12-04-2025 04:45:33 PM
కలెక్టర్ ఆకస్మిక తనిఖీలో తాళం వేసి ఉన్న ఆస్పత్రి..
మెదక్ (విజయక్రాంతి): అనధికారకంగా ఉద్యోగులు విధులకు గైర్హాజరు అయితే కఠిన చర్యలు తప్పవని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ హెచ్చరించారు. మెదక్ గోల్కొండ వీధి బస్తీ దావకాన విధులకు గైర్హాజరైన ఉద్యోగులను సస్పెండ్ చేసిన కలెక్టర్.. మెదక్ గోల్కొండ వీధిలో బస్తీ దావకాన ఆయుష్మాన్ భవ ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. కలెక్టర్ పరిశీలన చేయనప్పుడు ఆసుపత్రి తాళం వేసి ఉండటం, చుట్టుపక్కల ప్రజలను ఆస్పత్రి పనితీరుపై కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
విధుల్లో ఉండాల్సిన మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, సపోర్టింగ్ స్టాఫ్ ను విధులకు రాకుండా ఆసుపత్రికి తాళం వేసి ఉండటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికి చరవాణి ద్వారా ఆదేశాలు జారీ చేశారు. విధులకు హాజరు కాని ఈ ముగ్గురు వైద్య, సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ ప్రకటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ఉద్యోగులు తమ విధులను క్రమశిక్షణగా నిర్వహించాలని, అప్పుడే తమ వృత్తి ధర్మానికి న్యాయం చేసిన వారు అవుతామని అన్నారు. క్షేత్రస్థాయి పర్యటన ద్వారా ఆసుపత్రులను ఆకస్మికంగా సందర్శించడం జరుగుతుందని వైద్య సిబ్బంది తమ విధి నిర్వహణను చిత్తశుద్ధితో నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మెదక్ గోల్కొండ వీధి ప్రజలు తదితరులు పాల్గొన్నారు.