calender_icon.png 5 November, 2024 | 6:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవయవాల మార్పిళ్లు ఆగమాగం

24-04-2024 12:05:00 AM

ప్రతిదీ వ్యాపారమై పోయిన ఈ రోజుల్లో ‘అవయవాల మార్పిళ్ల’ వ్యవహారం ప్రత్యేకించి మన దేశంలో పరిశ్రమ స్థాయికి ఎదిగింది. దీనికి సంతోషించాలో, బాధ పడాలో అర్థం కాని స్థితి. ఎంత ధనమూల మిదమ్ జగత్తయినా, కొంతలో కొంతయినా, కొన్నికొన్ని విషయాలపట్ల మానవతా దృక్పథం వుండాలని అందరం కోరుకుంటాం. కానీ, జరుగుతున్న పలు సంఘటనలు ఇందుకు పూర్తి భిన్నంగా వుంటున్నట్టు విమర్శలు వస్తున్నాయి.

ఎటూ జీవన్మరణ సమస్యలో వున్నారు కదాని, సహజ ‘అవయవ’ మార్పిడి కోసం ఎంతంటే అంత బాధితుల నుంచి వసూలు చేద్దామని అనుకొనే దృక్పథం మానవత్వం అనిపించుకుంటుందా? ఒకవైపు మృత్యుకుహరంలోకి జారిపోతున్నవారు, మరోవైపు జీవితంపట్ల కొత్త ఆశతో ఎదురుచూస్తున్నవారు. ఇరువురూ బాధాతప్త హృదయులే. ఇలాంటివారు ఎవరైనా సరే, బేషరతు సహాయానికి అర్హులు. కానీ, ఇటువంటి హృదయ విదారక బాధితులపట్లనే కొందరు వ్యాపార బుద్ధిని చూపడం భావ్యం కాదు.

ఈ తరుణంలోనే మానవులకు ‘మానవేతర జంతువుల అవయవాల మార్పిడి’ ప్రక్రియ వైద్యనిపుణులలో చర్చనీయాంశం అవుతున్నది. ఇటీవల చైనాలో ఒక వ్యక్తికి పంది కాలేయాన్ని విజయవంతంగా మార్పిడి చేశారు. ఈ శస్త్రచికిత్స శాస్త్రవేత్తలలోనేకాక సామాన్యుల్లో సైతం కొత్త ఆశలను చిగురిం పజేస్తున్నది. మనుషులకు మనుషుల అవయవాలు మృగ్యమేకాక మరీ అసాధారణ రీతిలో భాగ్యమైపోతున్న పరిస్థితుల్లో మానవేతర జంతువుల అవయవాలతో కొందరైనా కొత్త జీవితం ప్రారంభించగలిగితే మనకు అంతకంటే కావాల్సింది ఇంకేముంటుంది?

ఇంకా నిదానంగానే పరిశోధనలు

ప్రపంచవ్యాప్తంగా ఆధునిక వైద్యరంగం వేగంగా ముందడుగు వేస్తుండగా, భారతదేశంలో అవయవ మార్పిడి పరిశోధనలు, విధానాల ప్రక్రియ గణనీయంగానే వెనుకబడి పోతున్నది. ప్రపంచంలోనే మొట్టమొదటి ‘కిడ్నీ (మూత్రపిండాలు) మార్పిడి’ శస్త్రచికిత్స విధానాన్ని 1954లోనే అమెరికాలోని బోస్టన్‌కు చెందిన ‘బ్రిగ్హమ్ హాస్పటల్’లో అమలు జరిపారు. తర్వాత 17 ఏళ్లకు (1971లో) తమిళనాడు, వేలూరుకు చెందిన ‘క్రిస్టియన్ మెడికల్ కాలేజీ’లో దేశంలోని ‘తొలి కిడ్నీ మార్పిడి’ నిర్వహించారు. నాటినుంచీ అటు వైద్య పరిశోధనలు, ఇటు అవయవాల మార్పిడి విధానాలు దేశంలో చాలా నిదానంగానే కొనసాగుతున్నాయి.

లక్షల్లో ఆశావహులు

డిమాండ్ ఎక్కువై, సరఫరా తక్కువైతే ఏమవుతుంది? మార్కెట్ అంతుబట్టని మాయాజాలానికి లోనవుతుంది. ప్రతీ ఏటా అవయవాల మార్పిళ్ల కోసం ఎదురు చూస్తున్న వారు లక్షల్లో ఉంటుంటే, అదృష్టవశాత్తు వాటిని ‘ఎలాగోలా’ పొందుతున్న ఆశావహులు కూడా రోజుకు ఇరవైమంది వరకు వుంటున్నట్టు తెలుస్తున్నది. ఈ సంక్షోభ స్థితిలో దేశంలోని పలు ప్రైవేటు హాస్పటల్స్ వారినుండి ఆధిపత్యం సహజంగానే పొడసూపుతున్నట్టు ‘ది ప్రోబ్. ఇన్’ ఇటీవలి ఒక కథనం వెల్లడించింది. అంచనాకు అందిన లెక్కల ప్రకారం తెలుస్తున్న కఠోర సత్యం ఏమిటంటే, (ఉదా॥కు) 2019లో దేశవ్యాప్తంగా జరిగిన మొత్తం కాలేయ మార్పిళ్లలో 95 శాతం 175 ప్రైవేటు ఆస్పత్రులలోనే జరిగినట్లు పై వార్తాసంస్థ కథనం పేర్కొంది. అసాధా రణ రీతిలో దీనికి భిన్నంగా ఒక అంచనా మేరకు, దేశవ్యాప్తంగా 1 నుంచి 2 లక్షల కిడ్నీ మార్పిళ్ల అవసరం ఏర్పడుతున్నదని, 2019లో వాటిలో కేవలం 10,000 మాత్రమే జరిగాయని తెలుస్తున్నది.

