calender_icon.png 29 September, 2024 | 5:47 AM

వక్ఫ్ సవరణ బిల్లుపై అభిప్రాయ సేకరణ

29-09-2024 01:16:23 AM

 జేపీసీతో మూడు రాష్ట్రాల ప్రతినిధుల భేటీ

హైదరాబాద్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): వక్ఫ్ భూముల సవరణ బిల్లుపై అభిప్రాయ సేకరణ కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) తెలంగాణలో పర్యటించింది. శనివారం హైదరాబాద్‌ని తాజ్‌కృష్ణ హోటల్‌లో జేపీసీ చైర్‌పర్సన్ జగదాంబికాపాల్ ఆధ్వ ర్యంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ సమావేశం నిర్వ హించారు. జేపీసీ ముందు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ప్రతినిధులు తమ అభిప్రాయాలను వినిపించారు.

ఈ సందర్భంగా తెలంగాణలోని తమ పార్లమెంట్ పరిధిల్లో నెలకొన్న వక్ఫ్‌భూముల సమస్యలను జేపీసీ దృష్టికి తీసుకొస్తూ సవరణ బిల్లుకు బీజేపీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రఘునందన్‌రావు, ఈటల రాజేందర్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా జేపీసీ ముందు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ వక్ఫ్ భూమి బాధిత రైతుల ఇబ్బందులను న్యాయవాదులు వివరించారు.

పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా వాస్తవాలు తెలిపారు. జహీరాబాద్ పరిధిలోని కోహీర్, న్యాల్‌కల్, ఝరాసంగెం, జహీరాబాద్, రాయికోడ్ మండలాల పరిధిలో మొత్తం 13,000 ఎకరాల రైతుల భూములు వక్ఫ్ ఆధీనంలో ఉన్నట్లు ప్రతినిధులు వివరించారు. కొన్నేళ్లుగా పొజిషన్‌లో ఉన్నప్పటికీ వక్ఫ్ పేరుతో వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జేపీసీ సభ్యురాలు, ఎంపీ డీకే అరుణ ఆధ్వర్యంలో కమిటీ చైర్‌పర్సన్ జగదాంబికాపాల్‌కు వక్ఫ్ భూ బాధితుల తరఫున న్యాయవాదులు రిప్రెసెంటేషన్ ఇచ్చారు.