calender_icon.png 18 January, 2025 | 3:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లోక్‌సభ ముందుకు జమిలి బిల్లు.. వ్యతిరేకించిన విపక్ష పార్టీలు

17-12-2024 01:34:32 PM

న్యూఢిల్లీ,(విజయక్రాంతి): దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న జమిలి ఎన్నికల బిల్లుపై లోక్ సభలో చర్చలు కొనసాగుతున్నాయి. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వన్ నేషన్ - వన్ ఎలక్షన్ బిల్లులను లోక్ సభలో ప్రవేశపెట్టారు. లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించేందుకు 129వ రాజ్యంగ సవరణ బిల్లుగా ఈ బిల్లును కేంద్రం ప్రభుత్వం ప్రతిపాదించింది. వన్ నేషన్ - వన్ ఎలక్షన్ కోసం కేంద్రం రెండు బిల్లులను సిద్ధం చేసింది. కానీ, ఈ జమిలి బిల్లును విపక్ష పార్టీలైన కాంగ్రెస్, సమాజ్ వాదీ డీఎంకే, ఇండియన్ యూనియన్ ముస్లీం లీగ్(ఐయూఎంఎల్), శివసేన (యూబీటీ) బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. జమిలి బిల్లు రాజ్యాంగ మౌలక స్వరూపానికి విరుద్ధంగా ఉందని మనిశ్ తివారి పేర్కొన్నారు.

తక్షణమే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని ఆయన సూచించారు. ఎస్పీ నేత ధర్మేంద్ర యాదవ్ స్పందిస్తూ రాజ్యంగ ధ్వంసానికి బిడ్ వేస్తున్నారని ఎన్డీఏ సర్కార్ పై మండిపడ్డారు. జమిలి ఎన్నికలు నియంతృత్వానికి దారి తీస్తాయన్నారు.  జమిలి ఎన్నికలంటే రాష్ట్రాల హక్కులను దెబ్బతీయడమే అని, ఈ ఎన్నికల బిల్లు ప్రజాస్వామ్యానికి వైరస్ లాంటిదని టీఎంసీ పార్టీ నేతలు ఆరోపించారు. దేశంలో ప్రస్తుతం కావాల్సింది జమిలి ఎన్నికలు కాదు.. ఎన్నికల సంస్కరణలు అని టీఎంసీ తెలిపింది. గతంలో ఎన్జేఏసీ బిల్లును కూడా ఇలాగే ఆమోదించుకుంటే ఎన్జేఏసీ మౌలిక స్వరూపానికి విరుద్ధమని సుప్రీంకోర్టు కొట్టేసినట్లు టీఎంసీ గుర్తు చేసింది. జమిలి ఎన్నికల చట్టం వస్తే దానికీ అదే గతి పడుతుందని టీఎంసీ హెచ్చరించారు.  ఇదిలా ఉండగా జమిలి ఎన్నికల బిల్లుకు తెలుగు దేశం పార్టీ బేషరుతుగా మద్దతు తెలిపింది.