calender_icon.png 23 September, 2024 | 8:47 AM

ఆపరేషన్ గ్రిమ్ బీపర్

23-09-2024 02:24:12 AM

లెబనాన్ పేజర్ల పేలుళ్లకు కోవర్ట్ ఆపరేషన్

పక్కా ప్రణాళిక, సమన్వయంతో దాడి

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: లెబనాన్‌లో పేజర్లు, వాకీటాకీల పేలుళ్లకు జరిగిన పక్కా కుట్ర గురించి రోజుకో సంచలనం బయటకు వస్తున్నది. ఈ పకడ్బందీ ఆపరేషన్ కోసం ప్రత్యేక వ్యూహాలు, ప్రణాళికలతో ఇజ్రాయెల్ పనిచేసినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఈ కుట్రకు ‘ఆపరేషన్ గ్రిమ్ బీప్’ అని పేరు పెట్టినట్లు తెలిపింది. గత వారం లెబనాన్‌లో మూడువేల పేజర్లు, వాకీటాకీలు పేలిపోవటంతో 32 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ దాడులు చేసింది ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ మొసాద్ అని లెబనాన్ ఉగ్రసంస్థ హెజ్బొల్లాతోపాటు పలు సంస్థలు ఆరోపించగా, ఇజ్రాయెల్ మాత్రం స్పందించలేదు. 

ప్లాన్ వన్: హెజ్బొల్లా సప్లు చైన్‌ను ఛేదించిన మొసాద్

తనకు పక్కలో బల్లెంగా మారుతున్న హెజ్బొల్లాను ఊహించని విధంగా దెబ్బతీసేందుకు మొసాద్ పక్కా ప్లాన్ వేసింది. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన గూఢచారి సంస్థగా మొసాద్‌కు పేరుంది. అదే సమయంలో సాంకేతిక పరిజ్ఞానంలో ఇజ్రాయెల్ ఎంతో ముందున్నది. ఈ అనుకూలతను వినియోగించుకొని హెజ్బొల్లాకు కమ్యూనికేషన్ పరికరాలు ఎక్కడి నుంచి, ఏయే మార్గాల్లో చేరుతున్నాయనేది మొదట మొసాద్ గుర్తించగలిగింది. హెజ్బొల్లా నుంచి త్వరలో పేజర్ల కోసం ఆర్డర్ రాబోతున్నదని గుర్తించి హంగెరీలో ఓ బోగస్ సంస్థను స్థాపించింది. తైవాన్‌కు చెందిన పేజర్ల సంస్థతో ఒప్పందం చేసుకొని హెజ్బొల్లా ఆర్డర్ తనకే వచ్చేలా చేసింది. 

ప్లాన్ టు: అతిచిన్న పేలుడు పదార్ధాల తయారీ.. పేజర్లలో నిక్షిప్తం

హెజ్బొల్లా నుంచి 50 పేజర్ల కోసం ఈ ఏడాది మొదట్లో ఆర్డర్ వచ్చింది. ఎవరికీ అనుమానం రాకుండా పేలుడు పదార్ధాలు అమర్చటం కత్తిమీద సామే. కానీ, మొసాద్‌కు ఇది పెద్ద విషయమేమీ కాదు. కేవలం మూడు గ్రాముల బరువు ఉన్న పేలుడు పదార్ధాలతో కూడి వస్తువులను ఆ సంస్థ కోసం ఇజ్రాయెల్ రక్షణ సంస్థలు తయారుచేసినట్లు సమాచారం. వాటిని పేజర్లు తయారుచేసేటప్పుడే వాటిలో అమర్చారు. ఈ విషయం తెలియని హెజ్బొల్లా వాటిని దిగుమతి చేసుకొన్నది. 

ప్లాన్ త్రీ: సమన్వయ దాడి

పేజర్లలో పేలుడు డివైస్‌లనైతే అమర్చగలిగారు కానీ.. అవి హెజ్బొల్లాకు చేరిన తర్వాత చిన్న పొరపాటు జరిగి ఉగ్ర సంస్థ అసలు విషయం గుర్తించగలిగితే ప్లానంతా పాడైపోతుందని మొసాద్ భయపడింది. అందుకే కొన్ని నెలలపాటు ఆ పేజర్లను పేల్చేయకుండా మౌనంగా ఉండిపోయింది. ఈ ఏడాది మేలోనే సోలార్ ప్యానళ్ల రూపంలో పంపిన గూఢచర్య పరికరాలను లటాకియా పోర్టులో సిరియా పట్టుకొన్నది. దీంతో మొసాద్ మరింత జాగ్రత్తపడింది.