calender_icon.png 1 February, 2025 | 4:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండేళ్లలో ఉస్మానయా

01-02-2025 12:37:01 AM

  1. రూ.2,700 కోట్లతో 12 అంతస్తుల్లో నిర్మాణం
  2. భూమిపూజ చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
  3. 26.33 ఎకరాల్లో కొత్త దవాఖాన 
  4. వైద్యారోగ్య శాఖమంత్రి దామోదర రాజనర్సింహ

హైదరాబాద్, జనవరి 31 (విజయక్రాంతి): గోషామహల్‌లో కొత్త ఉస్మానియా హాస్పిటల్ నిర్మాణానికి సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం ఉదయం శంకుస్థాపన చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కేశవరావు, ఎంపీ అనిల్‌కుమార్, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయ లక్ష్మి, సీఎస్ శాంతికుమారి ఇతర ప్రజాప్రతినిధులు, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు డాక్టర్లు, వైద్య సిబ్బంది వేడుకలో పాల్గొన్నారు.

శంకుస్థాపన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి అక్కడే ఏర్పాటు చేసిన ఉస్మానియా ఆసుపత్రి ఫొటో ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర మాట్లాడుతూ.. ఉస్మానియా దవాఖాన అంటేనే ఓ బ్రాండ్ అని అందుకు తగ్గట్టే కొత్త ఆసుపత్రిని అత్యత్భుతంగా నిర్మిస్తామన్నారు.

భూమిపూజ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వందేండ్లుగా పేదలకు వైద్యసేవలు అందిస్తున్న ఘన చరిత్ర ఉస్మానియా హాస్పిటల్ సొంతమని తెలిపారు. ఉస్మానియా డాక్టర్లు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారని.. అటువంటి ఓ గొప్ప సంస్థకు వేదికైన పురాతన భవనం శిథిలావస్థకు చేరిందన్నారు.

ఆ భవనంలో వైద్య సేవలు అందించలేని పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ఈ నేపథ్యంలో దశాబ్దాలుగా కొత్త ఉస్మానియా హాస్పిటల్ కోసం డాక్టర్లు, వైద్య సిబ్బంది, ఈ ప్రాంత ప్రజలు ఆకాంక్షించారని తెలిపారు. ఆ ఆకాంక్షలను నిజం చేస్తూ ఈరోజు నయా ఉస్మానియా నిర్మాణానికి సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి శంకు స్థాపన చేసుకున్నామన్నారు.

అంతర్జాతీయ ప్రమాణాలతో, అత్యాధునిక టెక్నాలజీతో కొత్త ఉస్మానియా హాస్పిటల్‌ను రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నామని వెల్లడించారు. వచ్చే వందేండ్లు ప్రజలు గుర్తుంచుకొనే ఈ వేడుకలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. 

చర్లపల్లికి తరలించాలని ప్రతిపాదనలు...

నయా ఉస్మానియాను చర్లపల్లికో లేదా మరో ప్రాంతానికో తీసుకెళ్లాలని కొంతమంది ప్రపోజల్స్ పెట్టారని.. కానీ 1919 నుంచి వందేండ్లకుపైగా ఇక్కడి ప్రజలకు ఉస్మానియాతో అనుబంధం ఉందని అందుకే ఈ ప్రాంతంలోనే కొత్త హాస్పిటల్ నిర్మాణం చేపట్టాలని సీఎం నిర్ణయించారని తెలిపారు.

ఉస్మానియా ఆస్పత్రితో ఈ ప్రాం త ప్రజలకు ఉన్న అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకుని.. సీఎం రేవంత్‌రెడ్డి గోషామహల్‌లో ఎంపిక చేశారన్నారు. ఇక్కడ పోలీస్ శాఖకు ఇంకా 11 ఎకరాలకుపైగా స్థలం ఉంటుందన్నారు.

26 ఎకరాల 33 గుంటల విశాలమైన ప్రాంగణంలో 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో సుమారు రూ.2,700 కోట్లతో నిర్మించే కొత్త ఆస్పత్రిని రెండేండ్లలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామన్నారు. ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రిలో 1,168 పడకలు ఉన్నా యని.. కొత్త దవాఖానలో 2 వేల పడకలను అందుబాటులో తెస్తున్నామన్నారు.

ఇందులో 500 బెడ్ల కెపాసిటీతో ఐసీయూ వస్తుందన్నారు. ప్రస్తుత ఉస్మానియాలో 22 డిపార్ట్‌మెంట్లు ఉండగా, కొత్త హాస్పిటల్‌లో అదనంగా మరో 8 డిపార్ట్‌మెంట్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. సుమారు 41 ఆపరేషన్ థియేటర్లు నయా ఉస్మానియాలో అందుబాటులోకి తీసుకొస్తున్నామని వెల్లడించారు.

అక్కడే పలు కాలేజీలు..

హాస్పిటల్ ప్రాంగణంలోనే డెంటల్, నర్సింగ్, ఫిజియోథెరపీ కాలేజీలు ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. విద్యార్థులు, ఫాకల్టీకి అధునాతన వసతులతో కూడిన హాస్టల్ సదుపాయం, 750 సీట్ల కెపాసిటీతో ఆడిటోరియం, క్రీడా ప్రాంగణాలు ఉంటాయన్నారు. రోగుల వెంట వచ్చే వారి కోసం ధర్మశాల నిర్మిస్తున్నట్లు చెప్పారు.

హాస్పిటల్ వాతావరణం ఆహ్లాదకరంగా ఉండేలా ల్యాండ్‌స్కేప్ గార్డెన్ ఏర్పాటు చేస్తున్నామని.. స్థానికులకు ఇబ్బంది కలగకుండా హాస్పిటల్‌కు నలువైపులా విశాలమైన రోడ్లు, సుమారు 3 వేల వాహనాలు ఒకేసారి పార్కింగ్ చేసుకునేలా అండర్‌గ్రౌండ్ పార్కింగ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

స్కువాక్ నిర్మాణం చేపడుతున్నామని.. గోషామహల్ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటామన్నారు. ఫైర్ స్టేషన్, విద్యుత్ సబ్‌స్టేషన్, పోలీస్ అవుట్ పోస్ట్ వంటివి కూడా హాస్పిటల్ ప్రాంగణంలో ఉంటాయన్నారు. హాస్పిటల్ ప్రారంభమ య్యాక, స్థానికులకు వ్యాపార అవకాశాలు పెరుగుతాయని చెప్పారు.