29-04-2025 10:37:15 PM
ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్...
మహబూబాబాద్ (విజయక్రాంతి): డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సబ్బండ వర్గాలకు స్వేచ్ఛనిచ్చే విధంగా రూపొందించిన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి సంఘటిత ఉద్యమం చేయాలని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్(MLC Addanki Dayakar) పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించిన రాజ్యాంగ పరిరక్షణ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దయాకర్ మాట్లాడుతూ... భారతదేశ ప్రజలు స్వేచ్ఛాయుత సమాజంలో జీవనం సాగించడానికి కాంగ్రెస్ పార్టీ 55 ఏళ్ల పాటు ఎనలేని కృషి చేసిందన్నారు. ఇప్పుడు కుల మతాల పేరుతో విద్వేషాలు సృష్టించి ప్రజల మధ్య ఘర్షణ వాతావరణం సృష్టిస్తున్నారని ఆరోపించారు.
తాను ఇటీవల పాకిస్తాన్ పై చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారని, ఆ వ్యాఖ్యలను, పూర్వాపరాలను పరిశీలించకుండానే బిజెపి ఉచ్చులో పడి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనపై ఆరోపణలకు దిగడం సరైనది కాదన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యేగా ఎన్నికైన పిఠాపురం నియోజకవర్గంలో మల్లం గ్రామంలో దళితులను బహిష్కరించారని, ఈ సంఘటన పూర్వాపరాలను తెలుసుకోవడానికి తాను రేపు అక్కడికి వెళ్ళనున్నట్టు దయాకర్ తెలిపారు. ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టిన అద్దంకి దయాకర్ ను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన ఉద్యమకారులకు ప్రభుత్వపరంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసే విధంగా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లనట్లు దయాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజాసంఘాల నాయకులు, పార్టీల నాయకులు పాల్గొన్నారు.