calender_icon.png 10 January, 2025 | 12:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉస్మానియా, గాంధీ పూర్వ వైభవానికి సీఎస్‌ఆర్

09-07-2024 02:13:56 AM

కంపెనీల సాయంతో దవాఖానల అభివృద్ధి: మంత్రి రాజనర్సింహ

హైదరాబాద్, జూలై 8 (విజయక్రాంతి): సీఎస్‌ఆర్ నిధులతో ఉస్మానియా, గాంధీ జనరల్ హాస్పిటల్స్‌కు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఇందుకు ఫార్మా కంపెనీలు ముందుకు రావడం అభినందనీయమని చెప్పారు. సోమవారం సచివాలయంలో 12 ప్రముఖ ఫార్మా కంపెనీల ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు.  గాంధీ, ఉస్మానియా దవాఖానల పూర్వ వైభవానికి సామాజిక బాధ్యతగా ఫార్మా కంపెనీలు తమ సీఎస్‌ఆర్ నిధులను విరివిగా అందించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. మంత్రి విజ్ఞప్తి మేరకు గాంధీ, ఉస్మానియా దవాఖానల బలోపేతానికి ఫార్మా కంపెనీలు తమ సీఎస్‌ఆర్ విధులను అందించేందుకు సానుకూలంగా స్పందించాయి.

సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర రాజనర్సింహ సూచనల మేరకు ఆయా ఫార్మా కంపెనీల సీఎస్‌ఆర్ ఫండ్స్ విభాగాధిపతులు ఈ వారంలో ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులను స్వయంగా వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామని తెలిపారు. కార్యక్రమంలో డీఎంఈ డా.వాణి, ఉస్మానియా దవాఖాన సూప రింటెండెంట్ డా.నాగేందర్, గాంధీ   సూపరింటెం డెంట్ డా. రాజారావు, మైలాన్ లాబరేటరీ, గ్లాండ్ ఫార్మా లిమిటెడ్ , నాట్కో ఫార్మా, భారత్ బయో ఇంటర్నేషనల్ లిమిటెడ్, డాక్టర్ రెడ్డీస్ లాబరేటరీ, అరబిందో ఫార్మా లిమిటెడ్, హెటిరో డ్రగ్స్, బయోలాజికల్ ఈ లిమిటెడ్, ఎంఎస్‌ఎన్ లేబరేటరీ, దివిస్ లేబరేటరీ, విర్కో డ్రగ్స్, గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ ప్రతినిధులు పాల్గొన్నారు.

బదిలీల్లో అవకతవకలను సహించేది లేదు

వైద్య ఆరోగ్య శాఖలో చేపట్టబోయే బదిలీల్లో అవకతవకలకు అవకాశం లేకుండా చూడాలని, తప్పులు జరిగితే సహించేది లేదని మంత్రి రాజనర్సింహ స్పష్టంచేశారు. సోమవారం విభాగాధిపతులతో బదిలీలపై సమీక్షించారు.