calender_icon.png 25 October, 2024 | 9:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సేంద్రియమే పరిష్కారం!

14-09-2024 12:00:00 AM

ఒకనాడు 60, 70 ఏళ్లు అయినా మనిషికి ఏ రోగం లేకుండా సంతోషంగా బతికేవాళ్లు. కానీ ఇవాళ పట్టుమని పాతికేళ్లు నిండక ముందే రోగాల బారిన పడి ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. దీనికి కారణం ఏంటి? అని ఆలోచించే తీరిక లేని జీవితాలు మనవి. తినే తిండి.. పీల్చే గాలి.. తాగే నీరు.. కలుషితం అయిపోయాక ఆరోగ్యకరమైన మనిషి ఎక్కడ దొరుకుతాడు. మన పూర్వీకులు ఎందుకు అంత ఆరోగ్యంగా ఉన్నారు అనే విషయాన్ని ఒక్కసారి ఆలోచిస్తే సమాధానం దొరికేది. సేంద్రియ ఆహారమే వారి జీవితాన్ని సుస్థిరం చేసింది. సేంద్రియ వ్యవసాయంపై ఆధారపడకపోతే రోగగ్రస్త సమాజాన్ని చూడాల్సి వస్తుందంటున్నారు ఆర్గానిక్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ డైరెక్టర్‌గా పని చేస్తున్న చంద్రకళ. సేంద్రియ వ్యవసాయం గురించి ఆమె మాటల్లోనే..

2004లో సుస్థిర వ్యవసాయ కేంద్రాన్ని (సి.ఎస్.ఎ)డాక్టర్ జి.వి. రామాంజనేయులు ప్రారంభించారు. దీంట్లో అందరు వ్యవసాయ శాస్త్రవేత్తలు ఉంటారు. నేనిక్కడ 2010 నుంచి పని చేస్తున్నాను. దాదాపు 14 ఏళ్లు పూర్తయింది. సి.ఎస్.ఎలో జాయిన్ అయ్యేటప్పుడు అకౌంట్స్ ఆఫీసర్‌గా జాయిన్ అయ్యాను. ఐదేళ్ల తర్వాత  రైతులతో కలిసి పని చేయడం వల్ల  ప్రోగ్రామ్‌లోకి షిఫ్ట్ అయ్యే అవకాశం ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితిలో అందరు ఆర్గానిక్.. ఆర్గానిక్ అంటున్నారు. నిజంగా ఇది ఆర్గానిక్ కా..? కాదా..? అని తెలుసుకోవాలని..? నేను ప్రోగ్రామ్‌లోకి షిఫ్ట్ అయ్యాను. అలా షిఫ్ట్ అయ్యాక 2016 నుంచి కూడా నేను పూర్తిగా ఆర్గానిక్ సర్టిఫికేషన్, క్వాలిటీ కోసం పని చేస్తున్నాను. రైతులు పండించిన పంటను ఆర్గానిక్ అనటానికి ఒక ఆధారం అనేది అవసరం. ఎందుకంటే రైతు మార్కెట్‌కు వెళ్లి ఇది ఆర్గానిక్ అని చెబితే కొనుక్కునే పరిస్థితి లేదు. వాళ్లకు ఒక సరైన గుర్తింపు రావాలంటే.. ఈ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అనేది ఒక ఆధారం. 

ఏడు రాష్ట్రాల్లో.. 

ప్రస్తుతం మా సంస్థ ఏపి, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గడ్, జార్ఖండ్, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వంతో కలిసి పని చేస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఆర్‌వైఎస్‌ఎస్ అనే సంస్థ ద్వారా సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతులందరికీ ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఇచ్చాం. అదేవిధంగా ఛత్తీస్‌గడ్‌లోని దంతెవాడ జిల్లాలో వందకు పైగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్న వారికి మేం గుర్తింపు పత్రాన్ని అందించాం. ఇది ఎందుకు అవసరం అన్న విషయానికి వస్తే.. దీని ద్వారా రైతులకు గిట్టుబాటు ధర వస్తుంది. సేంద్రియ వ్యవసాయం పట్ల గత ఐదు, ఆరేళ్లకు ఇప్పటికీ చూస్తే.. ప్రజల్లో అవగాహన బాగా పెరిగింది. కోవిడ్ కంటే ముందు ఆర్గానిక్ ఫుడ్ మీద అంతగా ఆసక్తి చూపించేవారు కాదు.