అండర్‌గ్రౌండ్ నెట్‌వర్క్ ?

ఈ తరుణంలోనే అవయవాల అక్రమ వ్యాపా రం చోటు చేసుకుంటున్నట్టు పలు ఆరోపణలు వినిపిస్తున్నాయని ‘ది ప్రోబ్.ఇన్’ కథనం పేర్కొం ది. ఈ రకమైన విమర్శలే మన దేశ వైద్యారోగ్య వ్యవస్థ సానుకూల పరిస్థితులకు మంచిది కాదనికూడా పై కథన రచయిత ఆర్యన్ సైనీ సూచించా రు. నాలుగు గోడల నడుమ అనధికారిక పద్ధతిలో అవయవాల కొనుగోళ్ల వ్యవస్థ (అండర్‌గ్రౌండ్ నెట్‌వర్క్) ఒకటి నడుస్తున్నట్టు అనుమానాలు పుడుతున్నాయనీ పై కథనం వెల్లడించింది. దీనికి ఊతమిచ్చే ఒక సంఘటనతో దేశ రాజధానిలోని ఒక ప్రసిద్ధ ప్రైవేటు ఆసుపత్రి పేరు వినిపిస్తున్నట్టు ఆయన రాసుకొచ్చారు.

గత డిసెంబర్‌లో కిడ్నీ మార్పిడి కోసం మైన్మార్‌కు చెందిన పేద వ్యక్తుల నుంచి మన దేశంలోని సంపన్నుల కోసం అవయవాన్ని కొనుగోలు చేయడంలో ఆ హాస్పటల్ ప్రమేయం వున్నట్టు తెలుస్తున్నదని ఆయన ఆరోపించారు. లండన్‌లోని ‘ది టెలిగ్రాఫ్’ వార్తాపత్రిక అవయవాల అమానవీయ కొనుగోళ్లపై వార్తాంశాన్ని ప్రచురించినట్లు కూడా తెలుస్తున్నది. ఇకనై నా, భారతీయ ప్రభుత్వం, రాష్ట్రాల ప్రభుత్వాలు, బాధ్యతగల అధికారులు, వైద్య నిపుణులు మానవతా దృక్పథంతో ఇలాంటివి చోటు చేసు కోకుండా చూడాల్సి ఉంది. కొత్త జీవితం కోసం ఎదురుచూసే పేద అభాగ్యులను దృష్టిలో వుంచుకొంటే తప్ప, అనధికారికంగా అత్యధిక ధరలకు అవయవాలను కొనుగోలు చేసే వ్యవహారానికి అడ్డుకట్ట పడదు.

అవయవ దానాలు అత్యల్పం

ఒక అంచనా ప్రకారం భారతదేశంలో ఏడాదికి సగటున సుమారు 17,000 నుంచి 18,000 వరకు పలు ‘ఘన అవయవాల మార్పిళ్లు’ జరుగుతున్నట్టు తెలుస్తున్నది. ఇది నిజానికి పెద్ద సంఖ్యే. అయినా, అమెరికా, చైనాల తర్వాత మన దేశమే ప్రపంచంలో ఈ విషయమై అధిక పోటీదారుగా వున్నది. పలు అధికాదాయ దేశాలలోని జనాభాతో పోల్చినప్పుడు (మరోవైపు) మన దేశానిది పెద్ద అవసరమనే చెప్పాలి. ఇదే సమయంలో మృతుల నుండి లభ్యమవుతున్న ‘అవయవ దానాల’లోనూ ఇతర దేశాలకంటే మనం చాలా వెనుకబడి ఉన్నాం. ‘ఇంటర్నేషనల్ రిజిస్ట్రీ ఆఫ్ ఆర్గాన్ డొనేషన్స్ అండ్ ట్రాన్స్‌ప్లాంటేషన్’ అధికారిక సమాచారం ప్రకారం, భారతదేశ పరిస్థితికి పూర్తి భిన్నంగా ఆశ్చర్యకర స్థాయిలో (ఉదా॥కు) అమెరికాలో ‘మృతుల అవయవ దానాలు’ 100 రెట్లు అధికంగా వున్నాయి. ఈ పరిస్థితితో నిమిత్తం లేకుండా ‘అవయవ మార్పిళ్ల’ కోసం అసంఖ్యాకంగా బాధితులు ఎదురుతెన్నులు చూస్తుండటం దేశంలోని దయనీయ దృశ్యం.

దోర్బల బాలశేఖరశర్మ