calender_icon.png 24 January, 2025 | 1:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓరుగల్లు చిన్నది మెరిసేనా?

27-08-2024 12:00:00 AM

పారిస్ పారాలింపిక్స్

  1. 400 మీ ఈవెంట్‌లో దీప్తి జీవాంజి పోటీ
  2. రోయింగ్‌లో నారాయణ, సైక్లింగ్‌లో అర్షద్ షేక్

విజయక్రాంతి ఖేల్ విభాగం: పారిస్ పారాలింపిక్స్‌కు ఈసారి అథ్లెటిక్స్ విభాగంలో తెలంగాణ అథ్లెట్, వరంగల్ చిన్నది దీప్తి జీవాంజి బరిలోకి దిగనుంది. మహిళల టీ20 400 మీటర్ల ఈవెంట్‌లో పాల్గొననున్న దీప్తిపై భారీ అంచనాలున్నాయి. ఈ ఏడాది ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో  దీప్తి స్వర్ణంతో సంచలనం సృష్టించింది. పసిడి పతకం గెలవడంతో పాటు రికార్డు ప్రదర్శన (55.07 సెకన్లు) నమోదు చేసింది.

ఈ ప్రదర్శనతోనే దీప్తి జీవాంజి పారాలింపిక్స్‌లో బెర్తు దక్కించుకొని పతకంపై ఆశలు రేపుతుంది. అంతకముందు పారా ఆసియా క్రీడల్లోనూ దీప్తి పసిడి పతకం గెలుచుకున్న సంగతి తెలిసిందే. అదే ఉత్సాహంతో పారాలింపిక్స్‌కు సిద్ధమైన దీప్తి బంగారు పతకం సాధించాలని ఆశిద్దాం.

అటు నారాయణ.. ఇటు అర్షద్

నంద్యాల జిల్లాలోని ప్యాపిలికి చెందిన కొంగనపల్లి నారాయణ 2007లో సైన్యంలో చేరాడు. జమ్మూలో విధులు నిర్వర్తించే సమయంలో మందుపాతర పేలడంతో నారాయణ ఎడమ కాలు తీసేశారు. చిన్ననాటి నుంచి క్రీడలపై అమితాసక్తి కనబరిచిన నారాయణను పారా అథ్లెట్‌గా ఎదగమని కల్నల్ గౌరవ్ దత్తా సూచించాడు. పరుగెత్తడం కష్టమవడంతో నారాయణ రోయింగ్ క్రీడకు మారాడు. ఆటలో క్రమంగా పట్టు సాధించిన నారాయణ అంతర్జాతీయ స్థాయిలో పతకాలు కొల్లగొట్టి పారాలింపిక్స్ బరిలో నిలిచాడు.

నంద్యాలకే చెందిన మరో అథ్లెట్ అర్షద్ షేక్ పారా సైక్లింగ్ విభాగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఏడో తరగతి చదువుతున్న సమయంలో రోడ్డు ప్రమాదంలో కాలు పోగొట్టుకున్న అర్షద్ పారాలింపిక్స్‌లో సైక్లింగ్‌లో పోటీ పడుతున్న తొలి అథ్లెట్‌గా నిలవనున్నాడు. 2022లో 10 మీ మిక్స్‌డ్ ఎయిర్ రైఫిల్‌లో స్వర్ణం సాధించిన ఏపీ పారా షూటర్ శ్రీహర్ష రామకృష్ణ కూడా పారాలింపిక్స్ బరిలో నిలిచాడు. 

కడు పేదరికంలో పుట్టి..

ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తోన్న దీప్తి జీవాంజిది వరంగల్ జిల్లా కల్లెడ గ్రామం. దీప్తి తల్లిదండ్రులు యాదగిరి, ధనలక్ష్మీదినసరి కూలీలు. చిన్నప్పటి నుంచే కడు పేదరికం అనుభవించిన దీప్తి పుట్టుకతోనే మానసిక వైకల్యంతో బాధపడింది. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న దీప్తి తనకు తెలిసిన పరుగునే నమ్ముకుంది. వరంగల్‌లో ఒక పాఠశాలలో నిర్వహించిన అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొన్న దీప్తి జీవాంజి అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్ దృష్టిలో పడింది.

ఆమెను హైదరాబాద్‌కు రప్పించేలా తల్లిదండ్రులను ఒప్పించాడు. దీప్తిని హైదరాబాద్‌కు పంపించడం కోసం తల్లిదండ్రులు తమకున్న అరెకరం పొలాన్ని అమ్మేశారు. రమేశ్ శిక్షణలో మెరుగైన దీప్తి తొలుత జాతీయ స్థాయి ఈవెంట్లలో పాల్గొని మంచి ప్రదర్శన కనబరిచింది. ఈ సమయంలో బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపిచంద్ దీప్తికి అండగా నిలిచాడు. గతేడాది సియా పారా క్రీడల్లో రికార్డు ప్రదర్శనతో స్వర్ణం నెగ్గిన దీప్తి పేరు మార్మోగిపోయింది. తాను నమ్ముకున్న పరుగుతోనే దీప్తి ఇవాళ పారాలింపిక్స్‌లో పతకం సాధించేందుకు సిద్ధమవుతోంది.