10-04-2025 12:33:30 AM
అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించాలి
కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 9 (విజ యక్రాంతి): జిల్లాలో ఓపెన్ 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో అదనపు ఎస్పీ ప్రభాకర్ రావు, ఆర్డీవో లోకేశ్వర్ రావు లతో కలిసి పరీక్షల నిర్వహణపై జిల్లా విద్య, వైద్య-ఆరోగ్య, రవాణా, ఆర్టీసీ విద్యుత్, గ్రామీణ నీటి సరఫరా, తపాలా శాఖల అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ప్రకటించిన కార్యచరణ ప్రకారం ఈ నెల 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు జిల్లాలో జరగనున్న 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. ఉద యం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ప్రతి రోజు 2 పేపర్లు ఉంటాయని, 10వ తరగతి పరీక్షల కొరకు ఆసిఫాబాద్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, కాగజ్ నగర్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, ఓపెన్ ఇంటర్మీడియట్ పరీక్షల కొరకు ఆసిఫాబాద్ మండల కేంద్రంలోని జనకాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కాగజ్ నగర్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
పరీక్ష కేంద్రాలలో త్రాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా, ఫ్యాన్లు, ఫర్నిచర్ ఉండేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి పరీక్ష కేంద్రంలో వైద్య సిబ్బం దిని నియమించి అవసరమైన మందులు, ఓ.ఆర్.ఎస్. ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని తెలిపారు. ఆర్.టి.సి. శాఖ అధికారులు విద్యార్థులకు సమయానుకూలంగా బస్సులు నడిపించాలని, గ్రామీణ నీటి సరఫరా అధికారులు పరీక్ష కేంద్రాలలో త్రాగునీటి ఏర్పాట్లు చేయాలని, నిరంతర విద్యుత్ సరఫరా జరిగేలా విద్యుత్ శాఖ అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. మున్సిపల్ శాఖ అధికారులు పరీక్షా కేంద్రాలలో పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని, పరీక్ష పేపర్లు పూర్తి బందోబస్తు మధ్య తరలించాలని, జవాబు పత్రాలను తపాలా శాఖ అధికారులు సంబంధిత శాఖల సమన్వయంతో వ్యవహరించాలని తెలిపారు.
ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించాలని, ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పరీక్షల కమిషనర్ ఉదయ్ బాబు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సీతారాం, రవాణా శాఖ అధికారి రామచందర్, విద్యుత్ శాఖ అధికారి శేషరావు, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.