దండకారణ్యం మరోసారి పోలీసుల తుపాకీ మోతలతో ఉలిక్కి పడింది. దంతేవాడ-నారాయణ్ పూర్ జిల్లాల సరిహద్దుల్లోని అంబుడ్స్‌మన్ అటవీ ప్రాంతంలో శుక్రవారం జరిగిన భీకర ఎన్ కౌంటర్‌లో 36 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు పోలీసులు 31 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. 2026 ఏప్రిల్ నాటికి మావోయిస్టు ఉద్యమాన్ని తుడిచిపెడతామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించిన కొద్దిరోజులకే ఈ భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకోవడం గమనార్హం.
వాస్తవానికి చత్తీస్‌గఢ్‌లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి రాష్ట్రంలో మావోయిస్టుల ఏరివేత పెద్ద ఎత్తున ఊపందుకుంది. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా అడపాదడపా మావోయిస్టులపై దాడులు జరుగుతున్నా గత ఏడా ది కాలంగా జరిగిన రీతిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ బలగాల మధ్య పూర్తి సమన్వయంతో మావోయిస్టుల ఏరివేత కొనసాగలేదు.
రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ‘ఆపరేషన్ కగార్’ పేరిట మావోయిస్టులపై పెద్ద ఎత్తున యుద్ధం మొదలైంది. ఈ క్రమంలో ఇటీవల వరసగా జరుగుతున్న ఎన్‌కౌంటర్లలో భద్రతా బలగాలు ఏకపక్షంగా పైచేయి సాధిస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు జరిగిన ఎన్‌కౌంటర్లలో 185 మందికి పైగానే మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో మహిళా మావోయిస్టుల సంఖ్య 40కి పైగానే ఉంది.
ఇక వందల సంఖ్యలో మావోయిస్టులు, సానుభూతిపరులు భద్రతా దళాల ముందు లొంగిపోయారు. తాజాగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టులు పీఎల్‌జీఏ 5,6 కంపెనీలకు చెందిన సభ్యులుగా పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టులకు చెందిన ఒక కంపెనీ మొత్తాన్ని తుడిచిపెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.
అదేగనుక నిజమైతే మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఈ ప్రాంతంలో పోలీసుల కూంబింగ్ ఇంకా కొనసాగుతున్నట్లు దంతెవాడ అడిషనల్ ఎస్పీ ఆర్కే బర్మన్ చెప్పారు. పక్కా వ్యూహంతో రెండు రోజులపాటు ఆపరేషన్ చేపట్టినట్లు ఆయన తెలిపారు.ఈ ఎన్‌కౌంటర్‌లో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డుకు చెందిన 1500 మంది పోలీసులు పాల్గొన్నారన్నారు.
కాగా మృత దేహాలను పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాత చనిపోయింది ఎవరో తేలుతుందని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ చెప్పారు. ఘటనా స్థలంలో పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారని, వాటిలో ఏకే-47 రైఫిల్, ఎస్‌ఎల్‌ఆర్, ఇన్‌సాస్ ఎల్‌ఎంజితో పాటు పెద్దమొత్తంలో మందుగుండు సామగ్రి ఉందని చెప్పా రు.
కాగా ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన వారిలో అయిదు రాష్ట్రాల మోస్ట్‌వాంటెడ్ మావోయిస్టు నేతలున్నట్లు తెలుస్తోంది. మృతుల్లో 16 మందిపై రూ.1.30 కోట్ల రివార్డు ఉన్నట్లు సుందర్ రాజ్ చెప్పారు. దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ సభ్యురాలు నీతి అలియాస్ ఊర్మిళపైనే రూ.25 లక్షల రివార్డు ఉందన్నారు.
మృతుల్లో విజయవాడకు చెందిన కమలేశ్ అలియాస్‌తో పాటు మరికొందరు నేతలు, 13 మంది మహిళలు ఉన్నట్లు పోలీసు వర్గాల సమాచారం. ఈ ఎన్‌కౌంటర్ 24 ఏళ్ల రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్దదని ముఖ్యమంత్రి విష్ణుదేవ్ చెప్పారు. నక్సలిజం తుది శ్వాస తీసుకుంటున్నదని, రాష్ట్రంనుంచి నక్సలిజాన్ని పారదోలి తీరుతామని చెప్పారు. ఇందుకోసమే కేంద్ర హోంమంత్రి అమిత్ షా గత తొమ్మిది నెలల్లో రెండు సార్లు రాష్ట్రానికి వచ్చారని కూడా ఆయన తెలిపారు.
గత ఏప్రిల్‌లో బస్తర్ రీజియన్‌లోని కాంకేర్‌జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పలువురు కీలక నేతలతో పాటుగా 29 మందిని కోల్పోయిన మావోయిస్టులకు ఇది మరో గట్టి ఎదురు దెబ్బ అని చెప్పవచ్చు.
ఇప్పటికే పలువురు నేతలతో పాటు వందలాది మంది కేడర్‌కు కోల్పోయిన మావోయిస్టులు ఈ షాక్‌నుంచి తేరుకోవడం అంత సులభం కాదు. మావోయిస్టులను తుదముట్టించడమే లక్ష్యంగా పని చేస్తున్న కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల పద్మవ్యూహంనుంచి అది కోలుకొని మళ్లీ ఉద్యమాన్ని బలోపేతం చేసుకోవడం అంత తేలిక కాదని పరిశీలకుల అంచనా.