01-04-2025 12:00:00 AM
మన రాష్ట్ర ప్రభుత్వం అవయవ దానానికి తగిన ప్రోత్సాహం, మార్పిడి ప్రక్రియను సమర్థంగా నిర్వహించడం, అక్రమ రవాణాను అరికట్టడం లక్ష్యంగా ‘తెలంగాణ అవయవ దానం బిల్లు - 2025’ను అసెంబ్లీలో ఆమోదించింది. ఇదెంతో హర్షించదగ్గ విషయం. ఈ చట్టం ద్వారా అవయవ దానాన్ని నియంత్రిత, పారదర్శక విధానం లో కొనసాగించేందుకు కఠిన నిబంధనలు అమలు చేయనున్నారు. బ్రెయిన్ డెడ్ దాతల అవయవ వినియోగాన్ని మెరుగు పరిచేందు కు ఆసుపత్రుల్లో సమన్వయ కేంద్రాల ఏర్పాటు, ఆన్‌లైన్ ట్రాన్స్‌ప్లాంట్ రిజిస్ట్రీ, అత్యవసర రవాణా కోసం గ్రీన్ కారిడార్ ఏర్పాట్లు వంటి చర్యలు చేపట్టనున్నారు. అలాగే, అవయవ దానం చేసిన కుటుంబాలకు ఆరోగ్య బీమా, విద్యా రాయితీలు, ప్రత్యేక వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టడం కూడా ప్రశంసనీయం.
ఈ చట్టం ప్రజల్లో అవగాహనను పెంచి అవయవ మార్పిడిని వేగవంతం చేయడంతో పాటు తెలంగాణను ఇందులో దేశంలోనే ప్రముఖ స్థాయికి తీసుకెళ్లనుంది. అవయవ మార్పిడి కోసం వేచి చూస్తున్న రోగులకు ఈ చట్టం ద్వారా జీవితావకాశం లభించనుంది. మెదడు మరణం నిర్ధారణకు స్పష్టమైన మార్గ దర్శకాలు, సమన్వయ కేంద్రాల ఏర్పాటు, అత్యవసర రవాణా సదుపాయాలతో అవయవ మార్పిడి మరింత సమర్థవంతంగా కొనసాగనుంది. ఆరోగ్య రంగానికి కొత్త దిశను చూపించే ఈ చట్టం, అవయవ దానం ద్వారా అనేకమందికి ఆశాజనక భవిష్యత్తును అందించేందుకు దోహద పడుతుందనడంలో సందేహం లేదు. మానవీయతకు నిదర్శనమైన ఈ ముందడుగును తీసుకున్న తెలంగాణ ప్రభుత్వానికి హృదయపూర్వక అభినందనలు!
డా.కృష్ణకుమార్ వేపకొమ్మ, రాజీవ్‌నగర్, హైదరాబాద్
పిల్లలను కాపాడుకోవాలి!
కామారెడ్డి జిల్లా వెంకటాపూర్‌లో ఉగాది పండగ పూట తల్లి, ముగ్గురు పిల్లలు చెరువు నీళ్లలో పడి ప్రాణాలు పోగొట్టుకున్న సం ఘటన అత్యంత దయనీయం. బట్టలు ఉతకడానికి వెళ్లిన ఆ తల్లి వెంట పిల్లలు వెళ్లడం, నీళ్లలో పడిపోవడం, వారిని కాపాడబోయి ఆమెకూడా ప్రాణాలు కోల్పోవడం నిజంగా హృదయ విదారకం. పిల్లలను అటువంటి ప్రమాదకరమైన ప్రాంతాలకు తీసుకెళ్లే ముం దు ప్రతి ఒక్కరూ ఆలోచించుకోగలగాలి. కనీసం ఆ తల్లి అయినా పిల్లలను నీళ్లలోకి దిగకుండా నివారించి ఉండాల్సింది. ఇటువంటి దుస్సంఘటనలకు మహిళలు పిల్లలను దూరంగా ఉంచాలి.
- లక్ష్మీసుధ, కామారెడ్డి