calender_icon.png 20 October, 2024 | 8:57 AM

ఓఆర్‌ఆర్ లీజుపె విచారణ అవసరమైతే రద్దుచేస్తాం

28-07-2024 05:33:04 AM

  1. మరో 20 ఏండ్లు అధికారం మాదే
  2. మహిళలను కోటీశ్వరులను చేస్తాం
  3. పాతబస్తీని కొత్తగా ఆవిష్కరిస్తాం
  4. రుణమాఫీ చేస్తామని చెప్పాం.. చేశాం
  5. త్వరలోనే ఇందిరమ్మ ఇండ్లు.. కొత్త రేషన్ కార్డులు
  6. అసెంబ్లీ, మండలిలో డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్, జూన్ 27 (విజయక్రాంతి): ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇప్పిన ప్రతి హామీని నెరవేరుస్తామని డిఫ్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో మరో 20 ఏళ్లు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని అన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అక్రమాలను సరిదిద్దు తున్నట్టు తెలిపారు. హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డు లీజుపై విచారణ జరిపిస్తామని, అవసరమైతే లీజును రద్దుచేస్తామని ప్రకటించారు. అసెంబ్లీలో వాస్తవిక బడ్జెట్ ప్రవేశపెట్టామని చెప్పారు. శనివారం బడ్జెట్‌పై చర్చ సందర్భంగా శాసనసభ, శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు భట్టి సమాధానమిచ్చారు.

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు వ్యాఖ్యలకు భట్టి కౌంటర్ ఇచ్చారు. ‘పదేళ్లు పాలన చేశామని చెప్పుకునే మీరు ఏ ఒక్క వాగ్దానాన్ని పూర్తి చేయకుండా పాలనను గాలికి వదిలేశారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే అనేక పథకాలు అమలు చేసిన ఘనత మాది. ఈ బడ్జెట్‌లో వ్యవసాయానికి రూ.72,000 కోట్లపైగా ప్రతిపాదించాం. నభూతో నభవిష్యతి అన్నట్టుగా హైదరాబాద్ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించిన ఘనత మా కాంగ్రెస్ ప్రభుత్వానిది. ఎస్సీల సంక్షేమానికి రూ.33,124 కోట్లు, ఎస్టీల సంక్షేమానికి రూ.17,056 కోట్లు ప్రతిపాదించాం’ అని తెలిపారు. 

ఓఆర్‌ఆర్ లీజ్‌పై విచారణ

హైదరాబాద్‌కు మణిహారంగా ఉన్న ఔటర్ రింగ్ రోడ్డును 35 ఏళ్లకు లీజుకు ఇచ్చి ఆ డబ్బు మొత్తాన్ని ఒకేసారి తీసుకొని బీఆర్‌ఎస్ పాలకులు దోపిడీ చేశారని డిఫ్యూటీ సీఎం ఆరోపించారు. బీఆర్‌ఎస్ పాలకులకు ఛాన్స్ దొరికితే హైటెక్ సిటీని కూడా అమ్మేసేవాని ధ్వజమెత్తారు. ఔటర్ రింగ్ రోడ్డు లీజుపై విచారణ చేయిస్తామని, అవసరమైతే లీజును రద్దుచేస్తామని ప్రకటించారు. పదేళ్లు అధికారంలో ఉండి ఆరోగ్యశ్రీ పథకానికి రూ.600 కోట్ల బకాయిలు చెల్లించలేకపోయారని బీఆర్‌ఎస్ నేతలను భట్టి విమర్శించారు. ఆ బకాయిలు చెల్లించటమే కాకుండా.. తాజా బడ్జెట్‌లో రాజీవ్ ఆరోగ్యశ్రీకి రూ.1,065 కోట్లు కేటాయించామని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన డిసెంబర్ నుంచి జూలై వరకు రూపాయి పెండింగ్ లేకుండా ఆసరా పింఛన్ల నిధులను విడుదల చేస్తున్నామని తెలిపారు. 

మహిళలను కోటీశ్వరులను చేస్తాం 

మహిళల కోసం ప్రవేశపెట్టిన ఇందిరక్రాంతి పథకాన్ని కూడా గత ప్రభుత్వం గాలికి వదిలేసిందని భట్టి విమర్శించారు. తమ ప్రభుత్వం తెలంగాణలో కోటిమంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలన్న లక్ష్యంతో రూ.20 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల రుణాలు వడ్డీలేకుండా  ఇప్పించాలని నిర్ణయించిందని చెప్పారు. ఎంఎస్‌ఎంఈలను ఏర్పాటుచేసి మహిళలను అందులో భాగస్వాములను చేస్తామని చెప్పారు. డ్వాక్రా సంఘాల ఉత్పత్తులకు ప్రతి జిల్లాలో మార్కెటింగ్ సౌకర్యం కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.  

ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం 

రాష్ర్టంలో నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ర్టంలో ఇల్లు లేని వాళ్లు ఒక్కరు కూడా ఉండకూడదనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాను తయారుచేసి ఇన్‌చార్జ్ మంతులకు అప్పగించాలని కోరారు. ప్రజాధనం దుర్వినియోగం కాకూడదన్న ఉద్దేశంతోనే రైతు భరోసా ప్రజల అభిప్రాయాలు తీసుకొంటున్నట్టు తెలిపారు. ప్రజల సూచనలతో మార్గదర్శకాలు తయారుచేసి కచ్చితంగా 100 శాతం రైతు భరోసాను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. 

హుస్సేన్‌సాగర్ జలాలు కొబ్బరినీళ్లు అయ్యాయా? 

శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి గోదావరిని.. మంజీరా, కృష్ణానది నుంచి హైదరాబాదుకు మంచినీటిని అందించింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే.. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత నాటి మంత్రి కేటీఆర్ నల్లా తిప్పి తామే నీళ్లిచ్చామని గొప్పలు చెప్పుకొన్నారని భట్టి విక్రమార్క విమర్శించారు. హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌ను శుద్ధిచేసి కొబ్బరి నీళ్లలా మారుస్తామని ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. 

ప్రజలపై పన్నుల భారం వేయం  

టాక్స్ రెవెన్యూ విషయంలో రూ.35 వేల కోట్లు రాబడులు ఎట్లా తెస్తారన్న హరీష్‌రావు ప్రశ్నకు భట్టి బదులిచ్చారు. ‘మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ ప్రభుత్వంలాగా మేము ప్రజలపై పన్నుల భారం వేయం. అలాంటి ఆశలు పెట్టుకోవద్దు . మీ ప్రభుత్వంలాగా పాలనను  గాలికి వదిలేయం. రాబడిని ఎలా తీసుకురావాలో తెలుసు. మూడు నెలల్లోనే రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం పౌరసరఫరా శాఖలో ఉన్న రూ.500 కోట్ల బకాయిలను వసూలు చేస్తున్నాం. ఎఫ్‌సీఐలో పెండింగ్‌లో ఉన్న రూ.3,561 కోట్లను రాష్ర్ట ప్రభుత్వం తెచ్చుకుంది. రాబడులు ఎలా తెచ్చుకోవాలో మాకు తెలుసు. మీరు ఆందోళన చెందవద్దు’ అని చురకలంటించారు.  

మత విద్వేశాలు చిమ్మితే క్షమించేది లేదు 

బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత కొన్ని మీడి యా సంస్థల్లో మైనార్టీలకు రూ.3 వేల కోట్లు కేటాయించారని, హిందువులను విస్మరించారంటూ మత వైశమ్యాలను రెచ్చగొట్టే విధంగా ప్రచారం చేశారని, దీనిని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని భట్టి విక్రమార్క హెచ్చరించారు. సమ్మక్క సారలమ్మ జాతరకు రూ.100 కోట్లు, బోనాల పండుగ కోసం రూ.25 కోట్లు కేటాయించామని తెలిపారు. హైదరాబాదులో ప్రశాంత వాతావరణం కలుషితం చేసి బ్రతకాలనుకోవడం దుర్మార్గమని విమర్శించారు.   

త్వరలోనే కొత్త రేషన్‌కార్డులు 

అర్హులైన పేదలకు త్వరలోనే కొత్త రేషన్ కార్డులు జారీచేస్తామని భట్టి తెలిపారు. మార్గదర్శకాలు తయారు కాగానే కార్డుల పంపిణీ చేపడుతామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి, ప్రభు త్వం కేటాయించి ప్రతిపైసా పారదర్శకం గా ఖర్చు చేసే బాధ్యతను స్వయం సహాయక సంఘాల మహిళలకు అప్పగిం చినట్టు పేర్కొన్నారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీని హెరిటేజ్ సంపదగా భావిస్తున్నామని, చారిత్రక కట్టడాలకు మెరుగులద్ది ప్రపంచానికి చూపెడుతామని చెప్పారు. మూసీ నదిని అభివృద్ధి చేసి హైదరాబాద్ నగరం అంటే ఏంటో చూపిస్తామని పేర్కొన్నారు.