calender_icon.png 6 March, 2025 | 6:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెల్లంపల్లి ఓపెన్ కాస్ట్, శాంతిఖని గని లాంగ్ వాల్ ప్రాజెక్ట్ ను అడ్డుకోవాలి

02-03-2025 06:38:51 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): రైతులు సమిష్టిగా సింగరేణి యాజమాన్యం చేపట్టనున్న ఓపెన్ కాస్ట్, శాంతిఖని గని లాంగ్ వాల్ ప్రాజెక్ట్ ను అడ్డుకోవాలని కార్మిక సంఘం నాయకులు రాజన్న కోరారు. ఆదివారం బెల్లంపల్లి మండలంలోని పెరిక పల్లి గ్రామంలో లాంగ్ వాల్ ప్రాజెక్టు వ్యతిరేఖ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో నిర్వాసిత రైతులతో మాట్లాడారు. లాంగ్ వాల్ ప్రాజెక్టుకు అడ్డుకునేందుకు స్థానిక నాయకులు జెండాలు, ఎజెండాలను పక్కనపెట్టి ఐక్యంగా ఉద్యమించాలన్నారు. లాంగ్ వాల్ ప్రాజెక్ట్ ఏర్పాటు వల్ల రైతుల జీవనాధారం పూర్తిగా దెబ్బతింటుందన్నారు. శాంతిఖని గని లాంగ్ వాల్ ప్రాజెక్ట్ 700 మీటర్ల నుండి 900 మీటర్ల లోతులో తీయడం వల్ల గని పరిసరాల్లో బోరు బావులు ఇంకిపోయే పరిస్థితి ఉందన్నారు.

లాంగ్ వాల్ ప్రాజెక్ట్ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు టీ. మణిరామ్ సింగ్ మాట్లాడుతూ... శాంతిఖని గని ఓపెన్ కాస్ట్ చేస్తామని మందమరి జిఎం వెల్లడించి బెల్లంపల్లి కార్మిక ప్రాంతంలో చిచ్చు రేపారన్నారు. రైతుల నుండి వ్యతిరేకత వ్యక్తంగడంతో జిఎం మాట మార్చి శాంతిఖని గని లాంగ్వాజ్ ప్రాజెక్టుగా చేస్తామని చెబుతున్నారని అన్నారు. శాంతిఖని 2 ఓపెన్ కాస్ట్ ప్రతిపాదన సింగరేణి ఆలోచనలో ఉందని చెప్పారు. సింగరేణి ప్రతిపాదించిన శాంతిఖని లాంగ్ వాల్ ప్రాజెక్టు వల్ల పెరిక పల్లి, బట్వాన్ పల్లి, గురిజాల, ఆకనపల్లి, పాత బెల్లంపల్లి, లింగాపూర్ గ్రామాల్లో రైతుల బ్రతుకులు నాశనమవుతాయన్నారు.

రైతులంతా సమిష్టిగా శాంతిఖని గని లాంగ్ వాల్ ప్రాజెక్టు పనులను అడ్డుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో కార్మిక పోరాటాల ఐక్యవేదిక నాయకులు గోగర్ల శంకర్, మాజీ సర్పంచ్ సింగతి సత్యనారాయణ, దొరిశెట్టి రాజన్న, ఆకి రెడ్డి శంకర్, చదువుల వెంకటరమణ , సింగతి రవి తో పాటు గ్రామానికి చెందిన నిర్వాసిత గ్రామాలకు చెందిన వంద మంది  రైతులు పాల్గొన్నారు.