- 32 ఎకరాల్లో ఆధునిక హంగులతో నిర్మాణం
- హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 30 (విజయక్రాంతి): నగర నడిబొడ్డున వందేండ్లకు సరిపడేలా ఆధునిక హంగులతో ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనాన్ని దాదాపు 32 ఎకరాల్లో ప్రభుత్వం నిర్మించబోతున్నదని హైద రాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. ఆసుపత్రి ప్రతిపాదిత గోషామహల్ పోలస్ స్టేడియాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. స్టేడియం చుట్టూ బైక్‌పై తిరుగుతూ రోడ్లు, నాలా, స్టేడియం, వివిధ భవనాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు గోషామహల్ స్టేడియం, స్థల పరిశీలన చేశామని చెప్పారు. హైదరాబాద్‌తో పాటు యావత్ తెలంగాణకు సేవలందించేలా ఆసుపత్రి నిర్మాణం ఉంటుందన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా కనెక్టవిటీ రోడ్లను అభివృద్ధి చేయబోతున్నట్లు తెలిపారు.
పేట్ల బుర్జుకు పోలీస్ ట్రెయినింగ్ సెంటర్ తరలింపు
ప్రస్తుతం గోషామహల్‌లో ఉన్న పోలీస్ ట్రెయినింగ్ కేంద్రం, భవనాలను పేట్లబుర్జులో పోలీస్ ట్రాన్స్‌పోర్ట్ కేంద్రం వద్ద ఏర్పాటు చేయబోతున్నట్లు కలెక్టర్ అనుదీన్ తెలిపారు. అందుకోసం పేట్లబుర్జులో ఇటీవల స్థల పరిశీలన చేసినట్లు చెప్పారు. కలెక్టర్ వెంట ఇన్‌చార్జి ఆర్డీవో జ్యోతి, ఏసీపీ ఉదయ్‌కృష్ణ, తహసీల్దార్ ప్రేమ్‌కుమార్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ సయ్యద్ సైదుద్దీన్, సర్వేయర్లు ఉన్నారు.