calender_icon.png 28 September, 2024 | 2:57 PM

ఆపరేషన్ మూసీ

27-09-2024 02:17:34 AM

రివర్ బెడ్ ఇళ్లకు మార్కింగ్ 

నిర్వాసితులకు పునరావాసంపై అవగాహన కల్పిస్తున్న రెవెన్యూ అధికారులు 

ఆధార్‌తో పాటు వాటర్, ఎలక్ట్రిసిటీ బిల్లుల వివరాలు సేకరణ 

సొంత ఇల్లు ఉన్న వారికే డబుల్ ఇండ్ల కేటాయింపు 

పలుచోట్ల ఉద్రిక్తత 

హైదరాబాద్ సిటీబ్యూరో/మలక్‌పేట/ ఎల్‌బీనగర్/ కార్వాన్, సెప్టెంబర్ 26 (విజయ క్రాంతి): మూసీ ప్రక్షాళన ప్రక్రియకు వేగంగా అడుగులు పడుతున్నాయి. హైదరాబాద్ మహానగరంలోని 55 కిలోమీటర్ల మూసీ పరీవాహక ప్రాంతంలో ఇప్పటికే సామాజిక, ఆర్థిక సర్వేను రెవెన్యూ అధికారులు పూర్తిచేశారు. రివర్ బెడ్ ఇళ్లను తొలగించేందుకు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో గురువారం నుంచి రెవెన్యూ అధికా రులు మరో సర్వేను ప్రారంభించారు.

రివర్ బెడ్‌లో నివసించే ఇళ్ల వద్దకు వెళ్లి నిర్వాసితులుగా మారుతున్న వారికి పునరావాసంపై అవగాహన కల్పిస్తున్నారు. అందులో భాగంగానే మూసీ రివర్ బెడ్ నివాసితుల ఆధార్‌కార్డుతో పాటు వాటర్, ఎలక్ట్రికల్ బిల్లులు, నివాసితులు యాజమానులా.. అద్దెకు ఉంటున్నారా అనే వివరాలను సేకరిస్తూ ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌లో నమోదు చేస్తున్నారు. అంగీకారం తెలిపిన నివాసితుల ఇళ్ల గోడలపై ఆర్‌బి ఎక్స్ (రివర్ బెడ్) అనే అక్షరాలతో మార్కింగ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా, రివర్ బెడ్ సర్వేలో కొందరు నిర్వాసితులు తమ ఇళ్లను కూలగోడతానంటే ఒప్పుకునేది లేదని తెగేసి చెబుతున్నారు. 

మూడు జిల్లాల పరిధిలో 2,166 ఇళ్లు

మూసీ పరివాహక ప్రాంతంలోని బఫర్ జోన్ పరిధిలో దాదాపు 12 వేల ఆక్రమణలు ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ పనులు మరింత వేగవంతం చేసేందుకు ముందుగా రివర్ బెడ్ ఇళ్లను గుర్తించి, వారికి పునరావాసం కల్పించనున్నట్టు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. హైదరాబాద్, రంగా రెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని మూసీ రివర్‌బెడ్ ఇళ్లకు మార్కింగ్ చేసేందుకు రెవెన్యూ బృందాలు గురువారం రంగంలోకి దిగాయి. మొత్తం 2,166 ఇళ్లను తొలగించేందుకు అధికారులు గుర్తించారు. హైదరాబాద్ జిల్లాలో 1594, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 239, రంగారెడ్డి జిల్లాలో 332 నివాసాలున్నాయి.

