కాంగ్రెస్‌కు కేంద్రమంత్రి బండి సంజయ్ సవాల్
కరీంనగర్, సెప్టెంబరు 16 (విజయక్రాంతి): తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకుండా ‘తెలంగాణ ప్రజాపాలన’ అంటూ పేరు మార్చి తెలంగాణ చరిత్రనే కనుమరుగు చేస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ విమర్శించారు. సోమవారం ఆయన కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ విమోచన దినోత్సవం పేరుతో ఉత్సవాలు నిర్వహిస్తే తాను స్వయంగా హాజరవుతారని చెప్పారు. కాంగ్రెస్‌కు చేతకాకుంటే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న తెలంగాణ విమోచన దినోత్సవానికి హాజరుకావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నానని చెప్పారు. తెలంగాణ విమోచన దినోత్సవం తెలంగాణ ప్రజలు పండుగ రోజని, నిజాం నిరంకుశ పాలనపై పోరాడిన సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాల్సిన రోజని అన్నారు.
రజాకార్ల దళం సృష్టించిన ఎంఐఎం పార్టీకి భయపడి ఉత్సవాలు నిర్వహించేందుకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. రజకార్ పార్టీ వారసుడు ఓవైసీ భూములను కబ్జా చేసి పేదలను దోచుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్‌లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. సచివాలయం వద్ద రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కాంగ్రెస్ రాజకీయ డ్రామాలకు నిదర్శనమన్నారు. దమ్ముంటే ఆరు గ్యారంటీలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా బండి సంజయ్ ట్రాక్టర్ నడిపడి, భక్తులను ఉత్సాహపరిచారు.