calender_icon.png 3 October, 2024 | 2:07 AM

ఆపరేషన్ రాజస్థాన్

02-10-2024 02:34:45 AM

  1.  నాలుగు బృందాలు.. 15 రోజులు 
  2. టీజీ సీఎస్బీ సాహసోపేత వేట
  3. రాజస్థాన్‌లో 27 మంది సైబర్ నేరస్తుల అరెస్ట్
  4. 29 మ్యూల్ ఖాతాలతో సహా పలు పత్రాలు స్వాధీనం
  5. వివరాలను వెల్లడించిన టీజీసీఎస్బీ డైరెక్టర్ శిఖా గోయల్

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 1 (విజయక్రాంతి): తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా అంతర్రాష్ట్ర సైబర్ ఆపరేషన్ నిర్వహించింది. సైబర్ సెల్ అధికారులు, సిబ్బంది సాహసోపేత స్టంట్ చేశారు. నాలుగు బృందాలు 15 రోజుల పాటు రాజస్థాన్ అంతటినీ జల్లెడ పట్టారు. ఏకంగా 27 మంది సైబర్ నేరస్తులను అదుపులోకి తీసుకున్నారు.

అపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసి ఉన్నతాధికారులతో భేష్ అనిపించుకున్నారు. హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్‌లో మంగళవారం టీజీసీఎస్‌బీ డైరెక్టర్ శిఖా గోయల్ వివరాలు వెల్లడించారు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్, జైపూర్, నాగౌర్ ప్రాంతాలకు చెందిన నిందితులు కలు రామ్, లోకేశ్ శర్మ, ప్రదీప్ గెహ్లాట్, రాజేశ్ బర్మాన్, కల్యాణ్ బర్మాన్, మనీష్ జకార్, ఖైలాశ్ చంద్ దారా, సచీన్ బఢానా, తుషార్ జంగీద్, మోహిత్ శర్మ, లఖాన్ అరోరా, శుభం జఠవాత్, అశీశ్ జంగీద్, దీపక్ జంగీ ద్, లక్కీ కమవాత్, మురళీధర్ గౌర్, రాకేశ్ దూది, వినోద్ చవారియా, రాకేశ్ జఠ్, ఓమ్ హరిశర్ణమ్, సంజయ్ మౌర్య, రాజేశ్ పంచారియా, రామ్‌విలాస్ సగ్రా, విష్ణు ప్రసాద్ సర్గానా, శ్రవణ్‌కుమార్ మాలి, రషీద్, మక్సూద్ (27 మంది) సైబర్ నేరస్తులు తెలంగాణకు చెందిన వందలాది మందికి చెందిన బ్యాంక్ ఖాతాల వివరాలను వారికి తెలియకుండా తీసుకుంటు న్నారు.

వాటిని సైబర్ నేరగాళ్లకు అమ్మి సొమ్ము చేసుకుంటారు. సైబర్ నేరస్తులు ఒక్కో లావాదేవీకి క్రిప్టో కరెన్సీ పద్ధతిలో నిందితులకు డబ్బు ముట్టజెప్తారు. వీరిపై రాష్ట్రవ్యాప్తంగా 189 సైబర్ క్రైం కేసులు నమోదయ్యాయి. అలగే దేశవ్యాప్తంగా 2,223 కేసులు నమోదయ్యాయి. అలాగే ఒక్కో నిందితుడిపై పదుల సంఖ్యలో వ్యక్తిగత కేసులు ఉన్నాయి.

ఈ 27 మందికి సంబంధించిన 29 మ్యూల్ బ్యాంకు ఖాతాలను గుర్తించాచారు. వీరు దేశవ్యాప్తంగా రూ.11.01 కోట్లు, రాష్ట్ర వ్యాప్తంగా రూ.9 కోట్ల లావాదేవీలు జరిపినట్లు నిర్ధారించారు. నిందితుల నుంచి 31 సెల్‌ఫోన్లు, 37 సిమ్ కార్డులు, 13 ఏటీఎం కార్డులు, ఏడు చెక్ బుక్‌లు, రెండు హార్డ్ డిస్క్‌లతో పాటు ఇతర కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

టీజీఎస్బీ అధికారులు సెప్టెంబర్ చివరివారం లో వారిని రాజస్థాన్‌లో అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరుపరిచి రాష్ట్రంలోని వివిధ జైళ్లకు రిమాండ్ తరలించారు. వీరు కాక మరో 33 మంది సైబర్ నేరగాళ్లను పోలీసులు గుర్తించారు. త్వరలోనే వారిని కూడా పట్టుకునేందుకు వేట మొదలు కానున్నది.

అప్రమత్తత అవసరం

పౌరులు ఎట్టి పరిస్థితుల్లోనూ మన మొబైల్స్‌కు వచ్చే అన్ నౌన్ లింక్‌లను క్లిక్ చేయవద్దు. ఎవరైనా పోలీసు అధికారుల పేరుతో ఫోన్ చేసి భయబ్రాం తులకు గురిచేస్తే వెంటనే డయల్ 100కి ఫిర్యాదు చేయండి. ఒకవేళ సైబర్ నేరగాళ్ల బారిన పడితే గంటలోపు మెయిల్ ఐడీ cybercrime.gov.inకి ఫిర్యాదు చేయవచ్చు.

లేదా టోల్ ఫ్రీ నంబర్ 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. లేదా ఎమర్జెన్సీ నంబర్ కాల్/వాట్సప్ 87126 65171 కి కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చు. అలాచేయగలిగితే పోలీసులు వెంటనే సైబర్ నేరగాళ్లు దోచుకున్న డబ్బు  అకౌంట్లను ఫ్రీజ్ చేయవవచ్చు. తద్వారా బాధితులకు డబ్బు తిరిగి పొందొచ్చు. సైబర్ నేరాలతో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి.

 తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్