calender_icon.png 19 January, 2025 | 6:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉస్మానియా ఐసీసీ నివేదికపై స్టే

12-07-2024 01:55:00 AM

పిటిషనర్లకు ఫిర్యాదు కాపీలు ఇవ్వాలి

హైకోర్టు ఆదేశాలు

హైదరాబాద్, జూలై 11 (విజయక్రాంతి): ఉస్మానియా మెడికల్ కాలేజీలో పీజీ విద్యార్థినిపై లైంగిక వేధింపుల కేసులో అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ఐసీసీ) ఇచ్చిన రెండు వేర్వేరు నివేదికల అమలును నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఫిర్యాదు ప్రతులను ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ఇవ్వకపోవడంపై వివరణ ఇవ్వాలంటూ అంతర్గత కమిటీ చైర్మన్, సభ్యులతోపాటు డీఎంఈ, ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ సూపరింటెండెంట్లకు నోటీసులు జారీ చేసింది.

అదేవిధంగా లైంగిక వేధింపులకు గురైనట్లు ఫిర్యాదు చేసిన విద్యార్థినిని కూడా ప్రతివాదిగా చేర్చాలని ఆదేశించింది. సహచర పీజీ విద్యార్థినిపై లైంగిక వేధింపుల వ్యవహారంలో ఐసీసీ ఇచ్చిన నివేదికను సవాలు చేస్తూ ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థులతోపాటు మాజీ ప్రొఫెసర్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ ఫిర్యాదు కాపీని, సాక్షుల వాంగ్మూలాలను పిటిషనర్లకు ఇవ్వలేదన్నారు. సాక్షులను ప్రశ్నించే అవకాశం ఇవ్వకపోవడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. ఈ వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి లైంగిక ఆరోపణలకు సంబంధించి పిటిషనర్లపై మే 24, 25 తేదీల్లో ఐసీసీ ఇచ్చిన రెండు నివేదికల అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను ఈనెల 30వ తేదీకి వాయిదా వేశారు.