calender_icon.png 19 October, 2024 | 6:11 PM

సియోల్ టూర్‌కు విపక్షాల

19-10-2024 12:42:10 AM

మూసీ ప్రక్షాళనపై  టూర్‌ను ప్లాన్ చేసిన సర్కార్

సుముఖత చూపని బీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 18 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టులో భాగంగా.. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో దక్షిణ కొరియా సియోల్ నగరంలోని హేన్ నది స్టడీ టూర్‌కు వెళ్లేందుకు విపక్ష బీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు సముఖత చూపనట్లు సమాచారం. దీంతో ఈ టూర్‌లో కేవలం కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ కండువా కప్పుకున్న బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు మాత్రమే వెళ్లనున్నట్టుగా తెలుస్తుంది. రాష్ట్రంలో మూసీ ప్రాజెక్టు అత్యంత రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్న నేపథ్యంలో.. దక్షిణ కొరియాలోని సియోల్ నగరంలో అక్కడున్న హేన్ నదిని అధ్యయనం చేసేందుకు ప్రజా ప్రతినిధులు, అధికారులు కలిసి శనివారం హైదరాబాద్ నుంచి సియోల్‌కు బయలుదేరనున్నారు. ఈనెల 24 వరకు అక్కడి హేన్ నది ప్రాజెక్టు చేపట్టిన తీరు తెన్నులను వారు పరిశీలించనున్నారు. 

గ్రేటర్ పరిధిలో..

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 24 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గెలుపొందారు. వీరిలో మూసీ పరివాహక ప్రాంతానికి చెందిన చేవేళ్ల, రాజేంద్రగనర్, అంబర్‌పేట, ఎల్‌బీ నగర్, ఉప్పల్, మల్కాజిగిరి, మేడ్చల్ తదితర ఎమ్మెల్యేలు ఉన్నారు. సీఎం సలహాదారులు వేం.నరేందర్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో వెళ్లనున్న ఈ టూర్‌లో మూసీ పరివాహక ప్రాంతానికి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీతో పాటు జీహెచ్‌ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్, ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్‌తో పాటు ఎంఆర్‌డీ సీఎల్ అధికారులు ఉన్నారు. ఈ టూర్‌కు బీఆర్‌ఎస్‌కు చెందిన అంబర్‌పేట, ఎల్‌బీనగర్, ఉప్పల్, మల్కా జిగిరి, మేడ్చల్ ఎమ్మెల్యేలు.. కాలేరు వెంకటేష్, సుధీర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, మల్లారెడ్డి దూరంగా ఉంటున్నట్టు సమాచారం. వీరితో పాటు బీజేపీకి చెందిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, ఎంఐఎం పార్టీకి చెందిన మలక్‌పేట్, చార్మినార్, కార్వాన్, బహదూ ర్‌పురా ఎమ్మెల్యేలు సైతం టూర్‌కు దూరంగా ఉన్నట్టుగా సమాచారం. అయితే.. బీఆర్‌ఎస్‌లో గెలిచి కాంగ్రెస్‌లో చేరిన కాలె యాదయ్య, ప్రకాష్ గౌడ్, జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్ రెడ్డి ఈ టూర్‌కు వెళ్తున్నారు. 

టూర్‌కు వెళ్తే జీరోలవుతామని..

మూసీ సుందరీకణ కోసం అధ్యయనం చేసేందుకు ప్రజా ప్రతినిధు లను సియోల్ నగరానికి స్టడీ టూర్‌కు పంపేందుకు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే మూసీ సుందరీకరణ పేరుతో నిరుపేదలను ఇబ్బంది పెడుతున్నారంటూ ప్రభుత్వ తీరును విపక్షాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. మూసీ పరీవాహక ప్రాం తంలోని బాధితుల ఇళ్ల్లకు మార్కింగ్ చేసిన దగ్గర్నుంచి విపక్షాలన్నీ ప్రభుత్వంపై ఐక్యంగా పోరాడుతున్నాయి. ఇన్నాళ్లు మూసీ ప్రాజెక్టును వ్యతిరేకించడం ఒకటయితే.. సియోల్ టూర్‌కు వెళ్తే ప్రజల దృష్టిలో జీరోలుగా మారిపోతామని ఊహించిన విపక్షాలు టూర్‌కు సముఖత వ్యక్తం చేయనట్లు సమాచారం. కారణాలు ఏమైనా ఈ టూర్ కు బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో పాటు బీజేపీ, ఎంఐఎం ప్రజా ప్రతినిధులు దూరంగా ఉంటున్నట్టుగా తెలుస్తుంది.