జొమాటో వార్షిక నివేదికలో వెల్లడి
న్యూఢిల్లీ, డిసెంబర్ 27: ఈరోజుల్లో ఇంటికి బంధుమిత్రులెవరొచ్చినా ఇన్‌స్టాంట్‌గా మనం ఆర్డర్ పెట్టే ఫుడ్ ఐటం బిర్యానీ. ఒకప్పుడు కొన్ని ప్రాంతాల్లోనే ఇష్టమైన ఫుడ్‌గా ఉన్న బిర్యానీ ఇప్పుడు భారత్‌లోనే నంబర్‌వన్ స్థాయికి వచ్చింది. తాజాగా జొమాటో సంస్థ విడుదల చేసిన వార్షిక నివేదికలోనూ ఇదే విషయం స్పష్టమైంది. వరుసగా తొమ్మిదోసారి కూడా సంస్థ ఫుడ్ ఆర్డర్స్‌లో బిర్యానీనే టాప్ నిలిచింది.
తమ సంస్థ ఈ ఏడాదిలో ఏకంగా 9 కోట్ల బిర్యానీ ఆర్డర్లను వినియోగదారులకు అందించినట్లు ప్రకటించింది. ఈ చొప్పున సెకనుకు మూడు బిర్యానీ ఆర్డర్లన్న మాట. తర్వాత 5.84 కోట్ల ఆర్డర్లతో పిజ్జా రెండో స్థానంలో నిలిచిందని పేర్కొన్నది.
డైనింగ్ సేవల్లోనూ ముందంజ..
జొమాటో డైనింగ్ సేవల్లోనూ దూసుకుపోతున్నది. అత్యధికంగా ఫాదర్స్ డే రోజున 1.25 కోట్ల టేబుళ్లు బుక్ అయ్యాయని ప్రకటించింది. అలాగే కుటుంబంతో వచ్చి తమ ఆనంద క్షణాలను గడిపేందుకు 84,866 రిజర్వేషన్లు బుక్ అయ్యాయని తెలిపింది. ఇలా బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి ఒకే రోజు ఓ రెస్టారెంట్‌లో ఏకంగా రూ.5.13 లక్షల బిల్లు చెల్లించినట్లు వెల్లడించింది.