calender_icon.png 6 January, 2025 | 5:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్వార్టర్ ఫైనల్లో ఒసాకా

02-01-2025 12:00:00 AM

ఆక్లాండ్ డబ్ల్యూటీఏ టోర్నీ

ఆక్లాండ్: జపాన్ టెన్నిస్ స్టార్, నాలుగుసార్లు గ్రాండ్‌స్లామ్ చాంపియన్ నవోమి ఒసాకా ఆక్లాండ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. బుధవారం ప్రారంభమైన టోర్నీలో తొలి రౌండ్‌లో ఒసాకా 7-5, 6-3 తో జులియా గ్రాబర్‌ను ఓడించింది.

2017 తర్వాత ఆక్లాండ్ ఓపెన్‌లో ఒసాకా క్వార్టర్స్ చేరడం మళ్లీ ఇదే కావడం విశేషం. ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు సన్నాహకంగా భావిస్తోన్న ఈ టోర్నీ నుంచి మాజీ చాంపియన్ ఎమ్మా రాడుకాను వెన్నునొప్పితో తప్పుకుంది. 

జొకోవిచ్ జోడీ ఓటమి

బ్రిస్బేన్ ఇంటర్నేషనల్ టోర్నీలో జొకోవిచ్ (సెర్బియా)-కిర్గియోస్ (ఆస్ట్రేలియా) జోడీ రెండో రౌండ్‌కు పరిమితమైంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన జొకోవిచ్ జంట 2-6, 6-3, 8-10తో నికోలా మెక్టిక్ (క్రొయేషియా)- మైకెల్ వీనస్ (న్యూజిలాండ్) జంట చేతిలో పరాజయం చవిచూసింది. సింగిల్స్ విభాగంలో థాంప్సన్ (ఆస్ట్రేలియా), దిమిత్రోవ్ (బల్గేరియా) క్వార్టర్స్‌లో అడుగుపెట్టారు. 

విజృంభించిన గాఫ్, టేలర్..

ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీకి సన్నాహకంగా భావిస్తోన్న యునైటెడ్ కప్ టెన్నిస్ టోర్నమెంట్‌లో అమెరికా జట్టు సెమీఫైనల్లో అడుగుపెట్టింది. కోకో గాఫ్, టేలర్ ఫ్రిట్జ్ తమ జట్టు సెమీస్ చేరడంలో కీలకపాత్ర పోషించారు. పెర్త్ వేదికగా మహిళల విభాగంలో జరిగిన తొలి సింగిల్స్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్ కోకో గాఫ్ 7-6 (7/4), 6-2తో చైనా క్రీడాకారిణి జాంగ్ షువాయిని మట్టికరిపించింది.

అనంతరం పురుషుల సింగిల్స్‌లో టేలర్ ఫ్రిట్జ్ 6-4, 6-4తో జాంగ్ జిజెన్‌ను ఓడించాడు. జర్మనీని ఓడించిన కజకిస్థాన్ కూడా సెమీస్‌లో అడుగుపెట్టింది. గాయంతో అలెగ్జాండర్ జ్వెరెవ్ తప్పుకోవడంతో అతడి స్థానంలో వచ్చిన డానియెల్ మసుర్‌ను కజకిస్థాన్ ఆటగాడు సెవ్‌చెంకో ఓడించాడు. ఇగా స్వియాటెక్ ప్రాతినిధ్యం వహిస్తున్న పోలండ్ జట్టు క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది.