ప్రైవేట్ రంగంలో వేలకోట్ల పెట్టుబడులు సాధిస్తూ యువత ఉపాధి కల్పించేలా కృషి
ముఖ్యమంత్రి సభా ఏర్పాట్లపై పత్రికా సమావేశం రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
పెద్దపల్లి (విజయక్రాంతి): డిసెంబర్ 4న పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రంగంపల్లి సబ్ స్టేషన్ వద్ద లక్ష మందితో యువ శక్తి బహిరంగ సభ కార్యక్రమం ప్రభుత్వం నిర్వహిస్తుందని, ఇందులో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆదివారం పెద్దపల్లి మండలం రంగంపల్లి సబ్స్టేషన్ వద్ద ముఖ్యమంత్రి సభాస్థలి ప్రాంగణాన్ని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు, బిసి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రోటోకాల్ ప్రజా సంబంధాల ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ తో కలిసి పరిశీలించి, చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు.
అనంతరం పాత్రికేయులతో మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. 2023 ఎన్నికలలో తెలంగాణ ప్రజలు చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చారని, డిసెంబర్ 7న ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందని, గత సంవత్సర కాలంలో తెలంగాణ రైతులు ఎస్సీలు ఎస్టీలు, అణగారిన వర్గాలు, మహిళల మేలు కొరకు ప్రభుత్వం పని చేసిందని అన్నారు. యువతకు ఉపాధి వేగవంతంగా కల్పించాలని ఉద్దేశంతో ప్రభుత్వం 10 నెలల కాలంలో 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. డిసెంబర్ 4న పెద్దపల్లి వేదికగా యువశక్తి కార్యక్రమం పేరుతో బహిరంగ సభ నిర్వహించి గ్రూప్ 4 అభ్యర్థులు, ఇతర పరీక్షలలో ఎంపికై ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేస్తామని అన్నారు.
ప్రభుత్వంలో పోలీసులు టీచర్లు ఇంజనీర్ గ్రూప్ 1, గ్రూప్ 4 వదలవు అన్ని విభాగాలలో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తున్నామని, అదే కాకుండా ప్రైవేట్ సంస్థలో యువత ఉపాధి పొందేలా అవసరమైన నైపుణ్య శిక్షణ అందించేందుకు స్కిల్ యూనివర్సిటీ, టాస్క్ సెంటర్ వంటివి ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. రాష్ట్ర ముఖ్య మంత్రి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రానికి వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, వీటి ద్వారా ఏర్పాటయ్యే ఐటి, ఫార్మా, మొదలగు రంగాలలో వచ్చే పరిశ్రమలో స్థానిక యువతకు ఉపాధి అందించేలా చర్యలు చేపట్టామని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తున్నారని, రాజీవ్ ఆరోగ్య శ్రీ పరిధి 10 లక్షలకు పెంపు, గృహజ్యోతి కింద 24 యూనిట్లో ఉచిత విద్యుత్తు, సన్న రకం ధాన్యానికి 500 రూపాయల బోనస్ వంటి పథకాలు అమలు చేశామని అన్నారు.
స్వాతంత్రం వచ్చిన తరువాత దేశంలోని ఏ ఇతర రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మన రైతులు పండించారని మంత్రి తెలిపారు. ప్రభుత్వం సన్న రకం ధాన్యానికి బోనస్ ప్రకటించడంతో ప్రైవేట్ లో అధిక ధరకు సన్న రకాల అమ్ముడు పోతున్నాయని అన్నారు. 40 లక్షల మంది రైతులకు దాదాపు 35 నుంచి 40 వేల కోట్ల ఆదాయం రానుందని అన్నారు. రైతు రుణమాఫీ కింద 4 విడతలలో 24 లక్షల మంది రైతులకు 22 వేలకోట్ల రుణమాఫీ చేశామని అన్నారు. రైతు బీమా పథకం కొనసాగిస్తున్నామని, పంటల బీమా పథకాన్ని సైతం ప్రారంభించేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. ప్రజా సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తున్నందున డిసెంబర్ 4న జరిగే సీఎం సభకు పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.
మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ...
నిన్న ప్రభుత్వం 2740 కోట్లు విడుదల చేసి మరో మూడు లక్షల రైతులకు రుణమాఫీ పూర్తి చేసిందని అన్నారు. గత ప్రభుత్వం గ్రూప్ 1 నిర్వహించలేకపోయిందని, ప్రతిపక్షాలు అనేక ఆటంకాలు సృష్టించినప్పటికీ విజయవంతంగా పరీక్షలు నిర్వహించామని అన్నారు. డిసెంబర్ 4న జరిగే ముఖ్యమంత్రి సభకు పెద్ద ఎత్తున రైతులు, యువత మహిళలు పాల్గొని విజయవంతం చేయాలని, స్థానిక ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి సభను విజయవంతం చేసేందుకు కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేలు చింతకుంట విజయ రమణారావు, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, కవ్వంపల్లి సత్య నారాయణ, కరీంనగర్ జిల్లా కలెక్టర్ పామెలా సత్పతి, సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ, జగిత్యాల జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్, పెద్దపల్లి అదనపు కలెక్టర్ లు డి.వేణు, జే.అరుణ శ్రీ, అదనపు కలెక్టర్, రెవెన్యూ డివిజన్ అధికారులు, నీటిపారుదల శాఖ అధికారులు, పౌర సరఫరాల శాఖ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.