calender_icon.png 1 March, 2025 | 3:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్టీ జెండా మోసినవారికే గుర్తింపు

01-03-2025 12:37:33 AM

రాహుల్‌ను ప్రధాని చేయడమే ఎజెండా

అప్పటిదాక విశ్రమించేది లేదు

ఈనెల 10లోపు నామినేటెడ్ పోస్టుల భర్తీ పూర్తి

పీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 

హైదరాబాద్, ఫిబ్రవరి 28 (విజయక్రాంతి): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీని ప్రధానిని చేసే వరకు కసితో పనిచేయాలని, మోదీని గద్దెదించే వరకు ప్రతి ఒక్కరూ కష్టపడాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపు నిచ్చారు. రాహుల్ గాంధీ పట్టుదలతోనే కులగణన, ఎస్సీ ఉపకులాల వర్గీకరణ చేయగలి గామన్నారు.

రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే ఎజెండాగా పనిచేయాలని సీఎం సూచించారు. మీనాక్షి నటరాజన్‌ను తెలంగాణకు ఇన్‌చార్జ్‌గా నియమిం చడం హర్షణీయ మన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అధ్యక్షతన శనివారం గాంధీభవన్‌లో జరిగిన పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు.. ‘ ‘పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. పార్టీ జెండా మోసినవారికి కచ్చితంగా గుర్తింపు ఉంటుంది. సుదీర్ఘకాలంగా పనిచేసినవారికి కొం తమందికి అవకాశాలు రాలేదు. వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీపై ఉంది.

రాబోయే రోజుల్లో వారికి ప్రాధాన్యం కల్పిస్తాం. వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్న కార్పొరేషన్లు, మార్కెట్ కమిటీలు, నామినేటెడ్ పోస్టుల భర్తీ చేయాల్సి ఉంది. మార్చి 10 లోగా అన్ని జిల్లాల్లో నియామకాలు ఇచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇన్‌చార్జ్ మంత్రులకు ఆదేశాలు ఇస్తున్నాం. పనితీరు సరిగాలేని వారికి రెన్యూవల్ ఉండదు. మంచిని మైక్‌లో చెప్పం డి.. చెడును చెవిలో చెప్పాలని విజ్ఞప్తి చేస్తున్నా. ” అన్నారు.

 కాంగ్రెస్ చిత్తశుద్ధికి నిదర్శనం.. 

దేశంలోనే అత్యధిక విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షిస్తున్న రాష్ర్టం తెలంగాణ అని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని సీఎం రేవంత్ పేర్కొన్నారు. రాష్ర్టంలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకున్నామని, స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసు కోబోతున్నామని, దీనిద్వారా దేశానికి కొత్త మోడల్‌ను క్రియేట్ చేస్తున్నామన్నారు. మహిళలు, రైతులు, పేదలు సహ అన్ని వర్గాలకు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. 

నా బ్యాగులు ఎవరూ మోయవద్దు..

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షినటరాజన్ 

కార్యకర్తలు ఫోన్ చేసిన మాట్లాడుతానని, ఫ్లెక్సీలు, ఫొటోలు పెడితే నాయకులు ఎన్నికలో గెలవరని.. ప్రజల్లో ఉంటేనే గెలుస్తారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షినటరాజన్ పార్టీ శ్రేణులకు సూచించారు. “ నా కోసం రైల్వే స్టేషన్లకు లీడర్లు రావొద్దు.. నా బ్యాగ్‌లు ఎవరూ మోయవద్దు..” అంటూ హితువు పలికారు.

పేదల మొఖంలో నవ్వులు చూసినప్పుడే పనిచేసినట్టని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ, బీఆర్‌ఎస్‌లతో పోరాటం చేయాల్సి ఉందన్నారు. రాష్ర్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అనేక కార్యక్రమాలు చేపట్టారని, ఇవన్నీ ప్రజలకు సక్రమంగా అందాలని సూచించారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ కులగణన చేపట్టామని, ఇది చాలా గొప్ప విషయమని కొనియాడారు. గ్రామగ్రామానికి వెళ్లి జైబాపు, జైభీమ్, జైసంవిధాన్ కార్యక్రమాలను పెద్దఎత్తున చేపట్టాలన్నారు. పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని, ఈ విషయంలో పీసీసీ పకడ్బందీగా కాలెండర్ సిద్ధం చేయాలని సూచించారు. 

కార్యకర్తల పోరాటంతోనే అధికారంలో

 పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ 

కార్యకర్తల పోరాట ఫలితమే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, కాంగ్రెస్ అధిష్ఠానం ఇచ్చిన మాటను నమ్మి ప్రజలు అధికారం ఇచ్చారని  పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ చెప్పారు. పీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల మాజీ ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీకి ధన్యవాదాలు  తెలియజేస్తూ తీర్మానం చేశారు.

అనంతరం పీసీసీ చీఫ్ మాట్లాడుతూ.. కేసీఆర్ పదేళ్లలో ఇవ్వలేని ఉద్యోగాలను మనం ఏడాదిలోనే (56 వేల ఉద్యోగాలు) ఇచ్చామన్నారు. కులగణన దేశానికి దశ దిశగా మారిందన్నారు. పతీ ఒక్కరూ మీనాక్షి నటరాజన్ మాదిరిగా సింప్లిసిటీని అలవాటు చేసుకోవాలని సూచించారు.

ప్రచారంలో వెనకబడ్డాం..  

ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రపంచంలో అనేక దేశాల కంటే మిన్నగా ఇండియా అభివృద్ధి చెందడానికి కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణమని రాష్ట్రమంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. రాష్ర్టంలో కులగణన, ఎస్సీ వర్గీకరణకు పార్టీ కట్టుబడి ఉందని, ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదికను పూర్తిగా అమలు చేస్తామన్నారు.

కులగణన కూడా పకడ్బందీగా నిర్వహించామని, ఎవరికీ అన్యాయం జరగకుండా చేశామని తెలిపారు. కులగణనలో పాల్గొనని కేసీఆర్ కుటుంబం సామాజిక న్యాయం కోసం మాట్లాడుతోందని మండిపడ్డారు. ఏడాది కాలంలో అనేక పనులు చేసినా ప్రచారంలో వెనకబడ్డామన్నారు.