calender_icon.png 21 January, 2025 | 1:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అలాంటి పిచ్చి మనవాళ్లకే ఉంది!

12-08-2024 12:00:00 AM

రవితేజ నటించిన ‘మిస్టర్ బచ్చన్’ మూవీ ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం వరుస ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటోంది. ఈ నేపథ్యంలో ఏర్పాటుచేసిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రవితేజ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. “రైడ్’ రీమేక్ చేయమని గతంలో ఒకరు నన్ను అడిగారు. అప్పుడు  నాకు ఆసక్తి లేదు. కథ నచ్చినప్పటికీ సీరియస్‌నెస్ ఎక్కువగా ఉందని ఆలోచించా. ఈ ప్రాజెక్టులోకి హరీశ్ శంకర్ ఎప్పుడైతే అడుగు పెట్టారో, అప్పుడు నమ్మకం వచ్చింది. తెలుగువాళ్లకు అనుగుణంగా దాన్ని ఆయన మార్చగలడని నాకు తెలుసు. గతంలో అది నిరూపితమైంది.

ఈ సినిమా చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతారు. ‘రైడ్’ను చూసినవాళ్లు మా సినిమా చూశాక.. దాన్ని తప్పకుండా మర్చిపోతారు” అని చెప్పారు. స్టార్ హీరోల బర్త్‌డే సందర్భంగా వారి సినిమాల రీరిలీజ్ ట్రెండ్ నడుస్తున్న విషయమై రవితేజ స్పందిస్తూ.. ‘పాత సినిమాలు మళ్లీ థియేటర్లలోకి వచ్చి భారీ కలెక్షన్లు రాబట్టడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ ట్రెండ్ మన (టాలీవుడ్) దగ్గరే ఉంది. నిజంగా మన ప్రేక్షకులు దేవుళ్లే. వాళ్లు సినిమాను ఎంతలా ప్రేమిస్తారో ఈ రీరిలీజ్ కలెక్షన్లను చూస్తే అర్థమవుతోంది. ఒక పాత సినిమాను ఉదయం 6.30కి థియేటర్‌కు వెళ్లి చూడటం ఆశ్చర్యకరం. అప్పట్లో చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు రిలీజ్ అయితే ఉదయం ఏడింటికి వెళ్లి చూసేవాళ్లం.

అవి కొత్త సినిమాలు కాబట్టి అంత పొద్దున్నే వెళ్లేవాళ్లం. కానీ, ఇప్పుడు తెల్లవారుజామున 5 గంటలకే వెళ్లి చూస్తున్నారు. నిజంగా వాళ్లు చాలా గ్రేట్. ఇలాంటి పిచ్చి మనవాళ్లకు తప్ప ఎక్కడా లేదు’ అన్నారు రవితేజ. అయితే, తాను మాత్రం అమితాబ్ బచ్చన్ ‘షోలే’ సినిమా రీ రిలీజ్ కావాలని కోరుకుంటానని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు ఈ బిగ్ బీ ఫ్యాన్.