calender_icon.png 30 January, 2025 | 8:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరల్డ్ క్లాస్ సౌకర్యాలతో ఉస్మానయా

30-01-2025 01:34:28 AM

  1. ప్రతి డిపార్ట్‌మెంట్‌కు ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్లు
  2. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఒకే చోట అన్నిరకాల డయాగ్నసిస్ సేవలు
  3. హాస్పిటల్ నిర్మాణంపై అధికారులతో సెక్రటేరియట్‌లో మంత్రి రాజనర్సింహ రివ్యూ

హైదరాబాద్, జనవరి 29(విజయక్రాంతి): అంతర్జాతీయ ప్రమాణాలతో, అత్యాధునిక టెక్నాలజీతో కొత్త ఉస్మానియా హాస్పిటల్‌ను రాష్ర్ట ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం సెక్రటేరియట్‌లో అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.

హాస్పిటల్ నిర్మాణంలో ఎటువంటి పొరపాట్లకు తావు ఇవ్వకూడదని అధికారులకు మంత్రి సూచించారు. తమకు ఉన్న 38 ఎకరాల స్థలంలో 26.30 ఎకరాలను హాస్పిటల్ కోసం ఇచ్చిన పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు, గోషామహల్ ప్రజలకు ఈ సందర్భంగా మంత్రి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఉస్మానియా హాస్పిటల్‌కు పూర్వవైభవాన్ని తీసుకొస్తామన్నారు.

26.30 ఎకరాల విస్తీర్ణంలో, 32 లక్షల స్క్వేర్ ఫీట్ సామర్థ్యంతో విశాలమైన హాస్పిటల్ భవనాలు అందుబాటులోకి తీసుకొస్తున్నామని మంత్రి తెలిపారు. నిర్మించబోయే ఆసుపత్రిలో మొత్తం 2 వేల పడకలు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రస్తుతం ఉన్న ఉస్మానియా హాస్పిటల్‌లో 22 డిపార్ట్‌మెంట్లు ఉన్నట్టు గుర్తు చేశారు.

కొత్త ఆసుపత్రిలో అదనంగా మరో 8 డిపార్ట్‌మెంట్లను ప్రారంభించనున్నట్టు చెప్పారు. ట్రాఫిక్ ఇబ్బంది తలెత్తకుండా హాస్పిటల్‌కు కేటాయించిన స్థలంలో నలువైపులా విశాలమైన రోడ్లు నిర్మించనున్నట్టు పేర్కొన్నారు. వాహనాల పార్కింగ్ కోసం ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు.

హాస్పటల్ ప్రాంగణంలో గార్డెనింగ్, ల్యాండ్ స్కేప్‌ను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అంతర్జాతీయ ప్రమాణాలు, అత్యాధునిక టెక్నాలజీ, వసతులతో కూడిన మార్చురీని నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు వెల్లడించారు. ఈ క్రమంలోనే సీఎం ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు.

అన్ని కాలేజీలూ ఇక్కడే..

కొత్త ఉస్మానియాలో నర్సింగ్, డెంటల్, ఫిజియో థెరపీ కాలేజీలు అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి తెలిపారు.  విద్యార్థుల కోసం హాస్పిటల్ ఆవరణలోనే హాస్టళ్లను నిర్మించనున్నట్టు మంత్రి దామోదర రాజనర్సింహ వె ల్లడించారు. సుమారు 750 సీట్లతో భారీ ఆడిటోరియం అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.

పేషెంట్ల సౌక ర్యార్థం అన్ని రకాల డయాగ్నసిస్ సేవలను ఒకే చోట అం దుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. మొ దటి రెండంతస్తుల్లోనే ఓపీ సేవాలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. రోజూ కనీసం 3-5వేల మంది పేషెంట్లు ఆసుపత్రికి వచ్చే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా ఓపీ కౌంటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు.

ఓపీ కోసం గంటల తరబడి లైన్‌లో నిలబడే పరిస్థితిని తీసుకురావొద్దన్నారు. ప్రతి డిపార్ట్‌మెంట్ కోసం స్టేట్ ఆఫ్ ఆర్ట్ సౌకర్యాలతో కూడిన ఆపరేషన్ థియేటర్లు, పోస్ట్ ఆపరేషన్ వార్డులు, ఐసీయూ వార్డులు అందుబాటులో ఉంచాలన్నారు. అవయవాల మార్పిడి కోసం కోసం అత్యాధునిక టెక్నాలజీతో ట్రాన్స్‌ప్లాంటేషన్ విభాగాన్ని కొత్త ఆసుపత్రిలో అందుబాటులోకి తెస్తున్నట్టు మంత్రి వెల్లడించారు.

రోగుల సహాయకుల కోసం ఆస్పత్రి ఆవరణలోనే ధర్మశాలను నిర్మిస్తున్నట్టు చెప్పారు. ఉచిత భోజన సదుపాయం కూడా కల్పించనున్నట్టు తెలిపారు. కార్పొరేట్ హాస్పిటల్స్ స్థాయిలో కొత్త ఉస్మానియాలో సేవలు అందించనున్నట్టు వెల్లడించారు. ఈ సమావేశంలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.