుంది. 

ఆడవారిలో: మగవారి కన్నా ఆడవారికి ఎముకలు గుల్లబారే ప్రమాదం ఎక్కువ. దీనికి కారణం నెలసరి నిలిచిన తర్వాత ఈస్ట్రోజన్ హార్మోన్ గణనీయంగా తగ్గిపోవడం. ఈస్ట్రోజన్ ఎముక విచ్ఛిన్నం కాకుండా, క్షీణించకుండా కాపాడుతుంది. నెలసరి నిలిచాక దీని రక్షణ తగ్గిపోతుంది. దీంతో ఎముక సాంద్రత మరింత వేగంగా తగ్గుతుంది. మగవారిలోనూ హార్మోన్ల స్థాయులు తగ్గుతాయి కాని ఇలా ఉన్నట్టుండి పడిపోవు. అందువల్ల ఎముక క్షీణత మీద ప్రభావం చూపవు. 

బలహీనత: కండరాల మోతాదు తక్కువగా ఉండటం, బలహీనంగా, బక్కపలచగా ఉండటం ఎముక క్షీణతకు దారితీస్తుంది. అందుకే లావుగా ఉండేవారితో పోలిస్తే సన్నగా ఉండేవారికి ఆస్టియోపోరోసిస్ వచ్చే అవకాశం ఎక్కువ. 

చికిత్స

ఆస్టియోపోరోసిస్ గలవారికే కాదు.. ఆస్టియోపీనియా దశలో ఉన్నవారికీ చికి త్స అవసరం. అలాగే రుమటాయిడ్ కీళ్లవాతం, మధుమేహం, గతంలో ఎముక విరిగినవారు చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. ఆస్టియోపోరోసిస్ చికిత్సలో ప్రధానమైనవి క్యాల్షియం, విటమిన్ డి. అలాగే అవసరాన్ని బట్టి ఎముక విచ్ఛిన్నతను ఆపే, కొత్త ఎముకను ఏర్పరచే మందులనూ ఇవ్వాల్సి ఉంటుంది. 

విటమిన్ డి లోపం గలవారికి ముందుగా లోడింగ్ మోతాదు అవసరం. వారానికి 60 వేల యూనిట్ల మోతాదు చొప్పున పది వారాల పాటు ఇస్తారు. అనంతరం నెలకు 60వేల యూనిట్ల చొప్పున జీవితాంతం వాడుకోవాలి. దీన్ని నెల మొత్తానికి ఒకేసారి తీసుకోవచ్చు. లేదు రోజుకు రెండు వేల యూనిట్ల చొప్పున అయినా వేసుకోవచ్చు. ఇది కొవ్వులో కరిగే విటమిన్. పెద్దమొత్తంలో తీసుకున్నప్పుడు కాలేయంలో నిల్వ ఉంటుంది. అవసరమైన మేరకు విడుదలవుతుంది. సాధారణంగా విటమిన్ డిని పొడి, ద్రవ రూపాల్లో ఇస్తారు. పోషకాలను గ్రహించుకోలేక పోవడం వంటి సమస్యలు గలవారికి ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు. విటమిన్ డి మోతాదులు మరీ మితిమీరితే దుష్ప్రభావాలు తలెత్తుతాయి. 

నెలసరి నిలిచిన మహిళలకు ఎముక విచ్ఛిన్నాన్ని ఆపే బిస్‌ఫాస్ఫోనేట్ రకం మందులు ఉపయోగపడతాయి. ఎలెండ్రోనేట్ వంటి మాత్రలను వారానికి ఒకటి పొద్దున్నే వేసుకోవాలి. గంట సేపటి వరకు పడుకోకూడదు. వీటితో సమస్య ఏంటంటే.. ఇవి ఎముకలో జీవితాంతం అలాగే ఉండిపోవడం. ఎముక పునర్నిర్మాణంలో ఎముక విచ్ఛిన్నం కావడం, కొత్త ఎముక ఏర్పడటం రెండూ ముఖ్యం.

లక్షణాలు

ఆస్టియోపోరోసిస్ ఉన్నా పైకేమీ తెలియదు. దీని మూలంగా తలెత్తే వెన్నెముక ఫ్రాక్చర్లు సైతం భిన్నంగా ఉంటాయి. ఎరుపు, వాపు వంటివేవీ ఉండవు. కాని ముందుకు వంగిపోతారు. వయసు పెరిగేవారిలో దీన్ని తరచూ చూస్తూనే ఉంటాం. శరీర ఎత్తు తగ్గటమూ మరో సంకేతం. కొన్నిసార్లు ఎముక నొప్పి, నడుం నొప్పి, బలహీనత కూడా ఉండొచ్చు. ఇలాంటివి తప్ప పెద్దగా లక్షణాలేవీ ఉండవు. అందుకే దీన్ని చాలామంది బలహీనతగానే భావిస్తుంటారు. ఇదే పెద్ద సమస్య. ఎముక విరిగేంత వరకూ గుల్లబారిన సంగతే బయటపడదు.

ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..

మనదేశంలో నలభై ఏళ్ల తర్వాత ఎముక నొప్పి, కీళ్ల నొప్పి, నడుం నొప్పి సమస్యలు లేని మహిళలు లేరంటే అతిశయోక్తి కాదు. దీనికి ప్రధాన కారణం 30 ఏళ్ల వయసులో ఎముక సాంద్రత తక్కువగా ఉండటమే. ఈ వయసులో ఎముక సాంద్రత, నాణ్యత తగ్గితే.. ముందు ముందు ఎముక క్షీణిస్తూ వస్తున్నా విరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ముందు నుంచే జాగ్రత్తపడాలి. ఎముక నిర్మాణంలో క్యాల్షియం చాలా కీలకం. క్యాల్షియం పుష్కలంగా ఉండే పాలు, పెరుగు, మజ్జిగ, చీజ్ వంటివి తగినంత తీసుకోవాలి. మనం తినే ఆహారంలో వీటితోనే 70 శాతం క్యాల్షియం లభిస్తుంది. మిగతా పదార్థాల్లో కొద్దిగానే ఉంటుంది.

ట్యాబ్లెట్స్ కన్నా ఆహారం ద్వారా లభించే క్యాల్షియం మంచిది. దీన్నే శరీరం బాగా గ్రహిస్తుంది. మనం తీసుకున్న క్యాల్షియం ఒంట పట్టడానికి విటమిన్ డి తప్పనిసరి. ఇది ప్రధానంగా ఎండ ద్వారానే లభిస్తుంది. చర్మానికి ఎండ తగిలినప్పుడు శరీరమే దీన్ని తయారు చేసుకుంటుంది. అన్నింటికన్నా ముఖ్యమైంది వ్యాయామం. కదలకుండా ఉండిపోతే ఎముక, కండర మోతాదు చాలా వేగంగా తగ్గిపోతాయి. వ్యాయా మం, శారీరక శ్రమతో వీటిని కాపాడుకోవచ్చు. ప్రధానంగా శరీర బరువును మోస్తూ చేసే నడక, పరుగు, మెట్లు ఎక్కడం వంటివి బాగా ఉపయోగపడతాయి. 

 డాక్టర్ రాఘవ ఆదిత్య

ఎం.ఎస్ (ఆర్తో), జాయింట్ రిప్లేస్‌మెంట్ సర్జన్ 

ఓజోన్ హాస్పిటల్, కొత్తపేట, హైదరాబాద్