వీరికి డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించి, రివర్ బెడ్ ఇళ్లను తొలగించేందుకు హైదరాబాద్ జిల్లాలో 16, రంగారెడ్డి జిల్లాలో 4, మేడ్చల్ జిల్లాలో 5 బృందాలు సర్వే పనులు ప్రారంభించాయి. ఈ బృందాలు స్థానిక పోలీసుల సహకారంతో ఇంటింటికి వెళ్లి వివరాలను నమోదు చేశారు. గండిపేట, రాజేంద్రనగర్, మండలాల పరిధిలో రాజేంద్రనగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రవికు మార్, ఆర్డీవో వెంకట్‌రెడ్డి, నార్సింగి మున్సిపల్ కమిషనర్ కృష్ణమోహన్‌రెడ్డి, బండ్లగూ డ జాగీరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శరత్‌చంద్ర, గండిపేట, రాజేంద్రనగర్ తహసీల్దార్లు, ఏసీపీ శ్రీనివాస్‌రెడ్డి పర్యటించారు.

చాదర్‌ఘాట్ సమీపంలోని శంకర్ నగర్, సంజయ్‌నగర్‌లో హిమాయత్‌నగర్ తహసీల్దార్ సంధ్యారాణి ఆధ్వర్యంలో సర్వే జరిగింది. ఈ సందర్భంగా.. ‘మా ఇళ్లను కష్టపడి కొనుకున్నాం.. ఇప్పుడొచ్చి కూలగొడ తానంటే ఉల్టా ఎక్కుతాం. ప్రాణం తీయనీకీ తయార్.. ప్రాణం ఇయ్యనీకీ తయార్’ అంటూ పాతబస్తీకి చెందిన ఓ మహిళ అధికారులను హెచ్చరించారు. ఉప్పల్‌లోని వినాయకసాగర్‌లోనూ వ్యతిరేకించారు. 

సైదాబాద్ మండలంలో..

సైదాబాద్ మండలం పరిధిలోని మూసారాంబాగ్ డివిజన్ సాయిలు హట్స్, అంబే ద్కర్ హట్స్ మూసీ పరీవాహక ప్రాంతాల లో స్పెషల్ ఆఫీసర్ రాజేశ్‌కుమార్, సైదాబా ద్ మండల తహసీల్దార్ జయశ్రీ, డిప్యూటీ తహసీల్దార్ కిరణ్ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు. సుమారు 25 నివాసాలకు, ముసారాంబాగ్  గోల్నాక రోడ్డు ప్రాంతం లో 17 ఇళ్లకు మార్కింగ్ చేశామని సైదాబాద్ తాసీల్దార్ జయశ్రీ తెలిపారు. తమ గూడు చెదురుతుందని తెలియడంతో వారు ఆందోళన చెందారు. సర్వే సందర్భంగా  ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు చాదర్‌ఘాట్, మలక్‌పే ట పోలీసులు ముందస్తుగా బందోబస్తు ఏర్పాటు చేశారు. 

మూసానగర్‌లో 120 ఇళ్లు

ఆజంపురా, పాతమలక్‌పేట డివిజన్‌ల పరిధిలోని మూసానగర్, శంకర్‌నగర్ మూసీ పరీవాహక ప్రాంతాల్లో హిమాయత్‌నగర్, షేక్‌పేట్, మారేడ్‌పల్లి తాసీల్దార్ల నేతృ త్వంలో మూడు బృందాలు సర్వే చేపట్టాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సర్వేలో రివర్ బెడ్ పరిధిలోని ఇళ్లకు మార్కింగ్ చేశారు. మూసానగర్, శంకర్ ప్రాంతాలలో 120 ఇళ్లకు మార్కింగ్ చేసినట్లు హిమాయత్‌నగర్ తహసీల్దార్ సంధ్యారాణి తెలిపారు. 

గోల్కొండ మండల పరిధిలో...

రెవెన్యూ, మూసీ రివర్ డెవలప్‌మెంట్ అధికారులు గురువారం గోల్కొండ మండలంలోని ఇబ్రహీంబాగ్, రాందేవ్‌గూడ, లంగర్‌హౌస్ పరిధిలోని ఆశంనగర్ తదితర ప్రాంతాల్లో సర్వే నిర్వహించారు. మూసి నది బెడ్‌లో ఇళ్లు నిర్మించుకున్న వారికి పునరావాసం కింద డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇస్తామని అధికారులు వెల్లడించారు. ఎంఆర్‌డీసీ(మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరే షన్) డిప్యూటీ కలెక్టర్ శివకుమార్, గోల్కొం డ తహసీల్దార్ అహల్య, రెవెన్యూ సిబ్బంది పోలీసు సిబ్బంది సాయంతో మూసీ బెడ్ ప్రాంతంలో ఉన్న నలభై ఇళ్లను గుర్తించారు. 

