calender_icon.png 20 November, 2024 | 6:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్వేతో బీసీలకు అవకాశాలు

20-11-2024 02:50:30 AM

జనాభా దామాషా ప్రకారం ప్రభుత్వ చర్యలు

బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ 

ఖమ్మం కలెక్టరేట్‌లో బహిరంగ విచారణ

ఖమ్మం, నవంబర్ 19 (విజయక్రాంతి): జనాభా దామాషా ప్రకారం బీసీలకు అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఇందులో భాగంగానే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను చేపట్టిందని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ తెలిపారు. మంగళవారం ఖమ్మం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో సామాజికంగా, విద్యా పరంగా వెనుకబడిన తరగతుల స్థితిగతులపై బహిరంగ విచారణ కార్యక్రమం నిర్వహించారు.

అనంతరం మీడియా సమావేశంలో బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ మాట్లాడారు. తాము నిర్వహించిన బహిరంగా విచారణలో వివిధ సంఘాల నుంచి నేరుగా వారి అభిప్రాయాలను తెలుసుకున్నామని తెలిపారు. కుటుంబ సర్వేతో రాష్ట్ర ప్రభుత్వం ఏయే కులాల వారు ఎంతమంది ఉన్నారు, ఏ స్థితిలో ఉన్నారో తెలుసుకుంటుందని చెప్పారు. జనాభా దామాషా ప్రకారం హక్కులు సాధించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టామని చెప్పారు. 

కుల సంఘాల ఆవేదన విన్నాం 

బహిరంగా విచారణలో కుల సంఘాల ఆవేదనను విన్నామని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ తెలిపారు. సంచార జాతుల వారు తమను ప్రత్యేకంగా గుర్తించాలని, చాకలి కులస్థులు ఎస్సీ జాబితాలో చేర్చాలని, వారికి కార్మిక చట్టం తేవాలని కోరారని చెప్పారు. బట్రాజులు బీసీ ఏ లో చేర్చాలని, వెదురు సంఘం వారికి అసవరమైన వస్తువులు అందుబాటులో ఉండేలా చూడాలని కోరినట్టు తెలిపారు.

గిరిజన ప్రాంతాల్లో గౌడ్లకు ఎస్టీ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారని, ఏపీ నుంచి వలస వచ్చిన గంగపుత్రులకు తప్పుడు సర్టిఫికెట్లు అందిస్తున్నట్టు తమ దృష్టికి తెచ్చారని తెలిపారు. ఈడబ్ల్యుఎస్ కారణంగా బీసీలకు అన్యాయం జరుగుతుందని సర్వత్రా  అభిప్రాయం వ్యక్తం చేశారని దీనిని ప్రభుత్వం దృష్టికి  తీసుకువెళ్తామని చెప్పారు. బీసీ కులాల పరిరక్షణకు బీసీ అట్రాసిటీ చట్టం తీసుకురావాలని కొందరు తమ దృష్టికి తెచ్చారన్నారు.

బీసీ కమిషన్ ఆహ్వానం మేరకు  ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న రెండు జిల్లాల కలెక్టర్లకు కమిషన్ చైర్మన్ నిరంజన్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల గోడును కలెక్టర్లు నేరుగా తెలుసుకోవడం మంచిదని చెప్పారు. ఈ సమావేశంలో ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్, కొత్తగూడెం కలెక్టర్ జితేష్ వి.పాటిల్, బీసీ కమిషన్ కమిషన్ సభ్యులు రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మీ రంగు, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, ఖమ్మం అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, బీసీ కమిషన్ ప్రత్యేక అధికారి సతీష్, ఖమ్మం బీసీ అభివృద్ధి అధికారిణి జ్యోతి, కొత్తగూడెం బీసీ అభివృద్ధి అధికారిణి ఇందిర పాల్గొన్నారు.

65 శాతం సర్వే పూర్తి

రాష్ట్రంలో ఇప్పటి వరకు 75 లక్షల 75వేలకు పైగా ఇండ్ల సర్వే చేసి, 65 శాతం సర్వే పూర్తయిందని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ తెలిపారు. ఖమ్మం జిల్లాలో  3 లక్షల 18వేల 624 (56.2 శాతం), భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2లక్షల 25వేల 488 (67.02 శాతం) సర్వే పూర్తయిందని అన్నారు. ప్రజలు స్వచ్చందంగా  ముందు కు వచ్చి సమాచారం అందిస్తున్నారని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసమే  ఈ సర్వే చేపట్టామని చెప్పారు. ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

బహిరంగ విచారణలో ప్రజల అభిప్రాయాలను క్రోడీకరిస్తూ తాము డిసెంబర్ 9న హైకోర్టులో  నివేదిక సమర్పిస్తామని తెలిపారు. బీసీలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చేసేందుకే ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. సర్వేకు అన్ని రాజకీయ పక్షాలు సహకరించాలని కోరారు.