01-04-2025 01:23:33 AM
నేటి నుంచి అమల్లోకి..
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 31 (విజయక్రాంతి): ఓఆర్‌ఆర్ టోల్ చార్జీలు పెరగనున్నాయి. నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ టోల్ చార్జీలను పెంచుతున్నట్లు ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా సంస్థ ప్రకటించింది. వాహనాల రకాన్ని బట్టి కిలోమీటర్‌కు 10పైసల నుం చి 70పైసలు పెంచింది. పెంచిన టోల్ చార్జీలు ఏప్రిల్ 1(మంగళవారం)నుంచి అమలులోకి రానున్నాయి.
హెచ్‌ఎండీఏ పరిధిలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్(హెచ్‌జీసీఎల్) నిర్వహణలో ఉండే ఓఆర్‌ఆర్‌ను ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా లిమిటెడ్ సంస్థకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 30ఏండ్ల లీజులకు ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా ఒప్పందం ప్రకారం ప్రతీ ఏడాది టోల్ చార్జీలను పెంచుకునేందుకు నాటి ప్రభుత్వం వెసులు కల్పించింది.
దీంతో ఆ సంస్థ 2025 ఆర్థిక సంవత్సరానికి ఓఆర్‌ఆర్ చార్జీలను పెంచుతు న్నట్లు వెల్లడించింది. కారు, జీపు, లైట్‌మోటర్ వెహికిల్స్‌కు ఇప్పటివరకు కిలోమీటర్ కు రూ.2.34 చార్జీలు ఉండగా, వాటిని రూ.2.44కు, మినీబస్, ఎల్‌సీవీలకు కి.మీ.కు రూ.3.77 నుంచి రూ.3.94కు పెంచారు. 2యాక్సిల్ బస్సులకు కి.మీ. రూ. 6.69 నుంచి రూ.7కు, హెవీ వెహికిల్స్‌కు కి.మీకు రూ.15.09 నుంచి 15.78కి చార్జీలను పెంచింది.