యువత రాజకీయాల్లోకి రావాలి
రాష్ట్ర కార్యదర్శి మధుర దాస్ రెడ్డి...
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆజాద్ అధికార్ సేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యాలయాన్ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుర దాస్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా తన పుట్టిన ఊరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. ప్రస్తుతం రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలనే ఆలోచనతో పార్టీలోకి రావడం జరిగిందని చెప్పారు. జాతీయ అధ్యక్షులు మాజీ ఐపీఎస్ అమితాబ్ ఠాకూర్ సిద్ధాంతాలకు జాతీయ ప్రధాన కార్యదర్శి మధురేంద్ర సింగ్ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా పదవి బాధ్యతలను చేపట్టానని తెలిపారు.
దేశ జనాభాలో యువత 65 శాతం ఉందని తెలియజేశారు. ముఖ్యంగా యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి తెలంగాణ రాష్ట్రం మొత్తం పార్టీని విస్తరింపచేయడానికి కృషి చేస్తానని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. రాజకీయాల్లోకి రావాలని ఆసక్తి కలిగిన వారిని ఆజాద్ అధికార్ సేన ఆహ్వానిస్తుందని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ అన్యాయం అనిచివేత, అవినీతికి వ్యతిరేకంగా గళమెత్తాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జ్ బోడికల ప్రేమ్ దయాల్, రాష్ట్ర అధ్యక్షులు అబైదీప్ తదితరులు పాల్గొన్నారు.