కోవిడ్ తర్వాత అందరిలోని ఒక భయం అనేది వచ్చింది. కనీసం మనం ఉన్నన్ని రోజులు హెల్తీగా ఉండాలి.. హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. మందులకు బదులుగా మంచి ఆహారానికి ఖర్చు పెడదాం అని ఆలోచించడం మొదలు పెట్టారు. ఈ అవగాహన పెరగడటం ద్వారా ప్రతి ఒక్కరు ఆర్గానిక్.. ఆర్గానిక్ అంటున్నారు. సేంద్రియ వ్యాపారం పెరుగుతున్న క్రమంలో.. అందరు కమర్షియల్ మోడ్‌లోకి వస్తున్నారు. మనం చూసినట్లయితే.. ఐటీ వాళ్లు కూడా ఉద్యోగాలు వదిలి పెట్టి ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు. 

రీజినల్ కౌన్సిల్‌గా..

రీజినల్ కౌన్సిల్‌గా ఏడు రాష్ట్రాల్లో సర్టిఫికేషన్ విధులను నిర్వహిస్తున్నాం. అదే విధంగా మా సంస్థ ద్వారా రకరకాల పనులు చేస్తాం. గ్రామాల్లో రైతులతో కలిసి పనిచేస్తాం. వాళ్లకు ప్రొడక్షన్ పనులు, టెక్నికల్ సపోర్టు అందిస్తాం. ఇలా అన్నింటి మీద కూడా రైతులకు మన శాస్త్రవేత్తలు ట్రెయినింగ్స్, గైడెన్స్ ఇస్తారు. సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ డైరెక్టర్‌గా అన్నీ రాష్ట్రాలను చూసుకుంటాను.  నా కింద ఒక 40మంది పూర్తి స్థాయిలో టీమ్ ఉంది. అలాగే వెరిఫికేషన్ టీమ్ కూడా ఉంది.  వాళ్లు ఒక 100కు పైగా ఉన్నారు. మా బాధ్యత ఏంటంటే.. వెరిఫికేషన్ టీమ్‌కు పూర్తిస్థాయిలో శిక్షణ ఇస్తాం. ఎందుకంటే రైతు ఇది ఆర్గానిక్ అని చెబితే  దానికి ఆధారాలు కచ్చితంగా ఉండాలి. అందుకే సర్టిఫికేట్ అనేది చాలా ముఖ్యం. 

ఇది సేంద్రియ పంట అనడానికి..  

రిజినల్ కౌన్సిల్‌గా ప్రతి సీజన్‌లో ఫీల్డ్‌కు వెళ్లి రైతులతో మాట్లాడతాం. వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలిస్తాం. తర్వాత రైతుల డైరీని పూర్తిగా చెక్ చేస్తాం. ఇవన్నీ చేస్తూ.. కొన్ని షాంపిల్స్‌ను కూడా తీసుకుంటాం. ఎందుకంటే రసాయనాలు ఉన్నాయా అని తెలుసుకోవటానికి. ఈ ప్రణాళిక అంత పూర్తి అయితేనే వాళ్లకు సర్టిఫికేట్ వస్తుంది. ఈ సర్టిఫికేట్ రావడానికి ఎంత టైమ్ పడుతుందంటే కనీసం మూడు సంవత్సరాలు పడుతుంది. అప్పుడే అది పూర్తి స్థాయిలో సేంద్రియ పంటగా చెప్పవచ్చు. సర్టిఫికేషన్ అనేది ఒక్కసారి తీసుకుంటే అది పర్మినేట్ కాదు. సర్టిఫికెట్‌కు గుర్తింపు కేవలం ఒక సంవత్సరం వరకు మాత్రమే ఉంటుంది. దీన్ని ప్రతి ఏడాది రెన్యువల్ చేయించుకోవాలి. 

సర్టిఫికేషన్ గ్యారెంటీ సిస్టమ్..

రైతులు రసాయనాలను విడిచిపెట్టి.. సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాం అన్న రైతులకు మాత్రమే మనం గు ర్తింపు పత్రాన్ని ఇస్తాం. మొదటి రెండు సంవత్సరాలు దానిపై అవగాహన కల్పిస్తాం. అయితే ఆ సమయంలో కూడా సర్టిఫికేట్ ఇస్తాం. కాకపోతే ఆ సమయంలో పి.జి.ఎస్ గ్రీన్ అని ఒక సర్టిఫికెట్ ఇస్తాం. తర్వాత మూడో సంవత్సరంలో పి.జి.ఎస్ ఆర్గానిక్ అని సర్టిఫికెట్ ఇస్తాం. సేంద్రియ రైతు అని ఒక్కసారి గుర్తింపు వచ్చిన తర్వాత కూడా ప్రతి సంవత్సరం రెన్యువల్ చేయించుకోవాలి. సర్టిఫికేషన్ గ్యారంటీ సిస్టమ్ ద్వారా కేవలం మన దేశంలో మాత్రమే అమ్ముకోవడానికి అవకాశం ఉంది. మీగతా రాష్ట్రాల్లో పోల్చితే తెలంగాణలో సేంద్రియ వ్యవసాయం చేసేది చాలా తక్కువ. 

