30-04-2025 01:09:31 AM
హైదరాబాద్, ఏప్రిల్ 29 (విజయ క్రాంతి): ఆదివాసీల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ఆపరేషన్ కగార్‌ను తక్షణమే నిలిపేయాలని మంత్రి సీతక్క అన్నారు. శాంతియుత వాతావరణం నెలకొల్పడమే ప్రభుత్వాల లక్ష్యంగా ఉండాలని సూచించారు. మంగళవారం ప్రజాభవన్‌లో మంత్రి సీతక్కతో భారత్ బచావో సంస్థ ప్రతినిధులు గాదె ఇన్నయ్య, డా.ఎం.ఎఫ్ గోపీనాథ్, జంజర్ల రమేష్‌బాబు భేటీ అయ్యారు.
తెలంగాణ ఛత్తీస్‌గఢ్ సరిహద్దు కర్రెగుట్టలో నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని నిలువరించేలా చొరవచూపాలని మంత్రి సీతక్కను కోరారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడారు. మధ్య భారతంలోని ఆదివాసీ ప్రాంతాలు రాజ్యాంగంలోని షెడ్యూల్ పరిధిలోకి వస్తాయని, వారికి ప్రత్యేక హక్కులుంటాయని తెలిపారు. ఆదివాసీ ప్రాంతా ల్లో ప్రత్యేక పరిపాలన విధానాలుంటాయని, అందుకే ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించి వారి శాంతియుత జీవన విధానానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలన్నారు.
బల ప్రయోగంతో కాకుండా, చర్చల ద్వారా సమస్య పరిష్కారం జరిగేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాలని కోరారు. ఆదివాసీ హక్కులను కాలరాయొద్దని సూచించారు. ఆపరేషన్ కగార్‌తో ఆదివాసీలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మావోయి స్టుల శాంతి చర్చల ప్రతిపాదనకు కేం ద్రం సానుకూలంగా స్పందించాలన్నా రు. రెండువైపులా ప్రాణ నష్ట నివారణకు శాంతి చర్చలు మార్గం చూపుతా యని సీతక్క వెల్లడించారు.