అభిమానుల గుండెల్లో దర్శక ధీరుడిగా స్థానం పదిలపర్చుకున్నారు దర్శకు డు రాజమౌళి. ప్రేక్షకుల నమ్మకమే సోపానంగా ఎదిగిన కళామ తల్లి ముద్దు బిడ్డల్లో జక్కన్న ఒకరు. ‘ఆర్‌ఆర్‌ఆర్’తో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయి లో చాటారాయన. రాజమౌళి దర్శక త్వం వహించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు..’ పాటకు బెస్ట్ ఒరిజినల్ కేటగిరిలో అకాడమీ పురస్కారాన్ని అందజేసింది. ఎంతో మంది కలలు కనే ఆస్కార్ అవార్డు నిరుడు ఇండియన్ సినిమాను వరించటంపై భారతీయ సినీ పరిశ్రమలన్నీ గర్వంగా భావించాయి. అలా భారతీయ సినిమాను విశ్వ అవనికపై నిలిపిన రాజమౌళి కీర్తి కిరీటంలో మరో కలికి తురాయి చేరింది. ఆయన సతీమణి రమాకూ అరుదైన ఘనత దక్కింది. తాజాగా ఆస్కార్ అకాడమీలో చేరేందుకు ఈ దంపతులిద్దరూ ఆహ్వా నం అందుకున్నారు.
డైరెక్టర్ల కేటగిరిలో రాజమౌళికి, కాస్ట్యూమ్స్ డిజైనర్ విభాగంలో రమా రాజమౌళికి ఈ గౌరవం దక్కింది. ఆస్కార్ అకాడమీ ఈ ఏడాది మొత్తం 57 దేశాలకు చెందిన 487 మంది సభ్యులకు ఆహ్వానాలు పంపింది. ఈ ‘అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ ఆర్ట్స్’ ఆహ్వానం అందుకున్నవారి జాబితాలో భారతదేశం నుంచి రాజమౌ ళి దంపతులతోపాటు బాలీవుడ్ నటి షబానా అజ్మి, దర్శక నిర్మాత రీమా దాస్, నిర్మాత రితేశ్ సిద్వానీ, సినిమాటోగ్రాఫర్ రవి వర్మన్, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ తదితరులున్నారు.
ఈ ఆహ్వానాల విషయమై అకాడమీ సోషల్ మీడి యాలో ఇలా పోస్ట్ చేసింది. ‘ఈ సంవత్సరం కొత్త సభ్యులకు ఆహ్వానం పంపుతున్నందుకు సంతోషిస్తున్నాం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులైన కళాకారులు, నిపుణులకు అకాడమీ స్వాగతం పలుకుతోంది’ అని రాసుకొచ్చింది అకాడమీ. గత ఏడాది తెలుగు చిత్రసీమకు చెందిన కొందరు ప్రముఖులు ఈ అకాడమీలో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్ సభ్యులైన రామ్‌చరణ్, ఎన్టీఆర్‌తోపాటు సంగీత దర్శకుడు కీరవాణి, గీత రచయిత చంద్రబోస్‌తో పాటు సెంథిల్ కుమార్, సాబు శిరిల్ గతంలో ఈ అకాడమీలో సభ్యత్వం సాధించారు.