calender_icon.png 18 October, 2024 | 11:51 PM

‘ఆపరేషన్ రావణ్’ నేను నటించాల్సిన సినిమా

26-07-2024 12:05:00 AM

మన ఆలోచనలే మన శత్రువులు అనే కథాంశంతో నిర్మితమైన చిత్రం ‘ఆపరేషన్ రావణ్’. రక్షిత్ అట్లూరి కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో రాధిక శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. న్యూ ఏజ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రానున్న ఈ సినిమాలో సంగీర్తన విపిన్ కథానాయిక. ధ్యాన్ అట్లూరి నిర్మాణంలో వెంటక సత్య దర్శకత్వం వహించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం చిత్ర బృందం నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి దర్శకుడు మారుతి, హీరో తిరువీర్, రచయిత ‘డార్లింగ్’ స్వామి అతిథులుగా హాజరయ్యారు.

దర్శకుడు మారుతి మాట్లాడుతూ “ఆరు నెలల కిందట నేను ఈ సినిమా చూశాను. చాలా బాగుంది. రక్షిత్‌లో పట్టుదల, అంకితభావం ఉన్నాయి. ఈ సినిమాతో అతను మరింత మంచి పేరు తెచ్చుకోవాలి” అన్నారు. హీరో తిరువీర్ మాట్లాడుతూ “నేను రక్షిత్ కలిసి చేసిన పలాస సినిమా నుంచి మేమిద్దరం మంచి స్నేహితులం. “ఆపరేషన్ రావణ్‌” సినిమాలో నేను నటించాల్సింది. ఈ కథ విన్న తర్వాత నా ఫేవరేట్ థ్రిల్లర్ మూవీస్ గుర్తొచ్చాయి. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది.

కథ చెప్పడమే కాదు అంతే బాగా తీశారు. ట్రైలర్ చూసి షాక్ అయ్యాను. అనుకోని కారణాలతో ఈ సినిమా చేయలేక పోయాను” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరో రక్షిత్ అట్లూరి, దర్శకుడు వెంకట సత్య, పాటల రచయిత ప్రణవం, నటి శ్వేత, డైలాగ్ రైటర్ లక్ష్మీ లోహిత్ పూజారి తదితరులు పాల్గొన్నారు.