బీజేపీపై కేజ్రీవాల్ విమర్శలు
న్యూఢిల్లీ, డిసెంబర్ 29: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తప్పదని బీజీపీకి అర్థమైపోయిందని అందుకే పార్టీ గెలుపు కోసం కొత్త ఎత్తుగడలు వేస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణలు చేశారు. ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ఆపరేషన్ లోటస్ స్కామ్ పేరిట డిసెంబర్ 15 నుంచి విశ్వ ప్రయత్నాలు షురూ చేసిందని విరుచుకుపడ్డారు.
తాజాగా మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ లోటస్‌లో భాగంగా ఓటరు జాబితాను ట్యాంపరింగ్ చేస్తున్నారని పేర్కొన్నారు. కొన్ని రోజులుగా న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ తన ఆపరేషన్‌ను కొనసాగిస్తోంది.
ఈ 15 రోజుల్లో 5 వేల మంది ఓటర్లను తొలగించేందుకు కొత్తగా దరఖాస్తులు వచ్చాయి. అంతేకాకుండా 7,500 మంది ఓటర్లను జాబితాలో చేర్చేందుకు అప్లికేషన్లు వచ్చాయి. 12 శాతం ఓట్లలో అవకతవకలు జరుగుతోందని కేజ్రీవాల్ వాపోయారు.