ప్రభుత్వంలో చర్చలు జరుగుతున్నాయి
రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
కరీంనగర్ కలెక్టరేట్‌లో మహిళా శక్తి క్యాంటీన్లు ప్రారంభం
కరీంనగర్, నవంబరు 12 (విజయక్రాంతి): మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సుల నిర్వహణను అప్పగిస్తామని, అందుకు ప్రభుత్వంలో చర్చలు జరుగుతున్నాయని బీసీ సంక్షేమ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మొదటి దశలో 600 బస్సులు ఐకేపీ ద్వారా కొనుగోలు చేయాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. మంగళవారం కరీంనగర్ కలెక్టరేట్ ప్రాంగణంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహి ళా సంఘాల ద్వారా చైతన్యం చేయడానికి, మహిళలు ఆర్థికంగా ఎదగడానికి చాలా కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు. సిరిసిల్లలో యార్న్ బ్యాంకు తీసుకురావడానికి విప్ ఆది శ్రీనివాస్, మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి పనిచేస్తున్నామన్నారు. సిరిసిల్ల చేనేతకు సంబంధించిన ముఖ్యులంద రూ వస్తే చర్చించి, సమస్యలు పరిష్కారం చేద్దామని అన్నారు. కాగా వికారాబాద్ కలెక్టర్ మీద దాడి అంశంపై మాట్లాడుతూ.. కలెక్టర్‌పై దాడి జరిగితే ఊరుకొమ్మంటారా, ప్రజాస్వామ్య పద్ధతిలో న్యాయస్థానాలు ఉన్నాయన్నారు.
విధి నిర్వహణలో ఉన్న వారిని ఇబ్బంది పెడితే చర్యలు ఉంటాయని, రాజకీయ కుట్రదారులు ఆటంకం కలిగిస్తే చర్యలు ఉంటాయన్నారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై బీఆర్‌ఎస్, బీజేపీలు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాన్నారు. రైతులకు సంబంధించిన వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని, రైస్ మిల్లర్లు ప్రభుత్వ కొనుగోలులో భాగస్వాములు కావాలన్నారు. ప్రభుత్వానికి బకాయి లు ఉన్న డిఫాల్టర్లను పక్కన పెట్డండని అధికారులకు సూచించారు.
పత్తి కొనుగోలుపై ఎక్కడ ఇబ్బంది వచ్చినా ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారని వారిదే బాధ్యతని అన్నారు. మేము రాష్ట్రంలో అధికారంలో ఉండి వడ్లను కొనుగోలు, మీరు కేంద్రంలో అధికారంలో ఉండి కాటన్‌లో పరస్పర సహకారం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, ట్రెయినీ కలెక్టర్ అజ య్ యాదవ్, ఆర్డీవో మహేష్ పాల్గొన్నారు.
హైస్కూళ్లలో రోబోటిక్, సైన్స్ ల్యాబులు
హుస్నాబాద్, నవంబర్ 12: సైన్స్, టెక్నాలజీలో మెలకువలు నేర్చుకుంటే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం ఆయన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని ప్రభుత్వ గర్ల్స్, బాయ్స్ హైస్కూళ్లలో స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఏర్పాటు చేసిన రోబోటిక్, సైన్స్, కంప్యూటర్, ఇంగ్లిష్ ల్యాబులతోపాటు మొబైల్ యాపులను ప్రారంభించారు.
భవిష్యత్తంతా సైన్స్, డిజిటల్, టెక్నాల జీకే ఉండటంతో సోహాన్ అకాడమీ, నిర్మాణ్ సంస్థ, ఇన్ఫినిటీ వైద్య సంస్థల సహకారంతో హైస్కూల్ స్థాయిలో టెక్నికల్ విద్యను అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో కలెక్ట ర్ మనుచౌదరి, మున్సిపల్ చైర్‌పర్సన్ ఆకుల రజిత, ఎంఈవో మనీల తదితరులు పాల్గొన్నారు.