calender_icon.png 19 September, 2024 | 7:28 AM

మెడికల్ మాఫియాపై సీఎంకు బహిరంగ లేఖ

06-09-2024 06:14:16 PM

ఫార్మసి వ్యవస్థను నాశనం చేస్తున్న దళారి అసోసియేషన్ 

మందుల చాటున దోపిడీకి తెగబడిన వ్యాపారస్తులు. 

ఆర్థిక నేరాలలో ఆరితేరిన దళారులు. 

ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ప్రజల ప్రాణాలకు భరోసా ఏది..

తెలంగాణ ఫార్మసిస్టు అనుబంధ సంఘాల జేఏసీ కన్వీనర్ వాకిటి అశోక్ 

మహబూబ్ నగర్,(విజయక్రాంతి): ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న మెడికల్ మాఫియా ఆగడాలను అరికట్టకపోతే అమాయకుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని తెలంగాణ ఫార్మసిస్ట్ అనుబంధ సంఘాల జెఎసి  నాయకులు వాకిట అశోక్ కుమార్, కన్నెబోయిన శ్రీనివాస్, బాలరాజ్, సత్యనారాయణ గౌడ్, డాక్టర్ శివకుమార్ తేజావత్ సీతారాంబాబు, కురుమ శంకర్, ప్రొఫెసర్ గంప విజయకుమార్, అలీమ్ ఆదర్శ్, లక్ష్మీనారాయణలు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎంకు పలు అంశాలతో కూడిన ప్రత్యేక పుస్తకాన్ని తయారుచేసి నివేదిక రూపంలో బహిరంగ బహిరంగ లేఖతో సమాచారం చేరవేశారు. వారు చేరవేసిన నివేదికలో పలు అంశాలు ఇలా ఉన్నాయి.  దశాబ్దాలుగా మెడికల్ షాపుల వ్యాపారాన్ని కొనసాగిస్తున్న వారు  బహిరంగ ఆర్థిక నేరాలకు పాల్పడుతూ ప్రజల ఆరోగ్యాలతో చలగాటమాడుతున్నప్పటికీని ప్రభుత్వం, సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో పరిస్థితి చేజారిపోయింది.

ఫలితంగా మొత్తం ఫార్మాసి వ్యవస్థ బ్రష్టు  పట్టింది.. తెలంగాణ రాష్ట్రం లో గత పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ హయాంలో ఆ ప్రభుత్వంలో బడా బాబులను అంటగాగిన కెమిస్ట్ డ్రగ్గిస్ట్  అసోసియేషన్ మరియు దళారులు అంట కాగి దోపిడీకి తెగబడడంతో ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది.  డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ యాక్ట్ , ఫార్మసీ యాక్ట్ అమలు అమలు చేసే బాధ్యతను ప్రభుత్వము డ్రగ్స్ అధికారులు పూర్తిగా విస్మరించడంతో ఎక్కడ చూసినా మెడికల్ షాపులలో డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండానే విచ్చలవిడిగా స్థిరాయిడ్స్ మత్తుమందులు యాంటీబయాటిక్స్ విక్రయిస్తున్నారు. వాస్తవానికి ఫార్మసిస్ట్ అందుబాటులో ఉండి మందులు డిస్పెన్స్ చేయాలి, ఇక్కడ 90 శాతం మెడికల్ షాపులలో ఎందుకు విరుద్ధంగా కొంతమంది ఫార్మసిస్టుల సర్టిఫికెట్లు ఆద్దెలకు తీసుకొని వ్యాపారస్తులే దుకాణాలు నడిపిస్తున్నారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఈ వ్యవహారంపై గతంలో ఫార్మసి కౌన్సిల్ కు  డ్రగ్స్ అధికారులకు ఫిర్యాదు చేసిన ఎలాంటి చర్యలు లేకపోవడంతో మెడికల్ మాఫియా మరింత రెచ్చిపోతుంది. ఒక ప్రక్క ఫార్మసిస్ట్ పోస్టులు ఖాళీగా ఉండడం మరో పక్క మందుల షాపులలో  ఫార్మసిస్టులు లేకుండానే మందులు షాపుల నిర్వహణ కోసం అధికారులు లైసెన్సులు జారీ చేయడం తనిఖీ లు అసలు చేపట్టకపోవడం  కేసులు కూడా నమోదు చేయకపోవడం పలు కారణాలను చూస్తే డ్రగ్స్ అధికారులే మెడికల్ మాఫియాని పెంచి పోషిస్తు  పెద్ద ఎత్తున ఆర్థిక నేరాలరు తెరలేపారని తెలుస్తుంది  అమాయకుల నిరక్షరాస్యతను ఆసరాగా  చేసుకొని మందుల షాపు రిటైల్ కౌంటర్లలో  ఇష్టం వచ్చినట్లు మందులు విక్రయించడం ద్వారా వారు అనేక రోగాల బారిన పడి చనిపోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు మనం ప్రభుత్వ ఆసుపత్రిలో చూస్తే డయాలసిస్ కేసులు లెక్కలేనన్ని నమోదు అవుతున్నాయి, కిడ్నీ ఫెయిల్యూర్స్ లివర్ సంబంధిత, గుండె సంబంధిత వ్యాధులతో చనిపోతున్నారు.

మెడికల్ షాప్ కౌంటర్లలో యాంటీబయాటిక్స్ మత్తుమందులు విక్రయించే నాన్ క్వాలిఫైడ్ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. నాసిరకం మందులు ప్రజలకు అంటగట్టిన దళారులపై కఠిన చర్యలు చేపట్టాలి. ప్రజాల పాలన పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం సంతోషించదగ్గ విషయం .ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ లు ప్రజా ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టడం వల్ల కొంతమేరకు ఆశలు చిగురుస్తున్నాయి. మెడికల్ రంగంలో దలార్ల ఆటలు కట్టించి ముఖ్యంగా ఫార్మసిస్టు వ్యవస్థను నాశనం చేస్తున్న వారిపై ఏసీబీ అధికారుల ద్వారా దాడులు చేయించి డ్రగ్స్ అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన హైడ్రా ప్రాజెక్ట్ ప్రజల్లో మంచి పేరు తీసుకొచ్చింది. కబ్జాదారుల నుండి ప్రభుత్వ భూములను రక్షించడంతోపాటు చెరువులు,కుంటలు, కాలువలు నాళాలు అన్ని అన్యాక్రాంతం  కాకుండా కాపాడే ప్రయత్నం జరుగుతుంది. ఇదే స్ఫూర్తితో మెడికల్ రంగంపై కూడా ముఖ్యమంత్రి స్పందించి హైడ్రా తరహాలో ఒక ప్రత్యేక ప్రాజెక్టును చేపట్టి ఏళ్ల తరబడి కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్న మెడికల్ మాఫియాను బుడం నుంచి తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఈ మేరకు సమర్థవంతమైన ఐఏఎస్ అధికారిని ప్రత్యేక హోదాలో నియమించాలని వారి కోరారు. ముఖ్యమంత్రికి సమర్పించిన బహిరంగ లేఖలో ఆయనతోపాటు ఆరోగ్యశాఖ మంత్రి, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, హెల్త్ సెక్రటరీ, డైరెక్టర్ జనరల్ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, అన్ని జిల్లాల కలెక్టర్లకు ఎస్పీలకు వినతి పత్రాలు సమర్పించనట్లు తెలంగాణ ఫార్మసిస్టు అనుబంధ సంఘాల జేఏసీ నాయకులు తెలియజేశారు.