calender_icon.png 26 October, 2024 | 3:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అదానీ చేతికి ఓరియంట్ సిమెంట్

23-10-2024 12:00:00 AM

డీల్ విలువ రూ. 8,100 కోట్లు

న్యూఢిల్లీ, అక్టోబర్ 22: అదానీ గ్రూప్ మరో సిమెంట్ కంపెనీని చేజిక్కించుకుంటున్నది. సీకే బిర్లా గ్రూప్ సంస్థ ఓరియంట్ సిమెంట్‌ను రూ.8,100 కోట్లకు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ మంగళవారం వెల్లడించింది.

దేశీయ సిమెం ట్ రంగంలో అగ్రస్థానంలో ఉన్న అల్ట్రాటెక్ సిమెంట్‌కు గట్టిపోటీ ఇచ్చేందుకు అదానీ గ్రూప్ శరవేగంగా పావులు కదుపుతున్నది. ఒప్పందం ప్రకారం ఓరియంట్ సిమెంట్ వ్యవస్థాపకులు, మరికొందరు పబ్లిక్ షేర్‌హొల్డర్ల నుంచి అదానీ గ్రూప్ సంస్థ అయిన అంబూజా సిమెంట్ 46.8 శాతం వాటాను రూ. 3,791 కోట్లకు కొనుగోలు చేస్తుంది.

ఇందుకు అదనంగా మరో 26 శాతం వాటా కోసం ఓపెన్ ఆఫర్ జారీచేయనున్నట్లు అంబూజా సిమెంట్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇందుకోసం మరో రూ.4,000 కోట్లకుపైగా ఖర్చుచేస్తుంది. ఓరియంట్ సిమెంట్ షేరుకు రూ. 395.40 చొప్పున చెల్లించనున్నట్లు అంబూజా తెలిపింది. 

వరుస టేకోవర్లు

ఇది ఈ ఏడాది అంబూజా సిమెంట్ రెండో టేకోవర్‌కాగా, ఓరియంట్ సిమెంట్ చేరికతో అంబూజా సిమెంట్ ఉత్పాదక సామర్థ్యం 97 మిలియన్ టన్నులకు పెరుగుతుంది. ఈ ఏడాది జూన్‌లో ఆదానీ గ్రూప్ హైదరాబాద్‌కు చెందిన పెన్నా సిమెంట్‌ను రూ. 10,442 కోట్లకు కొన్నది, గత డిసెంబర్‌లో సంఘి ఇండస్ట్రీస్ సిమెంట్ ప్లాంట్‌ను రూ. 5,185 కోట్లకు టేకోవర్ చేసింది. 2022లో అంబూజా సిమెంట్‌ను స్విట్జర్లాండ్ కంపెనీ హోల్సిమ్ నుంచి రూ. 51,000 కోట్లకు కొనుగోలు చేసి, అదానీ గ్రూప్ సిమెంట్ రంగంలోకి ప్రవేశించింది.

ఆదిలాబాద్‌లో ప్లాంట్

ఓరియంట్ సిమెంట్‌కు దక్షిణాదిన రెండు సిమెంట్ ప్లాంట్లు, ఒక క్లింకర్ ప్లాంటు ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాలో దేవాపూర్‌లో ఓరియంట్ సిమెంట్ తొలి ఇంటిగ్రేటెడ్ సిమెంట్ ప్లాంట్‌ను నెలకొల్పింది. దీని వార్షిక ఉత్పాదక సామర్థ్యం 3.5 మిలియన్ టన్నులు. కర్నాటకలోని గుల్బర్గాలో మరో 3 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంగల సిమెంట్ ప్లాంట్, మహారాష్ట్రలో జల్‌గావ్‌లో 2 మిలియన్ టన్నుల క్లింకర్ ప్లాంటు ఓరియంట్ సిమెంట్‌కు ఉన్నాయి.