ఆక్లాండ్: మాజీ క్రికెటర్ జాకబ్ ఓరమ్ న్యూజిలాండ్ క్రికెట్‌లో కీలక పదవి చేపట్టనున్నాడు. అక్టోబర్‌లో భారత్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌కు ఓరమ్ కివీస్ బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. మూడు వన్డే వరల్డ్ కప్స్‌తో పాటు నాలుగు టీ20 ప్రపంచకప్‌లు ఆడిన ఈ ఆల్‌రౌండర్ బౌలింగ్ కోచ్‌గా అద్భుతంగా రాణిస్తాడని కివీస్ బోర్డు ధీమా వ్యక్తం చేసింది.
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ 2023 సైకిల్‌లో భాగంగా న్యూజిలాండ్ ప్రస్తుతం మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇక బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందిన జాకబ్ ఓరమ్ 11 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో బ్లాక్‌క్యాప్స్ తరఫున 33 టెస్టులు, 160 వన్డేలు, 36 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. మూడు ఫార్మాట్లు కలిపి 250కి పైగా వికెట్లు తీశాడు. ఇక అక్టోబర్‌లో భారత పర్యటనకు రానున్న కివీస్ జట్టు టీమిండియాతో మూడు టెస్టులు ఆడనుంది.