- క్షతగాత్రురాలైన తల్లిని ఆసుపత్రిలో వదిలివెళ్లిన కుమార్తె
- కొడుకు, కుమార్తెకు కాల్ చేసినా స్పందన కరువు
- వైద్యసిబ్బంది, పోలీసులే సంరక్షకురాలిగా బాధితురాలికి సపర్యలు
- కామారెడ్డిలో వెలుగుచూసిన ఘటన
కామారెడ్డి, నవంబర్ 2౧ (విజయక్రాంతి): కట్టుకున్నవాడు కాలం చేశాడు. ఆస్తిపాస్తులమ్మి సంతానానికి ఇవ్వాల్సినదంతా ఇచ్చేసింది. అనుకోని ప్రమా దంలో ఇటీవల ఆ తల్లి చేయి విరిగింది. మనిషి సాయం ఉంటేగాని కదలలేని స్థితి. ఇలాం టి దయనీయమైన పరిస్థితుల్లో తల్లిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కుమారుడు, కుమార్తె ఆమె బాగోగులు గాలికి వదిలేశారు.
వృద్ధురాలైన తల్లిని ఆమె కుమార్తె అనాథలా ఆసుపత్రిలో వదిలేసి చేతులు దులుపుకొని వెళ్లిపోయింది. ఈ అమానవీయమైన ఘటన గురువారం కామారెడ్డి జిల్లాకేంద్రంలో వెలుగు చూసిం ది. మాచారెడ్డి మండలం కొత్తపల్లికి చెందిన గీకూరి సాయవ్వ.. గ్రామంలో భర్తతో కలిసి కూలి పనులు చేసుకుంటూ ఉండేది. వారి కి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె.
దశా బ్దం క్రితమే సాయవ్వ భర్త అనారోగ్యంతో మృతిచెందాడు. కొన్ని సంవత్సరాల తర్వాత పెద్ద కుమారుడు సైతం చనిపోయాడు. దీంతో ఆమె ఉన్న ఊర్లో ఆస్తులన్నీ అమ్మి సంతానానికి వాటాల వారీగా అప్పగించింది. సాయవ్వ మొన్నటివరకు జిల్లాకేంద్రంలోని చిన్న కుమారుడు వెంకటేశ్ ఇంట్లో ఉండేది.
ఆమె ఈనెల 18న సాయవ్వ కిందపడటంతో చేయి విరిగింది. తర్వాత కుమారుడు, కోడలు పట్టించుకోలేదు. దీంతో ఆమె కుమార్తె సాయవ్వను కామారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో వదిలిపెట్టి వెళ్లింది. ఆ తర్వాత ఆసుపత్రి ముఖం కూడా చూడలేదు. దీంతో ఆసుపత్రి వైద్యసిబ్బందే చొరవ తీసుకుని వృద్ధురాలికి వైద్యం అందించారు.
సంరక్షకులు ఎవరూ లేకపోవడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆసుపత్రికి చేరుకుని వృద్ధురాలిని విచారించారు. కుమారుడు, కుమార్తెకు కాల్ చేసినా వారి నుంచి ఎలాంటి స్పందన లేదు.
దీంతో చేసేదేం లేక వైద్యసిబ్బంది, లక్ష్మణ్ అనే కానిస్టేబుల్ ఆమెకు సంరక్షకులుగా మారారు. వృద్ధురాలికి అవసరమైన సపర్యలు చేస్తున్నారు. ఆమెను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. వారసత్వ ఆస్తులను కొడుకు, కుమార్తెకు అప్పగించినప్పటికీ బాగోగులు చూడడం లేదని వృద్ధురాలు వాపోతున్నది.