- సభకు హాజరవకుండా మధ్యంతర ఉత్తర్వులకు హైకోర్టు నిరాకరణ
- 28కి విచారణ వాయిదా
హైదరాబాద్, నవంబర్ 11 (విజయక్రాంతి): పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనకుండా, ఓటింగ్‌లో పాల్గొనకుండా ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులను ఇవ్వలేమని హై కోర్టు తేల్చిచెప్పింది. అనర్హత పిటిషన్లపై తేల్చకుండా ఇలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వ లేమని సోమవారం వెల్లడించింది.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వ్యక్తిగత హోదాలో దాఖలు చేసిన పిల్‌పై చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. కేఏ పాల్ వాదనలు వినిపిస్తూ ప్రభుత్వం మారితే ఎమ్మెల్యేలు పార్టీలు మారడం అనవాయితీ అయిపోయిందని చెప్పారు.
ప్రస్తుతం బీఆర్‌ఎస్‌కు చెందిన 10 మందికిపైగా ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్‌లో చేరారని తెలిపారు. ఖైరతా బాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరో పార్టీ తరఫున సికింద్రాబాద్ లోక్‌సభ స్థానానికే పోటీ చేశారని, ఇది ఎమ్మెల్యేగా ఎన్నుకున్న నియోజకవర్గ ఓటర్లను మోసం చేయడమేనని అన్నారు.
ఈ విషయాలను పరిగణ నలోకి తీసుకుని పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలని కోరా రు. వాదనలను విన్న ధర్మాసనం రాజకీయాలకు కోర్టులను వేదికగా చేసుకోరాదని, ఇ లాంటి పిటిషన్లలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టంచేసింది. కౌంటర్లు దా ఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ విచారణను ఈనెల 28కి వవాయిదా వేసింది.
నిర్దేశిత గడువులోగా అనర్హత పిటిషన్లపై తేల్చాల్సిందే
పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్దిష్ట గడువులోగా తేల్చాల్సిందేనని బీజేపీ నేత తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. బీఆర్‌ఎస్ నుంచి ఎన్నికై కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై సెప్టెంబరు 9న సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వీ నరసింహాచార్యులు వేర్వేరుగా రెండు అప్పీళ్లు దాఖలు చేశారు.
వీటిపై సీజే బెంచ్ విచారణను కొనసాగించింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతోపాటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలంటూ బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌లో ఆయన తరఫు సీనియర్ న్యాయవాది జే ప్రభాకర్ వాదించారు. అనర్హత పిటిషన్లలో సింగిల్ జడ్జి సరైన ఉత్తర్వులు ఇచ్చారని, వాటి విషయంలో జోక్యం చేసుకునేందుకు ఆస్కారం లేదన్నారు.
సింగిల్ జడ్జి ఉత్తర్వులు సమర్థనీయమే అన్నారు. ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లపై నిర్ణయాన్ని స్పీకర్‌కే వదిలిపెట్టారని, అందులో సింగిల్ జడ్జి ఎలాంటి ఆదేశాలు జారీచేయలేదన్నారు. షెడ్యూల్ నిర్ణయించకపోతే తామే నిర్ణయిస్తామని మాత్రమే పేర్కొన్నారని అన్నారు. అందువల్ల సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో డివిజన్ బెంచ్ జోక్యం చేసుకోవాల్సిన అవసరంలేదన్నారు.
రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం స్పీకర్ విధులు నిర్వహించాల్సిందేనని చెప్పారు. అనర్హత పిటిషన్లపై తేల్చాలని స్పీకర్‌కు చట్టపరిధిలో ఈ కోర్టు ఆదేశాలు జారీ చేయవచ్చని తెలిపారు. ఖైరతాబాద్ నుంచి బీఆర్‌ఎస్ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైన దానం నాగేందర్.. ఆ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా మరో పార్టీ తరఫున పోటీ చేయడం చట్టవిరుద్ధమని అన్నారు.
అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్ కార్యాలయానికి, ఇంటికి రిజిస్టర్ పోస్టు ద్వారా పిటిషన్లు పంపితే స్వీకరించకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని చెప్పారు. కోర్టును ఆశ్రయించడాన్ని ప్రశ్నిస్తున్నారు కానీ, తాము ఇచ్చిన అనర్హత పిటిషన్లపై ఏం నిర్ణయం తీసుకున్నారన్నదానిపై ఎలాంటి ప్రస్తావన లేదన్నారు. వాదనలు మంగళవారం కొనసాగనున్నాయి.