calender_icon.png 27 April, 2025 | 7:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓయూ గాలికి, నేలకు వైబ్రేషన్

27-04-2025 12:00:00 AM

  1. ఓయూ 108వ ఆవిర్భావ వేడుకల్లో వక్తలు
  2. అవకాశం దొరికిన్నప్పుడల్లా ఓయూలోనే గడుపుతా: అందెశ్రీ
  3. ఆధునిక తెలంగాణ రూపకల్పనలో ఓయూ పాత్ర కీలకం: కేకే
  4. సమగ్ర ప్రతిభకు పర్యాయపదం ఓయూ విద్యార్థులు: సీపీ ఆనంద్

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): ఉస్మానియా యూనివర్సిటీ గాలికి, నేలకు వైబ్రేషన్ ఉంటుందని లోకకవి అందెశ్రీ అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ 108వ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా శనివారం ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించి న కార్యక్రమానికి అందెశ్రీతోపాటు కే కేశవరావు, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, ఎమ్మె ల్సీ కోదండరాం, ఓయూ వీసీ కుమార్ మొలగారం పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అందెశ్రీ మాట్లాడుతూ.. అవకాశం దొరికిన ప్రతి సందర్భంలోనూ ఓయూలో గడిపేందుకే ఇష్టపడు తానని చెప్పారు. అక్కడి చెట్ల కిందే ఎన్నో పాటలు రాసిన సందర్భాన్ని గుర్తు చేశారు. తాను రాసిన జయ జయహే తెలంగాణ జననీ జయ కేతనం తెలంగాణ రాష్ట్ర గీతం కావటం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేశవరావు మాట్లాడుతూ.. ఆధునిక తెలంగాణ రూపకల్పనలో ఓయూ పాత్ర కీలకమైనదన్నారు. విద్య, పరిశోధనా రంగాల్లో ఓయూ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. విద్యారంగానికి ప్రాధాన్యత ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తుందని, ఓయూ సహా రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలకు అవసరమైన సహకారం అందిస్తామని స్పష్టం చేశారు.

సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. ఓయూ విద్యార్థులు సమగ్ర ప్రతిభకు పర్యాయపదంగా అభివర్ణించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ఉస్మాని యా విశ్వవిద్యాలయం ద్వారా విద్యార్థులు, అధ్యాపకులు కీలక భూమిక పోషించే అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చా రు. అతి చిన్న వయసులో ఐపీఎస్ అధికారిగా ఎంపికయ్యానని, ఓయూకు రుణపడి ఉన్నానన్నారు.

ఏడో నిజాం హెచ్‌ఈహెచ్ మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ మనవడు నవాబ్ మీర్ నజాఫ్ అలీఖాన్ మాట్లాడుతూ.. తన తాత దూరదృష్టి పట్ల భావోద్వేగానికి లోనయ్యాడు. నిజాం వారసుడిగా ఉస్మానియా విజయాలను చూసి గర్విస్తున్నానని అన్నారు. ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. 1966లో నియమించపడ్డ కొఠారి కమిషన్ విద్యారంగానికి ఆరు శాతం నిధులు కేటాయించాలని కోరుకున్నప్పటికీ నేటికీ నాలుగు శాతానికి మించి కేటాయింపులు జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యారంగంపై  అజమాయిషీ చేయటానికి కేంద్రప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని పేర్కొన్నారు. ఓయూ వీసీ కుమార్ మాట్లాడుతూ.. యూనివర్సిటీ పూర్వవైభవానికి కృషి చేస్తాం అని చెప్పారు. విద్యా, పరిశోధనా రంగాల్లో ఓయూ ఉత్తమ ఫలితాలు సాధిస్తుందని చెప్పుకొచ్చారు. కమిషనర్ కాలేజియేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ దేవసేన మట్లాడుతూ..  ప్రభుత్వం నుంచి ఓయూకు అవసరమైన సహకారాన్ని అందించేందుకు కృషి చేస్తానని చెప్పారు.

ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నరేష్‌రెడ్డి, ఓఎస్డీ ప్రొఫెసర్ జితెందర్ కుమార్‌నాయక్, యూజీసీ వ్యవహారాల డీన్ ప్రొఫెసర్ లావణ్య, విద్యార్థి వ్యహారాల డీన్ ప్రొఫెసర్ రాజేంద్రనాయక్, కార్యక్రమ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ కొండానాగేశ్వర్ రావు, ప్రిన్సిపాళ్లు, డీన్లు, డైరెక్టర్లు, ఉద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగులు పాల్గొన్నారు.