05-04-2025 04:26:00 PM
సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఖానాపూర్ డివిజన్ కార్యదర్శి సునారికారి రాజేష్..
ఖానాపూర్ (విజయక్రాంతి): ఛత్తీస్గడ్ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కగార్ ఆపరేషన్ను వెంటనే నిలిపివేయాలని, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఖానాపూర్ డివిజన్ కార్యదర్శి సునారికారి రాజేష్ డిమాండ్ చేశారు. శనివారం ఖానాపూర్ విశ్రాంతి భవనంలో ఆ సంఘం, ఏప్రిల్ 8న హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ప్రజా ధర్నా కార్యక్రమం గోడ ప్రతులను ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వం ఎన్కౌంటర్ల పేరిట చత్తీస్గడ్ రాష్ట్రంలో హత్యకాండ చేస్తుందని, దీనిలో అత్యధికంగా ఆదివాసి జాతి నష్టపోతుందని, స్వదేశీ, విదేశీ కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల కోసం కగార్ ఆపరేషన్ చేపట్టి అమాయక ప్రజలను హతమార్చడం సిగ్గుచేటని, దీనిని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు, ఆలోచన పరులు, తీవ్రంగా వ్యతిరేకించాలని అన్నారు. అడవి సంపదను అదానికి అప్పగించడానికి ఈ ఆపరేషన్ చేపట్టారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం డివిజన్ నాయకులు దుర్గం లింగన్న, గోనే స్వామి, గూట్ల ప్రసాద్, రేగుల గంగన్న, రాములు, తదితరులు ఉన్నారు.