28-04-2025 08:53:22 PM
జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్..
నిర్మల్ (విజయక్రాంతి): గ్రామ రెవెన్యూ సదస్సులను సమగ్రంగా, సమయానుసారం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్(District Collector Abhilasha Abhinav) అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అన్ని మండలాల తహసీల్దార్లతో భూభారతి, రెవెన్యూ సదస్సులు, ఇసుక అక్రమ రవాణా నియంత్రణ, వరి కొనుగోలు కేంద్రాల పర్యవేక్షణ, త్రాగునీటి సరఫరా తదితర అంశాలపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ పాల్గొని పలు సూచనలు చేసారు. గతంలో నిర్వహించిన సదస్సులు, గుర్తించిన సమస్యల వివరాలను మండలాల వారీగా తహసీల్దార్లను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రతి పంచాయితీలో గ్రామ రెవెన్యూ సదస్సులను నిర్వహించి, భూభారతి చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ సదస్సుల్లో భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరించి, వాటిని త్వరగా పరిష్కరించాలని సూచించారు. ఇప్పటికే అన్ని మండలాల్లో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు తెలిపారు. తహసీల్దార్లంతా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేయాలన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొనుగోలు ప్రక్రియ, టార్పాలిన్స్, గన్ని బ్యాగ్స్ తదితర సౌకర్యాలు ఉండేలా పర్యవేక్షించాలన్నారు. రానున్న రెండు, మూడు రోజుల్లో జిల్లాకు వర్ష సూచన ఉన్నందున, రైతులందరూ తమ ధాన్యాన్ని కాపాడుకునే విధంగా తగు చర్యలు తీసుకోవాలన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లోని చెరువులను రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సంయుక్తంగా సందర్శించి, చెరువుల ఎఫ్ టిఎల్ హద్దులను గుర్తించాలన్నారు. చెరువులు ఆక్రమణలు జరుగకుండా చూడాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులదేనని స్పష్టం చేశారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టి, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి తగినంత ఇసుకను అందుబాటులో ఉంచాలన్నారు. రెవెన్యూ భూ రికార్డులను స్కాన్ చేసి, డిజిటల్ రూపంలో భద్రపరచాలన్నారు. వేసవి నేపత్యంలో గ్రామీణ ప్రాంతాలలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలనీ సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ కిషోర్ కుమార్, భైంసా ఆర్డిఓ కోమల్ రెడ్డి, రెవెన్యూ అధికారులు సవిత, స్వాతి, ఈడిఎం నదీమ్, తదితరులు పాల్గొన్నారు.