సహజ ఆహారం..

సహజ ఆశ్రమంలో లభించేవి అన్ని సేంద్రియ ఉత్పత్తులే. మన సంస్థ సి.ఎస్.ఎ నుంచి సర్టిఫికేషన్ పొందినవి అక్కడ ఉంటాయి. మొదట్లో వీటిపై పెద్దగా అవగాహన లేకపోయేది. రైతులు పండించిన ఉత్పత్తులను ఎక్కడ అమ్ముకోవాలి అనేది పెద్ద సమస్య. ఎందుకంటే రైతు వెళ్లి మార్కెట్‌లో ఇది ఆర్గానిక్ అని చెప్పి ఒక్కరూపాయి ఎక్కువ అడిగినా ఎవ్వరూ కొనుక్కునే స్థితి లేదు. వాళ్లకు మనం ఒక మార్కెట్ ప్లాట్ ఫాం కల్పించాలి అన్న ఉద్దేశ్యంతో మేం సహజ ఆహారాన్ని ప్రారంభించాం. హైదరాబాద్‌లో మూడు స్టోర్స్ ఉన్నాయి. ఒకటి తార్నాక, రెండోది ఖర్కనా,  మూడోది కూకట్‌పల్లి. ఈ మూడు స్టోర్స్‌లో ఎక్కడ తీసుకున్న కూడా పూర్తిగా సేంద్రియ ఆహార పదార్థాలే ఉంటాయి. 

సుస్థిర వ్యవసాయ కేంద్రం..

సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో రైతులు పండించిన వివిధ రకాల ఆహార ఉత్పత్తులకు నగరంలో మార్కెట్ సదుపాయం కల్పించడంతో పాటు హైదరాబాద్‌లోనూ సేంద్రియ పద్ధతిలో అర్బన్ ఫార్మింగ్‌ను ప్రోత్సహిస్తున్నది సుస్థిర వ్యవసాయ కేంద్రం. ఇక్కడ అనేక రకాల విత్తనాలను నగరవాసులకు అందజేస్తోంది. రూఫ్ గార్డెన్, కిచెన్ గార్డెనింగ్‌లకు కావాల్సిన వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పూల విత్తనాలను అర్బన్ ఫార్మింగ్ పట్ల ఆసక్తి ఉన్న నగరవాసులకు అందజేస్తోంది. 

ఈ క్రమంలో మన భారత ప్రభుత్వం పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ (పి.జి.ఎస్)ను ప్రవేశపెట్టారు. రైతులు పండించే ఉత్పత్తులకు సరైన గిట్టుబాటు ధర  రావాలని ఈ సర్టిఫికేషన్ విధానాన్ని ప్రవేశపెట్టారు. మన దేశంలో మొత్తంలో ప్రభుత్వం తరపున ఒక 17 రిజినల్ కౌన్సిల్స్ ఉన్నాయి. ఇవి ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందినవి. దాంట్లో సుస్థిర వ్యవసాయ కేంద్రం ఒకటి. 

కేంద్రం నుంచి ఫుల్ సపోర్టు..

సేంద్రియ వ్యవసాయానికి ముఖ్యంగా ప్రభుత్వం సపోర్టు చేయాలి. ఎందుకంటే మార్కెటింగ్ అనేది మేజర్ ఛాలెంజింగ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సపోర్టుతో రైతులు పండించిన సేంద్రియ ఉత్పత్తులను నేరుగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సప్లయ్ చేస్తున్నాం. ఇలా చేయడం వల్ల రైతులకు కూడా మార్కెట్ మీద నమ్మకం కలిగింది. ఏపిలో రైతు సాధికారత సంస్థ ద్వారా అన్ని జిల్లాల్లో ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఉంది. అక్కడ టీటీడీ వాళ్లతో అగ్రిమెంట్ అయింది. తెలంగాణ గవర్నమెంట్‌లో కూడా చాలా స్కీమ్స్ ఉన్నాయి. పీకేవీవై, పీపీకే అనే వివిధ రకాల స్కీమ్స్ ఉన్నాయి. ఏ స్కీమ్ గురించి కూడా అవగాహన లేదు. ఎందుకంటే ఇక్కడివాళ్లకు పెద్దగా ఆసక్తి లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా సపోర్టు ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సహం ఉంటే బాగుంటుంది.   

 రూప