- ముడా స్కాం పేరుతో నాపై అసత్య ఆరోపణలు
- బీజేపీ, జేడీఎస్‌పై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఫైర్
- ట్రయల్‌కోర్టులో విచారణపై స్టేను పొడిగించిన హైకోర్టు
బెంగళూరు, సెప్టెంబర్ 3: విపక్ష బీజేపీ, జేడీఎస్ పార్టీలు కావాలనే ముడాస్కాం పేరుతో నాపై తప్పుడు ఆరోపణలు సృష్టించి బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ముడా స్కాంలో తనను విచారించేందుకు గవర్నర్ అనుమతి ఇవ్వడంతో తాను భయపడుతున్నట్లు విపక్ష పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని.. తాను ఎలాంటి స్కాంకు పాల్పడనప్పుడు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. లేని స్కాంను తనకు అంటగట్టి అబద్ధాలు సృష్టించిన నేతలు ఇప్పుడు కోర్టులో వాటిని రుజువు చేయలేక చీవాట్లు తింటున్నారని విమర్శించారు. ముడా కేసులో సీఎంపై విచారణపై స్టేను కర్ణాటక హైకోర్టు ఈనెల 9వరకు పొడి వాయిదా వేసింది.
అసలేంటీ ముడా స్కాం..?
మైసూర్ నగరంలో కొందరి ప్రైవేట్ వ్యక్తుల నుంచి గతంలో ముడా(మైసూర్ అర్మన్ డెవలప్‌మెంట్ అథారిటీ) సేకరించింది. ఈ క్రమంలో ఇక్కడ సీఎం సిద్ధరా మయ్య భార్య పేరిట ఉన్న భూములను సేకరించిన ముడా ఆమెకు మైసూర్ సమీపంలోని ఖరీదైన ప్రాంతంలో ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించింది. ఈ వ్యవహారం అంతా సీఎం సిద్ధరామయ్య ఆధ్వర్యంలోనే జరిగిందంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఆ రాష్ట్ర గవర్నర్ థావర్‌చంద్‌కు ఫిర్యాదు చేశాయి.
ఈ క్రమంలో గవర్నర్ తనకున్న ప్రత్యేక అధికారాలతో సీఎం సిద్ధరామయ్యకు షోకాజ్ నోటీసులు జారీచేశారు. ఇదే విషయమై పలువురు సామాజిక కార్యకర్తలు ట్రయల్ కోర్టును ఆశ్రయించగా న్యాయమూర్తి విచారణకు ఆదేశించారు. దీనిని తీవ్రంగా పరిగణమించిన సిద్ధరామయ్య గవర్నర్ ఒక రాష్ట్ర సీఎంకు షోకాజ్ నోటీసులు ఎలా జారీ చేస్తారంటూ మండిపడ్డారు. ట్రయల్ కోర్టు తనపై విచారణకు ఆదేశించిన నేపథ్యంలో స్టే ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో పలు దఫాలుగా కర్ణాటక హైకోర్టు.. సిద్ధరామయ్యపై విచారణ ఇప్పుడే చేపట్టవద్దని స్టేలు ఇస్తూ వచ్చింది. తాజాగా మరోమారు స్టేను పొడిగించింది.
అధిష్ఠానిదే నిర్ణయం
కాంగ్రెస్ సీనియర్ నేత, పరిపాలనా కమిషన్ చైర్‌పర్సన్ ఆర్‌వీ దేశ్‌పాండే ఆదివారం తాను రాష్ట్ర సీఎం కావాలనుకుంటున్నట్లు చేసిన వ్యాఖ్యలపై సిద్ధరామయ్య ఫైరయ్యారు. ఎవరు సీఎంగా ఉండాలో శాసన సభ్యులు, అధిష్ఠానం నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. కాగా ముడాస్కాంలో ఆరోపణల నేపథ్యంలో కర్ణాటకకు చెందిన ఓ ఉన్నతాధికారి దినేశ్ కుమార్‌పై రా్రష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఈ విషయమై సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ.. తప్పు ఎవరు చేసినా చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని స్పష్టం చేశారు.