వెంకటసాయి కాలనీలో ఉద్రిక్తత

చైతన్యపురి, వెంకటసాయి కాలనీ ప్రజలకు, అధికారులకు మధ్య వాగ్వా దం జరగడంతో ఉద్రిక్తత నెలకొంది. తమ ఇండ్ల జోలికి వస్తే సహించేది లేదని నిర్వాసితులు హెచ్చరించారు. తాము ఏండ్ల నుంచి ఇక్కడే నివసిస్తున్నామని, అనుమతులు ఉన్నాయని, బ్యాం క్‌లో రుణాలు తీసుకుని ఇండ్లు కట్టుకున్నామని తెలిపారు. అనుమతులు తీసు కుని ఇండ్లు కట్టుకుంటే ఇప్పుడు ఇవీ అక్రమమని, కూల్చివేస్తామని చెప్పుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అధికారులను అడ్డుకున్నవారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తునట్టు సమాచారం. ఇండ్లు ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉన్నవారికి వనస్థలిపురం, హయత్‌నగర్, మన్సూరాబాద్‌లో నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇండ్లు ఇస్తామని చెప్పారు.

వెంకటసాయి కాల నీ, ఫణిగిరి కాలనీవాసులు తాము ఖాళీ చేయమని భీష్మించారు. చైతన్యపురిలోని సత్యానగర్, వినాయకనగర్, ఫణిగిరి కాలనీల్లో మూసీ రివర్ బెడ్ ప్రాంతాల్లోని ఇండ్లను ఉప్పల్ రెవెన్యూ అధికా రులు గుర్తించారు. 50 ఇండ్లకు మార్కిం గ్ చేశారు. సత్యానగర్‌లో అధికారుల నుంచి రంగు డబ్బాలను స్థానికులు గుంజుకున్నారు. ఫణిగిరి కాలనీ నుంచి నాగోల్ మూసీ వరకూ 225 ఇండ్లకు మార్కింగ్ చేశామని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా, కొత్తపేటలోని భవానీనగర్‌లో రోడ్డు నంబరు 10లో నివాసం ఉండే వారితో మేడ్చల్ కలెక్టర్ మాట్లాడారు. ఆ సమయంలో 11 మంది ఇండ్లను ఖాళీ చేస్తామని చెప్పడంతో వారికి వనస్థలిపురం, ప్రతాపసింగారం, తిమ్మాయి గూడెంలో డబుల్ బెడ్‌రూం ఇండ్లను కేటాయించి సర్టిఫికెట్లను అందజేశారు. ప్రభుత్వ ఆదేశాలతో తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.

మూసీ రివర్ బెడ్ ఇండ్ల వివరాలు

జిల్లా ఇండ్లు బృందాలు 

హైదరాబాద్ 1595 16

రంగారెడ్డి 239 4

మేడ్చల్ 332 5

మొత్తం 2166 25

మండలాల వారీగా రివర్ బెడ్ వివరాలు 

హైదరాబాద్ జిల్లాలో.. 

అంబర్‌పేట 64

ఆసిఫ్‌నగర్ 14

బహదూర్‌పురా 527

చార్మినార్ 3

గోల్కొండ 50

హిమాయత్ నగర్ 263

నాంపల్లి 604

సైదాబాద్ 70 

మొత్తం 1595

మేడ్చల్ జిల్లాలో ... 

ఘట్కేసర్

మేడిపల్లి 1

ఉప్పల్ 236

మొత్తం 239

రంగారెడ్డి జిల్లాలో... 

అబ్దుల్లాపూర్‌మెట్

గండిపేట 32 

రాజేంద్రగనర్ 3౦౦ 

మొత్తం 332