calender_icon.png 13 February, 2025 | 2:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చర్చకు జంకుతున్న ప్రతిపక్షాలు

12-02-2025 11:34:32 PM

బి.మహేశ్ కుమార్ గౌడ్ :

చేతనైతే మంచి చేయాలి... లేదా ఇతరులు మంచి చేస్తే స్వాగతించాలి.. ఈ రెండు చేతకాకపోతే మిన్నకుం డా ఉండాలి అని పెద్దలు చెప్పిన సూక్తి. ఈ వ్యాఖ్యలు తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలకు సరిగ్గా సరిపోతాయి. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన అనతికాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి ఎన్నో మంచి పనులు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తుంటే ఇక్కడి ప్రతిపక్ష పార్టీలు అభినందించాల్సింది పోయి అవాకులు చెవా కులు పేలడం వారి దిగజారుడుతనానికి నిదర్శనం.

మన ప్రభుత్వం అమలు చేస్తు న్న పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలపై చర్చకు సిద్ధమని కాంగ్రెస్ సవాలు చేస్తు న్నా ప్రతిపక్షాలు జంకుతూ, వెనుకంజవేస్తూ నిరాధార ఆరోపణలు చేస్తున్నాయి.

తెలంగాణ ఆవిర్భావం నాటికి రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెటున్న రాష్ట్ర ఆర్థిక రంగాన్ని రూ.7 లక్షల కోట్ల అప్పుతో దివా ళా స్థితికి తీసుకొచ్చిన బీఆర్‌ఎస్ నేతలకు కాంగ్రెస్‌పై విమర్శలు చేసే నైతిక హక్కే లేదు. రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉన్నా అధికా రం చేపట్టిన పక్షం రోజుల్లోనే ఆరు గ్యారెంటీలలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్, సబ్సిడీ గ్యాస్ సిలిండర్ పంపిణీ, ఆరోగ్య శ్రీ పరిమితి పెంపు పథకాలను విజయవంతంగా అమలు చేసింది.

లోక్‌సభ ఎన్నికల కోడ్‌తో కొంత ఆలస్యమైనా రైతు రుణమాఫీ, వరికి బోనస్ అం దించి తమది రైతుల ప్రభుత్వమని నిరూపించుకుంది. ఏడాది పాలనలోనే 55 వేలకుపైగా ప్రభుత్వ నియామకాలు పూర్తిచేసి యువతకిచ్చిన మాట నిలబెట్టుకుంది కాంగ్రెస్. బీఆర్‌ఎస్ పాలనకు భిన్నంగా రికార్డు స్థాయిలో ఉద్యోగాలిచ్చి దేశానికే స్ఫూర్తిగా నిలిచిన కాంగ్రెస్‌పై బీఆర్‌ఎస్ విమర్శలు హాస్యాస్పదంగా ఉన్నాయి.

నాలుగు చారిత్రాత్మక పథకాలు

అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే తెలంగాణలో పలు సంక్షేమ పథకాలను అమలుచేసి ఇందిరమ్మ రాజ్యాన్ని అందించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాశీర్వాదం తో మరింత ఉత్సాహంగా గణతంత్ర దినోత్సవం రోజున చిరస్థాయిలో నిలిచిపోయే లా రూ.45 వేల కోట్ల వ్యయం గల 4 పథకాలను అమల్లోకి తెచ్చింది. రాష్ట్రంలోని రైతులు, నిరుపేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా రైతు భరో సా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల పంపిణీ వంటి బృహత్ కార్యక్రమాలను ప్రారంభించింది.

వ్యవసాయానికి పెట్టుబడి కోసం రైతు భరోసా కింద ఎకరాకు రూ.12 వేలు ప్రభు త్వం అందించింది. గత బీఆర్‌ఎస్ ప్రభు త్వం అనుభవాలతో ప్రజాధనం దుర్వినియోగం కాకుండా వ్యవసాయ యోగ్యత భూములకే రైతు భరోసా ఇవ్వాలని  నిర్ణయించడంతో రాష్ట్రంలో సాగులో ఉన్న దాదాపు కోటిన్నర ఎకరాలకుపైగా వ్యవసాయ భూములకు రైతు భరోసా అందు తోంది.

గతంలో కేసీఆర్ సర్కారు ఎకరాని కి రూ.10వేల రైతుబంధు పథకంలో భాగంగా బడాబాబుల భూములకు, రియ ల్ ఎస్టేట్ భూములకు, మైనింగ్ భూములకు చెల్లించడంతో రూ.22 వేల కోట్ల ప్రజాధనం నీటిపాలైంది. దేశంలోనే మొదటిసారి భూమిలేని రైతుకూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఏడాది కి రూ.12 వేలు చెల్లిస్త్తోంది. ఈ పథకం కింద సుమారు 10 లక్షల మంది రైతు కూలీల కోసం ప్రభుత్వం రూ.2 వేల కోట్లు ఖర్చు చేస్తూ వారిలో భరోసా నింపింది.

నాలుగు లక్షల ఇందిరమ్మ ఇండ్లు

నిరుపేదలకు నీడనిచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను అందిస్తోంది. నాలుగు లక్షల ఇండ్ల కోసం రూ.22,500 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్త్తోంది.  గతం లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించి, అరకొరగా పంపిణీ చేసిన డబుల్ బెడ్ రూం ఇండ్లలో ఎమ్మెల్యేల సిఫార్సులకే ప్రాధాన్యతివ్వడంతో బీఆర్‌ఎస్ కార్యక ర్తలకు, సానుభూతిపరులకే ఇండ్లు లభించాయి.

ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రతినిధుల ప్రమేయం లేకుండా పేదలకే ఇండ్లు లభించేలా గ్రామ సభలు నిర్వహిం చి పారదర్శకంగా అర్హులను గుర్తించి అం దిస్తోంది. మరోవైపు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఫేజ్-1 పథకంలో దేశవ్యాప్తంగా 2 కోట్ల ఇళ్లు నిర్మించామని చెబుతున్నా తెలంగాణ కు మాత్రం 1.58 లక్షల ఇళ్లు అంటే మొత్తంలో 0.79 శాతం మాత్రమే కేటాయించి అన్యాయం చేసింది.

అయినా తెలంగాణ బీజేపీ నేతలు ఈ వివక్షపై కేంద్రాన్ని ప్రశ్నించకుండా పేదల కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం విడ్డూరం.

రేషన్ కార్డుల కోసం ఎదురుచూపులు

బీఆర్‌ఎస్ పాలనలో రేషన్ కార్డుల కోసం నిరుపేదలు కళ్లలో ఒత్తులేసుకొని ఎదురుచూసినా, పదేళ్లలో 40 వేల కార్డు లు కూడా ఇవ్వలేదు. వీరి పాలనలో రేషన్ కార్డుల కోసం వచ్చిన 12 లక్షల దరఖాస్తు లు, రేషన్ కార్డులలో మార్పులు, చేర్పుల కోసం వచ్చిన 18 లక్షల దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టడంతో పేదలకు అన్యా యం జరిగింది. నిరుపేదల సాధక బాధకా లు తెలిసిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో 40 లక్షల రేషన్ కార్డులు ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది.

ప్రజల ఆశలకు అనుగుణంగా పరిపాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు, బల హీన వర్గాలకు సామాజిక న్యాయం అం దించాలనే కృత నిశ్చయంతో 2025 ఫిబ్రవరి 4న చట్టసభల వేదికగా కీలకమైన సామాజిక ప్రక్రియను పూర్తి చేసింది. సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య, రాజకీ య, కుల సర్వే నివేదికలతో పాటు ఎస్సీల వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ నివేదికను ఆమోదించిన రాష్ట్ర మంత్రిమండలి అసెంబ్లీలో చర్చ  చేపట్టి  సామాజిక న్యాయంపై తమ నిబద్ధతను నిరూపించుకుంది. 

శాస్త్రీయ పద్ధతిలో కులగణన

రాష్ట్రంలో కులగణన సర్వేను నిర్దేశించుకున్న ప్రకారం ఏడాదిలోనే పూర్తిచేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో బీఆర్‌ఎస్ హడావుడి చేస్తూ నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేకు భిన్నంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం శాస్త్రీయ పద్ధతిలో కులగణన సర్వే చేపట్టి 96 శాతంపైగా కుటుంబాల నుండి సమాచారం సేకరించి దేశానికే ఆదర్శంగా నిలిచింది.

తమ పాలనలో నిర్వ హించిన సమగ్ర కుటుంబ సర్వే నివేదికను బహిర్గతం చేయని బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ను విమర్శించడం వారి అవకాశవాద రాజకీయాలకు పరాకాష్ట. ఇటీవల నిర్వహించిన కులగణన లెక్కల ప్రకారం ముస్లింలలోని బీసీలను కూడా కలుపుకుంటే 56.33 శాతం బీసీలున్నారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ తరఫున 42 శాతం బీసీ అభ్యర్థులకు టికెట్లు ఇవ్వాలని కాం గ్రెస్ గొప్ప నిర్ణయం తీసుకుంది. బీజేపీ, బీఆర్‌ఎస్ తాము కూడా 42 శాతం టికెట్లు  ఇస్తామనే చెప్పే ధైర్యం లేక కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తూ తప్పించుకోవాలని చూస్తున్నాయి.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా బడ్జెట్‌లో తెలంగాణ కు కనీస ప్రాధాన్యత ఇవ్వకుండా, ఎలాం టి కేటాయింపులు లేకుండా చేస్తున్న అన్యాయం కొనసాగుతూనే ఉంది. రాష్ట్రం నుండి 8 మంది బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులున్నా రాష్ట్రానికి కేంద్రం నుండి గాడిద గుడ్డే మిగిలింది. 

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి అమలు చేస్తుంటే తట్టుకోలేని బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు చేస్తున్న విమర్శలను ప్రజలు చీదరించుకుంటున్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్ అభివృద్ధిపై, ఏడాదిలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధిపై బీఆర్‌ఎస్ వారితో, అలాగే రాష్ట్రానికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పదకొండేళ్లుగా చేస్తున్న అన్యాయాలపై బీజేపీ వారితో చర్చకు సిద్ధమని కాంగ్రెస్ పార్టీ పలుమార్లు సవాలు విసిరినా ముందుకు రాని ఈ పార్టీలు కాం గ్రెస్‌కు వ్యతిరేకంగా ఒకటవుతున్నాయి.

త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించేందుకు ఈ రెండు పార్టీలు లోపాయికారి ఒప్పందం కుదుర్చుకోవడంతో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమానికి ఎవరు కట్టుబడి పనిచేస్తున్నారో గమనిస్తున్న తెలంగాణ ప్రజలు సరైన సమయంలో సరైన రీతిలో  బుద్ధి చెప్పడం ఖాయం.

 వ్యాసకర్త పీసీసీ అధ్యక్షులు